ఎమ్బీయస్‌ కథ – పారా త్రిషార్‌

ఆ రోజు ఊటీలో మేట్నీ షో సినిమా చూస్తూండగా విఠల్‌కి హఠాత్తుగా తన సందేహాలకి సమాధానం దొరికినట్టనిపించింది. తన భార్య వింత ప్రవర్తనకు, ఆ సినిమాలో హీరోయిన్‌ పరిస్థితికి లింకు దొరికింది.  Advertisement పెళ్లయి…

ఆ రోజు ఊటీలో మేట్నీ షో సినిమా చూస్తూండగా విఠల్‌కి హఠాత్తుగా తన సందేహాలకి సమాధానం దొరికినట్టనిపించింది. తన భార్య వింత ప్రవర్తనకు, ఆ సినిమాలో హీరోయిన్‌ పరిస్థితికి లింకు దొరికింది. 

పెళ్లయి వారం రోజులు దాటినా అతను తన భార్యను ఆపాదమస్తకం చూడనేలేదు. హనీమూన్‌ గురించి అతను వూహించుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. భార్యాభర్తల తొలి కలయిక పెళ్లివారి యింట్లో  జరగడం అంటే అతనికి మహా చికాకు. పెళ్లి తాలూకు సందడి  పక్కగదుల్లో సద్దు మణగదు. పేకాడుకునే జనాల గోల, గిన్నెలు సర్దుతున్న చప్పుడు అర్ధరాత్రి దాకా వినబడుతూనే వుంటాయి. మిగిలిపోయిన అరటిగెలలు, తమలపాకుల బుట్టలు, పంచడం కుదరని మిఠాయిలు నిండిన తట్టలు – గది నాలుగు మూలలా నిండి తమ తమ వాసనలు వెదజల్లుతూ వుంటాయి. కొత్త దంపతులు కిలకిలలాడినా పక్కగదిలోకి వినబడుతుందన్న బెరుకు వుంటుంది. 

ఇవన్నీ ఆలోచించే అతను హనీమూన్‌ ఊటీలో పెట్టుకున్నాడు. మన ప్రథమ సమాగమం అక్కడే అని భార్యకు పెళ్లికి ముందే ఫోన్‌లో చెప్పాడు. ''ఊటీ అవీ ఎందుకు? మా అమ్మమ్మ గారింటికి వెళదాం. వాళ్లది పెద్ద యిల్లు. విశాలమైన గదులు. మా మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ.. ముగ్గురు తప్ప ఎవరూ వుండరు. మామయ్య పిల్లలు సిటీలో చదువుకుంటున్నారు. అల్లరి పెట్టేవాళ్లు కూడా ఎవరూ వుండరు'' అంది విశాల. 

''భలేదానివే, నేను మంచి రొమాంటిక్‌గా ఊటీ అంటూంటే నువ్వు పల్లెటూరినీ, బురదరోడ్లనీ పట్టుకు పాకులాడుతావేంటి? ఊటీ అంటే ఆ నీలగిరి హిల్స్‌, ఆ కొండలూ, లోయలూ జీవితాంతం గుర్తుండిపోతుంది. పైగా మనం చెట్టాపట్టాలేసుకుని తిరిగినా ఊటీలో ఎవరూ పట్టించుకోరు. అదే మీ వూళ్లో అయితే.. వూరందరికీ అదే వూసు..''

''మీ యిష్టం మరి. వేరే వూళ్లో హోటల్లో ఎందుకు అనవసరమైన ఖర్చుకదాని చెప్పా…'' అంది విశాల నెమ్మదిగా.

''నీకు తెలియదు. మీ అమ్మమ్మగారి వూరికి ఎప్పుడైనా వెళ్లవచ్చు. హనీమూన్‌ అంటే ఊటీ, కొడైకెనాల్‌, డార్జిలింగ్‌, కాశ్మీర్‌.. అలాటి ప్లేసులుండాలి. అఫీషియల్‌ ఫస్ట్‌నైట్‌ అయిన మర్నాడే ప్రయాణం. నువ్వింక నస పెట్టకు'' అన్నాడు విఠల్‌ ధాటీగా.

''మీ యిష్టం అన్నానుగా..''

