మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో మెసేజ్ చెప్పాలంటే కొంచెం కష్టమైన పనేనంటుంది రాధికా ఆప్టే. పోనీ, కష్టపడి మెసేజ్ ఇద్దామనుకుంటే, ఆ సినిమా కోసం పెట్టిన బడ్జెట్ నేపథ్యంలో కమర్షియల్ అంశాలు తప్పనిసరైపోతాయనీ, తద్వారా కాన్సెప్ట్ దెబ్బ తింటుందని రాధికా ఆప్టే అభిప్రాయపడింది. మెసేజ్ ఓరియెంటెడ్ అటెంప్ట్ చెయ్యాలంటే దానికి పెర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ షార్ట్ ఫిలింస్ మాత్రమేనని స్పష్టం చేసిందీ బ్యూటీ.
తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా వుండడమే కాదు, అడపా దడపా షార్ట్ ఫిలింస్‌లోనూ హాట్ హాట్‌గా నటించి సంచలనాలు సృష్టించడంలో రాధికా ఆప్టే రూటే సెపరేటు. 'పర్చేద్' సినిమా ఏ స్థాయిలో సంచలనాలకు తెరలేపిందో (విడుదలకు ముందే) ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే రాధికా ఆప్టే నటించిన 'అహల్య' అప్పట్లో పెద్ద హిట్. చెప్పుకుంటూ పోతే చాలా షార్ట్ ఫిలింస్ ఉన్నాయి ఆమె నటించినవి.
ఇక, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాధికా ఆప్టే, ఓ సౌత్ ఇండియన్ ఫిలింలో నటిస్తున్నప్పుడు అక్కడ తనకు లైంగిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయంటూ అందర్నీ నివ్వెరపరిచింది. సినీ రంగంలో అక్కడక్కడా ఇలాంటివి మామూలేననీ, తాను మాత్రం ధైర్యంగా ఆ ఘటనను ఎదుర్కొన్నాననీ చెప్పుకొచ్చింది. ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించేందుకు సాహసించబోయాడన్నది ఆమె ఆరోపణ. దాంతో ఒక్కసారిగా దక్షిణాది సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.