ధోనీకి ఆ రికార్డ్‌ దక్కుతుందా.?

క్రికెటర్‌గా మహేంద్రసింగ్‌ ధోనీకి వున్న ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ధోనీ అంటే ఓ పేరు కాదు, అదో బ్రాండ్‌. కోట్ల రూపాయలు గుమ్మరించేశాయి పలు కంపెనీలు ధోనీ మీద, తమ కంపెనీలకు…

క్రికెటర్‌గా మహేంద్రసింగ్‌ ధోనీకి వున్న ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ధోనీ అంటే ఓ పేరు కాదు, అదో బ్రాండ్‌. కోట్ల రూపాయలు గుమ్మరించేశాయి పలు కంపెనీలు ధోనీ మీద, తమ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండేందుకు. ఇప్పుడూ ధోనీకి ఆ విషయంలో పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. 

ఇక, ధోనీ బయోపిక్‌ విషయంలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా.. ఆ మాటకొస్తే, దేశమంతటా పలు నగరాల్లో తిరుగుతూ, 'ధోనీ' సినిమాకి పబ్లిసిటీ చేస్తున్నారు. 'ఎంఎస్‌ ధోనీ : ది అన్‌ టోల్డ్‌ స్టోరీ' పేరుతో అరుణ్‌ పాండే నిర్మించిన ఈ చిత్రానికి నీరజ్‌ పాండే దర్శకుడు. 

ఈ మధ్యనే హైద్రాబాద్‌కి వచ్చిన ధోనీ, ఈ సినిమా గురించి ఓ రేంజ్‌లో మాట్లాడేశాడు. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి అయితే, ధోనీకన్నా కర్మయోగి అయిన క్రికెటర్‌ మనకి ప్రస్తుత క్రికెట్‌లో ఎవరైనా దొరుకుతారా.? అని ప్రశ్నించేశాడు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని కలిశాడు ధోనీ. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ని సీన్‌లోకి లాగుతున్నారు. ఈ హంగామా చూస్తోంటే, 'ఇంత పబ్లిసిటీ అవసరమా.?' అన్న అనుమానం కలగకమానదు. 

సినిమా తెరకెక్కించడం ఓ ఎత్తు.. దాన్ని మార్కెటింగ్‌ చేసుకోవడం ఇంకో ఎత్తు. ఇప్పుడు మార్కెటింగ్‌ స్ట్రాటజీ నడుస్తోంది 'ఎంఎస్‌ ధోనీ : ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాకి. ఆ మార్కెటింగ్‌ సత్తా ఏంటంటే, తొలి రోజు వసూళ్ళలో రికార్డులు సాధించడమే.. అని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. మరి, ధోనీకి ఆ రికార్డ్‌ దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.