**********

అనుకున్నదాన్ని తూచ తప్పకుండా అమలు చేసే మనిషి విఠల్‌. అందుకే శోభనం రాత్రి సరదా కబుర్లతో సరిపెట్టాడు. విశాల కూడా హుషారైన పిల్లే. తనకు తెలిసిన నాన్‌ వెజ్‌ జోక్స్‌ తనూ చెప్పింది. మర్నాడు రైల్లో సరసాలాడితే తనూ తీసిపోనని నిరూపించింది. 

వచ్చిన చిక్కల్లా ఊటీకి చేరాక వచ్చింది. ఆమె సిగ్గు అతనికి చిర్రెత్తిస్తోంది. గదిలో దీపం వుండడానికి వీల్లేదంటుంది. అతను చదివిన ఏ కథలోనూ ఏ హీరోయిన్‌ పాత్రా యిలా లేదు. చీకటైనా, వెలుతురైనా సరే, గది తలుపు మూయగానే అప్పటిదాకా అందుకే కాచుకుని వున్నట్టు మొగుణ్ని ముద్దులతో ముంచెత్తుతుంది. కౌగిలిలో వూపిరి సలపకుండా చేస్తుంది. నిమిషాల్లో వొంటిమీద బట్టలను జారవిడుస్తుంది. క్షణాల్లో భర్తనూ పుట్టినరోజు పాపాయిని చేసేస్తుంది.  కానీ విశాల తంతే వేరు. ఏకాంతంలో నైనా సరే పైటయినా జారనీయదు. చేరువగా కూచుంటుంది కానీ ముద్దాడనీయదు. 

ఏ మాటకా మాట చెప్పాలి. రాత్రి అయ్యాక, గదిదీపాలు ఆర్పేశాక రెచ్చిపోతుంది, రసిక సామ్రాజ్యాన్ని ఏలుతుంది. ఒక్క దెబ్బతో విఠల్‌ కోపతాపాలను శమింపజేస్తుంది. అప్పటికి అతని అలుకలు తీరతాయి కానీ తెల్లారగానే తిరిగి వచ్చేస్తాయి. ''నన్ను ఓ ముద్దు పెట్టి నిద్ర లేపవచ్చుగా..'' తో మొదలు పెట్టి ''ఈ వూళ్లో చూడడానికి ఏమీ లేవు. బోర్‌.  ఆ కొండలూ, లోయలూ అన్నీ  వేస్ట్‌. నిన్ను ఆసాంతం స్టడీ చేస్తే చాలు.'' అని సణుగుడుతో రోజంతా గొణుగుతాడు. 

ఆమె వినిపించుకోదు. బుగ్గ మీద చిటికేసి జోకులేసి వూరుకోబెడదామని చూస్తుంది. ఇంకా వినకపోతే 'అలా బయటకు పోయి ప్రకృతి అందాలు చూద్దాం పదండి' అంటుంది. నేచర్స్‌ బ్యూటీ అంటూ నేరకపోయి వూటీకి తీసుకొచ్చాను కదరా భగవంతుడా అనుకున్నాడు విఠల్‌. ఇదే వాళ్ల అమ్మమ్మగారి వూరయితే బయటకు వెళ్లాలంటే భయపడేది కదా. చచ్చినట్టు యింట్లోనే వుండేది. 

బయట వున్నంతసేపు చేతిలో చేయి వేసుకోవచ్చు, దగ్గరకు లాక్కోవచ్చు, అంతేగాని ముద్దులూ, కౌగలింతలూ కుదరవు కదా. ఇదేమీ ఫారిన్‌ కాదు. చీకటి పడితే ఫర్వాలేదు కాస్త ముద్దూ ముచ్చటా తీర్చుకోవచ్చు, అభ్యంతర పెట్టదు. కానీ వెధవది, వూళ్లో అన్ని చోట్లా వీధిదీపాలు పెట్టి చచ్చారు మునిసిపాలిటీవాళ్లు. జనసంచారం లేని కొండలవైపు వెళ్లి చూద్దామా అంటే దారి తప్పిపోతామన్న భయం ఒకటి. 

