క్లింటన్ ఫౌండేషన్ గురించి యిప్పటికే పేపర్లలో వచ్చేసింది. హిల్లరీ పదవిలో వుండగా ఆమెరికా సాయం పొందాలనుకున్న దేశాధినేతలు ఆ ఫౌండేషన్‌కు విరాళాలు యిచ్చేవారని అందరికీ తెలిసిపోయింది. ఇక దాని గురించి ట్రంప్ రెచ్చిపోతూ వుండగానే ''వాషింగ్టన్ పోస్ట్'' పత్రిక ట్రంప్ ఫౌండేషన్ నిర్వాకాల గురించి బయటపెట్టింది. క్లింటన్ ఫౌండేషన్‌తో పోలిస్తే దీని సైజు 1% మాత్రమే. అది కొన్నయినా మంచి పనులు చేసిందని చెప్తున్నారు కానీ యిప్పటిదాకా బయటకు వచ్చిన వివరాల ప్రకారం ట్రంప్ ఫౌండేషన్ అతని వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసమే పనిచేసింది. ఉదాహరణకి 2007లో ట్రంప్ ఆరడగుల చిత్రపటం తయారు చేశారు. దాన్ని అతని భార్య ఫౌండేషన్ తాలూకు 20 వేల డాలర్ల డబ్బు పెట్టి కొని, అతనికే బహూకరించింది. అతని గోల్ఫ్ క్లబ్బుల్లో ఒకదాని బెడ్‌రూములో దాన్ని తగిలించారు. ట్రంప్‌కు ఫ్లారిడాలోని పామ్ బీచ్‌లో మార్-ఎ-లాగో క్లబ్బుంది. అక్కడ 2007లో 80 అడుగుల పెద్ద స్తంభాన్ని నిలబెట్టాడు.
సిటీ నియమాల ప్రకారం 42 అడుగుల ఎత్తుకు మించి ఏదీ పెట్టకూడదు. అందువలన రోజుకి 1250 డాలర్ల ఫైన్ చొప్పున మొత్తం 120000 డాలర్ల జరిమానా వేశారు. అది అన్యాయమంటూ ట్రంప్ సిటీ పాలక వ్యవస్థ మీద కేసు పడేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఎలా రాజీ కుదిరిందో తెలియదు కానీ ఆ నగరంలోని సిటిజన్స్ యునైటెడ్ అనే సంస్థకు ట్రంప్ లక్ష డాలర్ల విరాళం యిచ్చేశాడు, సిటీ పాలక వ్యవస్థ జరిమానా మాఫీ చేసేసింది. ఈ లక్ష డాలర్ల విరాళం ట్రంప్ తన క్లబ్బు ఖజానాలోంచి యివ్వలేదు, తన ఫౌండేషన్ నిధుల్లోంచి యిచ్చి పెద్ద దాతగా పోజు కొట్టాడు. దీనిలో మరో తిరకాసు కూడా వుంది. ఆ నగరంలో అనేక ధార్మిక సంస్థలుండవచ్చు, దీనికే ఎందుకు యిచ్చాడంటే యిది ఒక రైటిస్టు సంస్థ. రాజకీయ పార్టీలకు వ్యాపారస్తులు యిచ్చే విరాళాలు బహిర్గతం చేయనక్కరలేదని వాదించే ఆర్గనైజేషన్. దానికి అధిపతిగా వున్న డేవిడ్ బాసీ అనే అతను ట్రంప్‌కు ఆప్తుడు. ప్రస్తుతం అతని డిప్యూటీ కాంపెయిన్ మేనేజర్!
ట్రంప్ యూనివర్శిటీ వ్యవహారాలపై 2013లో ఫ్లారిడా ఎటార్నీ జనరల్ విచారణ జరుపుతూన్న సమయంలో ఆమె ఎన్నికల ప్రచారానికై ట్రంప్ ఫౌండేషన్ 25 వేల విరాళం యిచ్చింది. ట్రంప్ యూనివర్శిటీ యిచ్చే డిగ్రీల్లాగే ట్రంప్ ఫౌండేషన్ విరాళాలూ బోగస్‌గా వున్నట్లున్నాయి అంటోంది హిల్లరీ తరఫున అధికార ప్రతినిథి క్రిస్టీనా రేనాల్డ్స్. ట్రంప్ ఫౌండేషన్ యిచ్చిన విరాళాలలో 2,58,000 డాలర్ల దానం యిలాటిదే అని సందేహించిన పాత్రికేయులు కూపీ లాగుతున్నారు. ఇవన్నీ బయటకు వస్తే తన యిమేజి భంగం అని భయపడిన ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వున్న తన సంస్థల్లోని ఉద్యోగులెవరూ సమాచారం యివ్వకూడదని శాసించాడు.
అంతేకాదు, బయటపెట్టం అని ఉద్యోగుల చేత లిఖితపూర్వకంగా హామీలు తీసుకుంటున్నాడు.ఇంతకీ ట్రంప్ ఫౌండేషన్ విషయంలో గొప్ప తమాషా ఏమిటంటే దానిలో చాలాభాగం యితరులు యిచ్చిన విరాళాలట, 2009 నుంచి ట్రంప్ ఒక్క సెంటు కూడా యివ్వలేదట. మరి అలా యిచ్చిన పుణ్యాత్ములెవరో ట్రంప్ వెల్లడిస్తే బయటకు వస్తాయి. ముందు అతను తన ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్‌స్ బయటపెడితే యింకా చాలాచాలా సంగతులు తెలుస్తాయి. గైడ్‌స్టార్ అనే సంస్థ క్లింటన్ ఫౌండేషన్ ఆదాయవ్యయాల్లో పారదర్శకత వుందనీ, ట్రంప్ ఫౌండేషన్ 2012 -2014 మధ్య యిచ్చిన 32 లక్షల డాలర్ల గురించి వివరాలు చెప్పటం లేదని, వారిలో పారదర్శకత లేదని అంటోంది. చూడబోతే హిల్లరీలో రాజకీయంగా నిజాయితీ లేదని, ట్రంప్‌లో ఆర్థికంగా నిజాయితీ లేదని అనిపిస్తోంది.
ఫోటో – ఈ ఎన్నికలలో ఓట్ల కోసం ఫౌండేషన్ నిధులు వాడుతున్న ట్రంప్
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)