బాబుకు కష్టాలు చుట్టుముడుతున్నాయా?

ఒక వైపు అనుకూలంగా లేని సర్వే నివేదికలు మరోవైపు పవన్ లాంటి వాళ్ల మాటల తూటాలు ఇంకోవైపు స్విస్ చాలెంజ్ పై కోర్టు కామెంట్లు ఇవన్నీ చాలవన్నట్లు నోటుకు ఓటు కేసును తిరగతోడడం. Advertisement…

ఒక వైపు అనుకూలంగా లేని సర్వే నివేదికలు
మరోవైపు పవన్ లాంటి వాళ్ల మాటల తూటాలు
ఇంకోవైపు స్విస్ చాలెంజ్ పై కోర్టు కామెంట్లు
ఇవన్నీ చాలవన్నట్లు నోటుకు ఓటు కేసును తిరగతోడడం.

ఏమిటో..అసలే టైమ్ చకచకా గడచిపొతోంది. రెండేళ్లు నిండి, మూడే ఏడూ కంప్లీట్ చేసేసుకునే దిశగా ప్రభుత్వం సాగుతోంది. రాజధాని వ్యవహారం ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు వుంది. వేల కోట్లు ఖర్చు చేసి కట్టిందేమిటా అంటే తాత్కాలిక సచివాలయం మాత్రమే. బాబు పాలన సిగలో వాడకుండా మిగిలన పూలు ఏమన్నా వుంటే పుష్కరాల నిర్వహణ, హుద్ హుద్ ను ఎదుర్కోవడం. 

కానీ వాస్తవ ప్రపంచంలోకి వస్తే, పనులు జరగడం లేదు. అవినీతి పెరిగిపోయింది. (ఈ విషయం బాబుగారి సర్వేలోనే తేలింది. ఎవరి ఆరోపణా కాదు). మరోపక్క డబ్బున్న బడా బాబులే బాబుగారి చుట్టూ కనిపిస్తున్నారు. ఇంకోపక్క పదేళ్ల రాజధానిని మధ్యలోనే వదిలేసి వచ్చిన వైనం  పక్కాగా కనిపిస్తోంది. పొలాలు ఎండి, కరువు బాధలు పొలాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ఇవన్నీ చాలవన్నట్లు మోడీ ప్రభుత్వం ప్రతి పైసాకు లెక్కలు అడుగుతోంది. ఎక్కడా చేతికి చిక్కనంటోంది.  అంతా పరిశీలిస్తుంటే, అంతా చూస్తుంటే, బాబుగారికి టైమ్ అంత బాగున్నట్లు గా లేదు. నిజానికి కోర్టులకు బాబుగారు అంత సులువుగా చిక్కరు. ఆయన ఈ తరహా వ్యవహారాల్లో ఆరితేరిపోయారు. ఏళ్ల తరబడి ముందే ఆలోచించి, ఎవర్ని ఎక్కడ వుంచాలో? ఎవర్ని ఎక్కడకు పంపాలో అన్నీ చేసి జాగ్రత్త పడ్డారు. 

అయినా కూడా ఆధారాలు పక్కగా కనిపిస్తూ వుంటే కష్టం కాంపౌండ్ వాల్ లోకి అడుగుపెట్టక తప్పదు కదా. ఓటు కు నోటు కేసులో ఆడియో రికార్డింగ్ సంగతి పక్కదారి పట్టించి, అసలు ఎందుకు రికార్డు చేసారు. రికార్డు చేయడం తప్పు. ఇది కుట్ర. ఇలా రకరకాల కొత్త కోణాలు వెదికి తన మీడియా సాయంతో నానా యాగీ చేసి, హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్లు పెడతాం అని హెచ్చరించి, ఆంధ్రలో కేసులు పెట్టి, కిందా మీదా పడ్డారు.  

కానీ అసలు విషయం ఎలా దాగుతుంది. టేపు నిజమా కాదా? టేపులో గొంతు ఆయనదా కాదా? ఇవి తేలాల్సిందే అంటోంది ఇప్పుడు కోర్టు ఆదేశం. పైగా ముందుగానే విదేశీ సంస్థలతో ఫోర్సెనిక్ చెక్ చేయించి మరీ కోర్టులో కేసు వేసారు. ఇక ఆధారాలు పక్కాగా వున్నపుడు ఏం చేయాలి? మరోపక్క ముత్తయ్య లాంటి వాళ్లు అట్నుంచి ఇటు తిరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇక ఆదుకోవాల్సింది కేసిఆర్ ఒక్కరే. ఎందుకంటే, కోర్టు దర్యాప్తు చేయమన్నది కానీ, చేయాల్సింది తెలంగాణ ప్రభుత్వమే కదా? 

కానీ ఆ ప్రభుత్వం కూడా తను గతంలో చేసిన ఆరోపణలను, గతంలో చేసిన దర్యాప్తును కాదని ఏమీ చేయలేదు కదా? అందువల్ల ఇది కాస్త క్లిష్టమైన వ్యవహారమే. కొసమెరుపు ఏమిటంటే. బాబుగారు చిన బాబు లోకేష్ ను ఎప్పుడు మంత్రి పదవిలోకి తీసుకోవాలని ధైర్యంగా డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చినపుడల్లా, పిడుగులా ఏదో అవాంతరం వచ్చి పడుతోంది.

కానీ ఈసారి మంచి అవకాశం అనుకోవాలి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో నైతికత పాటిస్తూ, బాబుగారు రాజీనామా చేసి, చినబాబును ఏకంగా ముఖ్యమంత్రినే చేస్తే? పోలా..అదిరిపోలా? అనే రేంజ్ లో ప్రతిపక్షానికి జర్క్ ఇచ్చినట్లు అవుతుందేమో?