''అందుకే బయట తిరగడం ఎందుంటాను. హాయిగా రూములోనే వుంటే ఎంత లెవెల్‌ కెళినా ఫర్వాలేదు..'' అన్నాడు విఠల్‌ విసుక్కుంటూ.

''రూము కెళ్లినా చీకటి పడకుండా ఎలా?'' అంది విశాల నవ్వుకుంటూ.

విఠల్‌ వుడుక్కున్నాడు. ''చీకటి ఎందుకు పడాలని? కొత్తగా పెళ్లయినవాళ్లు పగలూ, రాత్రి ఒకటి చేయాలి…''

''..అంటే రాత్రి కూడా పగల్లాగ దూరంగా వుండాలనా?''

''..నీ మొహం! పగలు కూడా రాత్రిలా చేరువవ్వాలని..''

''కానీ, పగలు అలాటి పనులు చేయకూడదంటారు పెద్దలు..''

''…వెధవరూల్స్‌ పెట్టారు మనసులేని రాక్షసులు.''

''వాళ్లు కాదు, అలా కలిస్తే పుట్టేవాళ్లు రాక్షసులవుతారట..''

''..తెలియకపోతే సరి. దుష్యంతుడూ, శకుంతలా పగలే కలిశారు. వాళ్లకు రాక్షసుడు పుట్టారా? లేదే! భరతుడి లాటి గొప్పవాడు పుట్టాడు. ఆయన పేరే పెట్టుకున్నాం మన దేశానికి..''

''..నేన్నమ్మను.''

''ఏవిటి నమ్మవ్‌? భరతుడి పేరు మన దేశానికి పెట్టుకున్నారనా!?''

''కాదు, దుష్యంతుడు, శకుంతల పగలే…''

''.. పగలే..!?''

''..అబ్బ అదేలెండి. మీరు పెద్ద చూసివచ్చినట్టు చెపుతున్నారు..''

''భారతంలో ఏం రాశాడు? దుష్యంతుడు వేటాడ్డానికి వచ్చాడు.  శకుంతలను చూశాడు. గాంధర్వ వివాహం అన్నాడు. వెంటనే రెడీ అన్నాడు. శకుంతల నీలాగ పగలూ, రాత్రి అని నస పెట్టకుండా..''

''చాల్లెండి మీ మెట్టవేదాంతం. నాకు ఆకలేస్తోంది. రండి రెస్టారెంట్‌ కెళ్లి తైరుసాదం తిందాం.''

''మనకు చివరికి మిగిలేది యీ పెరుగన్నం, చద్దన్నమే. యవ్వనంలో వున్నంతకాలం యిలా సిగ్గుపడుతూ కూచుంటే ముసలితనంలో చద్దన్నమే గతి..''

''.. అబ్బ, మీకు అన్నిటికీ తొందరే, అప్పుడే ఏదో ముంచుకుపోయినట్టు…కాస్త అలవాటు పడనీయండీ…''

**********
విఠల్‌కు యింకో అసంతృప్తి కూడా వుంది. అతను చదివిన అనేక సరసమైన కథల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి సరిగంగ స్నానాలు చేస్తారు.  భార్య స్నానం చేస్తూ తువ్వాలుకోసం అడిగితే భర్త అది అందిస్తూ తనూ లోపలికి దూరిపోతాడు. కానీ విశాల విషయంలో తను తువ్వాలు మర్చిపోయిన సందర్భం ఒక్కటీ లేదు. కలిసి స్నానం చేద్దామంటే వురిమి చూసింది. తను స్నానం చేశాక ఓ సారి చూస్తే బట్టలన్నీ తడిసివున్నాయి. 

''అదేమిటి!? బట్టలతోటే స్నానం చేశావా!?'' అడిగాడు ఆశ్చర్యంగా. ''ఇదేమన్నా పెరట్లో బాల్చీ పెట్టుకుని స్నానం చేయడమనుకున్నావా? హాయిగా నాలుగు గోడల మధ్యా షవరేసుకుని స్వేచ్ఛగా స్నానం చేయకుండా…''

''పల్లెటూరిలో పెరిగాను కదండీ, మా అలవాట్లు మావి…'' తుంచేసింది విశాల.

''…అంటే సినిమాల్లో చూపించినట్టు నువ్వు చెర్లో యీతలు కొడుతూ, నూతి గట్టుని కౌగిలించుకుని పాటలు పాడుతూ, వూళ్లో కుర్రాళ్లకు కనువిందు చేసేదానివా?'' కోపంగా అడిగాడు విఠల్‌.

''అబ్బ, మీతో ఏం మాట్లాడినా కష్టమే.. ఏమేమో వూహించుకుంటారు. ఇప్పుడు వూళ్లల్లో చెరువులెక్కడున్నాయి, యీతలాడడానికి! అన్నీ కబ్జా చేసి పడేశారుగా!'' విసుక్కుంది విశాల.

**********
రాత్రివేళ సుఖాలందుకోవడంతో తృప్తిపడటం లేదు విఠల్‌. హనీమూన్‌ తను అనుకున్న తీరులో విశృంఖలంగా జరగటం లేదన్న  అసంతృప్తి, బాధ అతన్ని తొలచివేస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న అతని చికాకు, కోపం చూసిన విశాల బెదురుతూనే ''బయటకు  షికారు వెళదామంటే అక్కర్లేదంటారు. రోజంతా గదిలో కూచుని టీవీ ఏం చూస్తాం? పోనీ సినిమాకు వెళదామా?' అంది. 

''ఇక్కడ సినిమాలు ఏం ఉద్ధరించాయి? అరవ సినిమాలు మనకు అర్థమై ఏడిస్తే కదా..'' దాదాపు అరిచాడు విఠల్‌.

''మన హోటల్‌కి దగ్గర్లోనే వున్న పాత థియేటర్‌లో హిందీ సినిమా ఆడుతోందిగా..'' బెదురుతూనే చెప్పింది విశాల.

''అదా, ఎప్పటిదో యిక్ష్వాకుల కాలం నాటి సినిమా.. సత్యం, శివం, సుందరం..''

''ఎంత పాతదైతేనేం? చూడనివాళ్లకు కొత్తదేగా! నేను చూళ్లేదు, మీరు చూశారా?''

''..లేదు''

''..యింకేం మరి..'' 

ఓ రెండు నిమిషాలకు విఠల్‌ తమాయించుకున్నాడు. పాత సినిమా అయితేనేం, డొక్కు థియేటర్‌ అయితేనేం, రొమాన్సు చేసుకోవడానికి. ఆ మాట కొస్తే అవే బెటరు. అరవదేశంలో హిందీ సినిమాకు వచ్చేవాడెవడు? బాల్కనీలో ఓ మూల కూచుంటే కాస్త సరసం వెలగబెట్టవచ్చు. మేట్నీకి వెళితే సరి. ఆ టైములో యిక్కడ వుండి బావుకునేది ఏదీ లేదు. 

**********
సినిమా చూస్తూండగా కథలో లీనమై పోయాడు విఠల్‌. హీరోయిన్‌కు చిన్నప్పుడే ఓ పక్క మొహం కాలిపోయింది. ఆమె నెత్తిమీదనుండి ముసుగులా వేసుకుని కాలిపోయిన సగభాగం జనాలకు కనబడకుండా  మేనేజ్‌ చేస్తూ వుంటుంది. హీరో కూడా బాగున్న భాగమే చూసి మోహించాడు. పెళ్లి చేసుకున్నాడు. కాపురం చేశాడు. తర్వాత ఎప్పుడో అసలు రూపం బయటపడింది. కానీ అప్పటికి ఏం చేస్తాడు? ప్రేమబంధం, వివాహ బంధం చిక్కబడింది. వదిలి పోగలడా?

