నయనతార చేతులు కాల్చుకుంటుందా.?

సినిమా నిర్మాణమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. హీరోలు సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్న సందర్భాలే కోకొల్లలుగా కన్పిస్తాయి. ఇక, హీరోయిన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాస్త ఫేమ్‌ రాగానే, సినిమాలు…

సినిమా నిర్మాణమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. హీరోలు సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్న సందర్భాలే కోకొల్లలుగా కన్పిస్తాయి. ఇక, హీరోయిన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాస్త ఫేమ్‌ రాగానే, సినిమాలు నిర్మించాలనుకోవడం, ఏదో ఒక సినిమాని నిర్మించేసి చేతులు కాల్చుకోవడం చాలామంది హీరోయిన్ల విషయంలో చూసేశాం. 

తాజాగా, హీరోయిన్‌ నయనతార కూడా నిర్మాణం వైపు అడుగులేస్తోందంటూ కోలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. తన బాయ్‌ఫ్రెండ్‌ విఘ్నేష్‌తో దర్శకత్వంలోనే నయనతార కొత్త సినిమా నిర్మించబోతోందన్నది ఆ గాసిప్స్‌ సారాంశం. తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడట. నయనతార ఇందులో నటిస్తుందా.? లేదా.? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. 

అయితే, నయనతార మరీ అంత అమాయకురాలేమీ కాదనీ, నయనతార సినిమా నిర్మాణంలో భాగమయ్యే అవకాశాలున్నాయి తప్ప, ఆమె నిర్మాణ బాధ్యతలు పూర్తిగా తీసుకునే అవకాశాల్లేవని ఆమె గురించి బాగా తెలిసిన ఆమె సన్నిహితులు చెబుతున్నారు. విఘ్నేష్‌ డైరెక్షన్‌లో అజిత్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న మాట వాస్తవమే. ఈ సినిమాకి అజిత్‌ ఓ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయి. అదే సమయంలో విఘ్నేష్‌ కూడా నిర్మాణంలో వేలు పెట్టాలనుకుంటున్నాడట. ఆ పనేదో నయనతారతో చేయించాలన్నది విఘ్నేష్‌ ఆలోచన. 'నా పేరు వేస్కోండి తప్ప, నేను డబ్బులు పెట్టేది లేదు..' అని నయనతార తేల్చి చెప్పేసిందట కూడా. దాంతో, వ్యవహారం సందిగ్ధంలో పడింది. 

చాలా సందర్భాల్లో హీరోయిన్లు ఇలానే బుక్కయిపోతుంటారు. దర్శకులు, హీరోయిన్లను బుట్టలో పడేసి, నిర్మాణం వైపు మళ్ళించడం, నష్టాలు వస్తే.. ఇక కెరీర్‌కి గుడ్‌ బై చెప్పేయడం.. ఇలా హీరోయిన్ల పాట్లు గురించి చాలా సందర్భాలున్నాయి టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో. మరి, నయనతార ఇప్పుడేం చేస్తుంది.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.