నారా లోకేశ్‌కు ఆయన పార్టీ అనుకూల శత్రువైంది. లోకేశ్ విషయంలో పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఆయన్ను భ్రష్టు పట్టిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యుద్ధ సమయంలో కదనరంగంలో పోరాటానికి వదలకుండా, సోషల్ మీడియాలో ఆడుకునేందుకు విడిచి పెట్టడం వల్లే లోకేశ్ అసమర్థుడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, లోకేశ్ ప్రచారం చేస్తే, వచ్చే ఓట్లు కూడా పోతాయనే ప్రచారం పెద్ద ఎత్తున తెరపైకి వస్తోంది.
ప్రస్తుతం పురపాలక ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలంగా ఉందని, పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు మిగిలిన పార్టీలు కూడా బలంగా నమ్ముతున్నాయి. అలాంటిది కీలకమైన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నారా లోకేశ్ వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అసలే లోకేశ్ నోరు తెరిస్తే …తప్పులో కాలేస్తూ ప్రత్యర్థులకు బలమైన వ్యంగ్య ఆయుధాలు ఇస్తుంటారు. తెలుగు మాట్లాడ్డంలో తానెంతో మెరుగుపడ్డానని లోకేశ్ చెప్పుకుంటుంటారు. లోకేశ్ ప్రచారానికి వస్తే తమ నెత్తిన పాలు పోసినట్టే అని అధికార పార్టీ నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుండడం తెలిసిందే.
వైసీపీ విమర్శలకు భయపడిన టీడీపీ …లోకేశ్ ప్రచారానికి వెళితే నిజంగానే తమ ఓట్లు ప్రత్యర్థులకు వెళ్తాయని, ఆయన తప్పులు మాట్లాడుతూ పార్టీని అభాసుపాలు చేస్తారని టీడీపీ శ్రేణులు భయాందోళనలో ఉన్నాయి. అందుకే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి లోకేశ్ వెళ్లకుండా టీడీపీ అతి జాగ్రత్తలు తీసుకోవడం విమర్శలకు దారి తీసింది.
లోకేశ్ విషయంలో టీడీపీ చేష్టలు ఆయన్ను చేతగాని వాడని అధికార ముద్ర వేసినట్టవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. ఇలా ఎన్నాళ్లు ఆయన్ను దాచి పెడతారో అర్థం కావడం లేదని వారు అంటున్నారు. మరోవైపు కీలకమైన పుర ఎన్నికల ప్రచారానికి లోకేశ్‌ను ఎందుకు తీసుకురాలేదని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
బుజ్జి కన్నా, ఒక్కసారి ఎన్నికల ప్రచారానికి రా నాన్నా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికలపై ఉత్తరకుమారుడిలా ప్రగల్భాలు పలికిన లోకేశ్, ఇప్పుడు పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికల గురించి మాత్రం నోరు మెదపడం లేదంటూ ప్రత్యర్థులు దెప్పి పొడిస్తున్నారు.