విఠల్‌కి హఠాత్తుగా విశాల వింతప్రవర్తనకు సమాధానం తోచింది. తనకు కూడా ఏదో చర్మరోగం వుండి వుండవచ్చు. లేదా కాలిపోయి వుండవచ్చు. చీరా జాకెట్టు శరీరంలో చాలా భాగాల్ని కప్పేస్తాయి కదా, మిగతా భాగాల్లో వుందేమో – బొల్లి? శోబి? సోరియాసిస్‌? – ఏమో ఏదైనా కావచ్చు. చీకట్లో ఏం కనబడుతుంది! అందుకే పగలనే మాటేమిటి, దీపం వెలుతురులో కూడా తనను తాను చూపించుకోదు. ఇలా చీకట్లో కొంతకాలం కాపురం చేశాక తను ఎలాగూ విడిచిపెట్టలేడు. సిగ్గు అనేది నాటకం మాత్రమే. దుప్పట్లో దూరాక ఎంత ఫ్రీగా వుంటుందో చూశాడుగా. సిగ్గున్నవాళ్లు అలాగ వుంటారా?

విశాల భుజం చుట్టూ వేసిన చేతిని విఠల్‌ హఠాత్తుగా వెనక్కి లాక్కోబోయాడు. విశాల దాన్ని అదిమి పట్టుకుంటూ – ''ఆ హీరోయిన్‌ పేరేమిటండీ? చాలా అందంగా వుంది.'' అని అడిగింది. 

''జీనత్‌ అమాన్‌ అని. ఈ సినిమాలో అందాలు ఆరబోసేసిందిగా. మా బాబాయి చెప్పాడు – వాళ్లంతా యీ సినిమా చూసి వెర్రెక్కిపోయారట. ఈ పోస్టర్లన్నీ గదుల్లో అతికించుకునే వారట.'' కోపాన్ని అణుచుకుంటూ చెప్పాడు విఠల్‌. 

''జీనత్‌ అమాన్‌ అంటే… పోయిన వారం టీవీలో కనబడింది కదండీ..ఆవిడేనా? ఇలాగ లేదే!'' ఆశ్చర్యపడింది,

విఠల్‌ విసుక్కున్నాడు – ''నీ మొహం, యిలాగెందుకుంటుంది?  ఈ సినిమా తీసి ముప్ఫయ్యేళ్లు దాటింది. అప్పటికి నువ్వూ నేనూ పుట్టలేదు…''

''…ఎంతైనా అంత తేడానా?''

''మనిషన్నాక మార్పు రాదా? నీకూ ఓ యాభై యేళ్లు వచ్చి అమ్మమ్మయ్యాక కూడా యిలాగే వుంటావనుకుంటున్నావా? అందులోనే ఆవిడకి మొగుడితో ఏవో కష్టాలూ అవీ వచ్చాయి. గొడవలు, విడాకులు, కష్టాలు.. వాటి వల్ల మొహం యింకా పాడై వుంటుంది…''

''..గొడవల వల్ల కొంత ఎక్కువ మారి వుండవచ్చనుకోండి. కానీ ఎంతైనా.. యీ అందమంతా అలా కరిగిపోతుందా?''

''కరగక..? అలాగే వుండిపోతుందా? ఇంకా నయం. వాళ్లు సినిమా స్టార్లు కాబట్టి ఆనాటి అందాన్ని కెమెరాలకు ఎక్కించి యిలా సినిమారీళ్లలో ప్రిజర్వ్‌ చేసి వుంచారు. తరతరాలకూ ఆమె అందం ఒకప్పుడు ఎలావుండేదో తెలుస్తుంది. మనలాటి అనామకుల కేముంది? ముసలితనం వచ్చేసరికి ఒకటో, రెండో ఫోటోలు మిగులుతాయి – అవీ బిగుసుకుని పోయి తీయించుకున్నది. ఈ వంపులూ, సొంపులూ అన్నీ రికార్డవుతాయా? మనకే గుర్తుండవ్‌…''

విశాల బెదురుతూ విఠల్‌ చేతిని గట్టిగా పట్టుకుంది. 

సినిమా అయిపోయి అందరూ లేవడంతో విఠల్‌ ఆమె భుజం తట్టి లేచాడు. ఆమె మౌనంగా వెంట నడిచింది. హోటల్‌కి వెళ్లే దారిలో కూడా ఏమీ మాట్లాడలేదు. 

**********

 ఎవరి ఆలోచనల్లో వాళ్లు మౌనంగా డిన్నర్‌ ముగించి, హోటల్‌కి తిరిగి రాగానే ''ఆగు, స్నానం చేసి వస్తాను.'' అన్నాడు విఠల్‌. 

