బాబు బంగారం మాంచి హైప్ మధ్య విడుదలైంది. ఒకపక్క డైరక్టర్ మారుతి భలే భలే మగాడివోయ్. మరోపక్క బ్యానర్ వాల్యూ, ఇంకోపక్క వెంకీ నయన తార కాంబినేషన్. ఇలా చాలా. దాంతో బయ్యర్లు కాస్త ఎక్కువ రేట్లకే కొన్నారు. వెంకీ కెరీర్ లో ఇంత హై రేట్లు ఎప్పుడూలేవు. నిర్మాతలు దాదాపు ఏడు కోట్ల వరకు లాభం చేసుకున్నారు.
గుంటూరు, కృష్ణా, నెల్లూరు తప్ప అందరూ పెట్టిన డబ్బులు వెనక్కుతెచ్చుకున్నారని, ఖర్చులు మాత్రం రాలేదని అంటూ వస్తున్నారు ఇన్నాళ్లు. అయితే అది వాస్తవం కాదని, ఆంధ్ర బయ్యర్లు అందరికీ ఇరవై శాతం వరకు పెట్టుబడి నష్టపోయారని తెలుస్తోంది. ఈస్ట్ గోదావరి బయ్యర్ కు ఇంకా యాభై లక్షలు వస్తే పెట్టబడి వెనక్కు వచ్చినట్లు. ఆపై ఖర్చులు రావాల్సి వుంటుంది. కృష్ణా, గుంటూరు బయ్యర్లు అయితే ముఫై శాతం వరకు పోగొట్టుకున్నారని వినికిడి.
ఇక ఓవర్ సీస్ పరిస్థితి అయితే చెప్పనక్కరేలేదు. బయ్యర్ సేఫ్ అయ్యారు, లోకల్ గా అమ్మేసుకుని, కానీ లోకల్ గా కొనుక్కున్నవాళ్లంతా లాసయ్యారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మించిన తొలి సినిమా ఇది. ఇదే బ్యానర్ పై ప్రేమమ్ రెండో సినిమాగా వస్తోంది. దీనికి కూడా దాదాపు బంగారం బయ్యర్లే. వీరంతా ప్రేమమ్ కు ముందుగా ఓ రేటు అనుకున్నారు. కానీ ఇటీవల ప్రేమమ్ పాటలు విడుదలయిన తరువాత మెల్లగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడం ప్రారంభమైంది. దీంతో బయ్యర్లు ఇండస్ట్రీ జనాలను ప్రేమమ్ ఎలా వుండబోతోంది అంటూ ఎంక్వయిరీలు ప్రారంభించారు.
దాన్ని బట్టి ఇప్పుడు ప్రేమమ్ విడుదలకు ముందు రేటు విషయంలో తేడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు మరి బంగారం లాస్ లు కవర్ చేయాల్సి వుంటుందేమో? అయితే ఇక్కడ ధీమా ఏమిటంటే..పవన్ కళ్యాణ్ సినిమా ఇదే ప్రొడక్షన్ హవుస్ నుంచి రావడం. అది ఎప్పుడు వస్తుందన్నది దైవాధీనం. ఎందుకంటే పవన్ స్వంత బ్యానర్ సినిమానే ఇంకా పట్టాలు ఎక్కలేదు. అది పూర్తయితే తప్ప, ఇది ప్రారంభం కాదు.
కానీ ఇది వుందని కాస్త హడావుడి చేస్తే, బయ్యర్లు కాస్త కామ్ అవుతారు. ప్రేమమ్ మీద దాని ఎఫెక్ట్ పడకుండా చూసుకోవచ్చు. అందుకే కావచ్చు..పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ సినిమా వుందంటూ హారిక హాసిని భారీ గా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ముందు జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది.