నవ్విపోదురు గాక… మాకేటి సిగ్గు అనే తరహాలో ఏపీ ప్రతిపక్ష నేతల తీరు తయారైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీపై విమర్శలు చేయడమే తప్ప ఆత్మ పరిశీలన చేసుకోవాలనే కనీస ఇంగితం కూడా ప్రతిపక్షాల్లో కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాది మార్చిలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు వేయనివ్వలేదని, తిరిగి రీనోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా డిమాండ్ చేశాయి. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మాత్రం ఆగిన చోట నుంచే తిరిగి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎస్ఈసీ నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అయితే వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రత్యర్థుల దౌర్జన్యాల వల్ల నామినేషన్లు వేయలేకపోయామని ఆధారాలతో వస్తే పరిశీలిస్తామని ఎస్ఈసీ ప్రకటించారు. ఈ మేరకు కొంత మంది అభ్యర్థులు ఆధారాలు సమర్పించడం, కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు నిర్ధారణ అయిన చిత్తూరు జిల్లా తిరుపతి కార్పొరేషన్లో 6, పుంగనూరులో 3, కడప జిల్లా రాయచోటిలో 2 వార్డుల్లో 11 మంది అభ్యర్థులు తిరిగి నామినేషన్లు వేసేందుకు నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు. వీరిలో కేవలం నలుగురు మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. తిరుపతిలో ముగ్గురు, రాయచోటిలో ఒకరు నామినేషన్లు వేశారు. ఏడుగురు అభ్యర్థులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
కేవలం మీడియా అటెన్షన్ కోసం ప్రతిపక్ష పార్టీలు నానా యాగీ చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో అభ్యర్థులను నిలపాలనే ఆసక్తి లేదని ఈ ఘటనతో తేలిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఎస్ఈసీ ప్రత్యేకంగా అవకాశం ఇచ్చినా అభ్యర్థులను నిలపలేకపోవడానికి కారకులెవరు? ఇప్పుడు కూడా అధికార పార్టీ తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయనివ్వలేదని ప్రతిపక్షాలు చెబుతాయా?
ఎస్ఈసీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి టీడీపీ, జనసేన పార్టీలు ఎందుకు ముందుకు రాలేదు? ఎంతసేపూ మీడియాలో ఏదో జరిగిపోతోందన్న ప్రచారంతో రాజకీయ పబ్బం గడుపుకోవాలనే యావలో పడి …తమ గోతిని తామే తవ్వుకుంటున్నామనే వాస్తవాన్ని ఇప్పటికైనా ఆ పార్టీలు గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిది. ఎందుకంటే మన పతనానికి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.