''ఉండండి, నేనూ వస్తాను. కలిసి చేద్దాం'' అంది విశాల. 

విఠల్‌ తెల్లబోయి కళ్లు విప్పార్చి చూస్తూండగానే విశాల బట్టలన్నీ విప్పి చుట్టచుట్టి మూలకు విసిరేసింది. నిగనిగలాడుతున్న బంగారుతీగ లాటి శరీరం. పుట్టుమచ్చసైతం లేని ఆమె ఒడలు చూసి చంద్రుడు అసూయతో కుళ్లుకుని చావాలి అనుకున్నాడు విఠల్‌. 

కలిసి స్నానం చేస్తూ ఆమె కౌగిలించుకున్న తీరు చూస్తే కెమెరాకు పోజులిచ్చినట్టు అనిపించింది విఠల్‌కు. 

''ఏమిటి? జీనత్‌ అమాన్‌తో పోటీకొస్తున్నావా?'' అన్నాడు నవ్వుతూ.

''మీకు తెలియదా? ఇలాటిచోట హోటళ్లలో హనీమూన్‌ స్వీట్‌లో కెమెరాలు గోడల్లో దాచిపెడతారు. ఎలాగూ ఫోటోలో పడేటప్పుడు అందంగా పడవచ్చుగా..'' అంది విశాల విశాలమైన తన కళ్లను మరింత విశాలం చేసి.

''ఏడిశావులే.. ఎవరు చెప్పారు?'' అన్నాడు విఠల్‌ నవ్వుతూ.

''పేపర్లో చాలాసార్లు చదివాను. బాత్‌రూముల్లో, గదిమూలల్లో, ఫ్యాన్‌ మధ్యలో బుల్లి కెమెరా పెట్టి అంతా షూట్‌ చేస్తారట. బ్లూ ఫిలింలా చేసి అమ్ముకుంటారట. సినిమా స్టారు త్రిషాక్కూడా హోటల్‌ బాత్‌రూమ్‌లో కెమెరా పెట్టి ఫోటోలు లాగారు. అందుకనే హోటళ్లు వద్దు, మా అమ్మమ్మగారింటికి వెళదామన్నాను. అక్కడైతే మనకు ఎలాటి భయమూ వుండదు. హాయిగా ఆదిమానవుల్లా దొర్లినా ఫర్వాలేదనుకున్నాను. కానీ మీరు వినలేదు.''

విఠల్‌కి విషయం బోధపడింది. ''అయితే నువ్వు కెమెరాలకు భయపడా యింతకాలం సంకోచించావ్‌?'' 

విశాల తల వూపింది. 

''మరి యివ్వాళ ధైర్యం ఎలా వచ్చింది? కెమెరాలు లేవని ఎవరైనా హామీ పత్రం రాసిచ్చారా?''

''కాదు, వుంటేనే మంచిదనుకున్నాను. మీరు చెప్పినట్టు మన అందచందాలన్నీ కెమెరాలకు ఎక్కేస్తే ముసలాళ్లమయ్యాక అవి చూసి మురవచ్చు. మనంతట మనం ఎలాగూ తీసుకోలేం. మన శృంగారమంతా వాళ్లు వీడియో సినిమాగా తీసి ప్రపంచమంతా పంపిణీ చేస్తారు. మన అందచందాలు అందరికీ తెలుస్తాయి. ఎలాగూ కొన్నాళ్లకు యివన్నీ కరిగిపోయేవే! జీనత్‌ అమ్మాన్‌ని చూశాంగా. ఈ లోపునే.. అబ్బ, అలా దూరంగా వెళ్లిపోతారేం, దగ్గరగా వచ్చి అదుముకోండీ..''

ఇంకో అరగంటకు ఫోంబెడ్‌పై షాండిలియర్‌ కాంతిలో రతికేళిలో విజృంభించేవేళ మధ్యలో విశాలకు యింకో విషయం గుర్తుకువచ్చి ఫ్యాన్‌కేసి చూసి అరిచింది – ''ఒరేయ్‌, యీ సినిమా కాపీ మాకోటి పంపడం మర్చిపోకండి. అడ్రస్‌ హోటల్‌ రిజిస్టర్లో వుంది.''

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]