జిమ్ పార్టీలో కేవలం ముగ్గురు మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేశారు. జిమ్‌తో సహా తక్కినవారందరూ ప్రతిపక్షంలోనే వుంటూ వచ్చారు. అందువలన సెక్రటరీలతో ఎలా వ్యవహరించాలో తెలియదు. నాలుగు రోజులు పోయేసరికి హంఫ్రీ, బెర్నార్డ్ కలిసి అతనికి తాము ఎంతో సహకరిస్తున్నట్లు అభిప్రాయం కలిగించేశారు. అంతా సవ్యంగానే వుందనే భ్రమలో అతను పడిపోయాడు. అయితే అతని గురించి హంఫ్రీ ఏమనుకుంటున్నాడు?
వారం గడిచాక నవంబరు 2న హంఫ్రీ, కాబినెట్‌కు సెక్రటరీ అయిన సర్ ఆర్నాల్డ్ రాబిన్సన్ రిఫార్మ్ క్లబ్లో డిన్నర్ చేస్తున్నారు. 'మీ కొత్త కాబినెట్ ఎలా వుంది?' అని అడిగాడు. 'అచ్చు పాతదానిలాగానే' అని జవాబిచ్చి ఆర్నాల్డ్ 'మీ కొత్త బిచ్చగాడు ఎలా వున్నాడు?' అని వాకబు చేశాడు. 'బుద్ధిమంతుడే. నేనూ బెర్నార్డ్ కలిసి మొన్న వీకెండులో బుట్టెడు ఫైళ్లు చదివించాం. కిమ్మనకుండా చదువుకుని వచ్చాడు. ఇక్కడ ఆట నియమాలు త్వరగానే నేర్చుకుంటున్నాడు.'' అని హంఫ్రీ సమాధానం చెప్పాడు. ఆర్నాల్ట్ పడిపడి నవ్వాడు.
అమెరికా రాయబారి యీ మధ్య ప్రధానితో చాలా సమయం గడుపుతున్నాడు. ఇంగ్లండు, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందమో, రక్షణ ఒప్పందమో ఏదో జరుగుతుందన్న పుకారు సెక్రటేరియట్లో షికారు చేస్తోంది.
అది నిజమేనా అని హంఫ్రీ అడిగాడు. 'మీడియాలో లీక్ రావాలని ఎదురుచూస్తున్నాం. మీడియా అడగ్గానే కాబినెట్ వద్ద సమాచారం ఏదీ లేదని చెప్పాలి. అందువలన డిఫెన్స్ గురించో బిజినెస్ గురించో కాబినెట్‌కు యింకా ఏమీ తెలియదన్నమాట' అని ఆర్నాల్డ్ జవాబిచ్చాడు.
ఓహో దీనర్థం డిఫెన్స్, బిజినెస్ రెండూ కలిసిన ఏరోస్పేస్ సిస్టమ్స్ కాంట్రాక్టు రాబోతోందన్నమాట అని హంఫ్రీ వూహించాడు. ఎందుకంటే అది చాలా రోజులుగా చర్చల్లో నలుగుతోంది. అది నాలుగున్న బిలియన్ డాలర్ల కాంట్రాక్టు, మిడ్లాండ్స్లో, నార్త్‌వెస్ట్‌లో బోల్డు ఉద్యోగాలు. ముఖ్యంగా అధికారపక్షం తక్కువ మార్జిన్లతో గెలిచిన సీట్లలో ఉద్యోగాలు వస్తే పార్టీ బలపడుతుంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే యీ కాంట్రాక్టు ఖరారైతే ప్రధానికి ఎంతో పేరు వస్తుంది. చాలా నెలలుగా పూర్వప్రభుత్వం కసరత్తు చేయగా యిన్నాళ్లకు ఫలించిందని ఎవరికీ తోచదు. ఆ క్రెడిటంతా యీయన ఖాతాలోనే పడుతుంది.
వీళ్లు మాట్లాడుతూండగానే బెర్నార్డ్ వచ్చి చేరాడు. ఆర్నాల్డ్ బెర్నార్డ్‌ను పలకరించాడు. ''ఏమయ్యా, మీ కొత్త మంత్రిగారు పాలనలో పారదర్శకత అంటూ ఏదో మొదలెట్టాడట..'' అని.
బెర్నార్డ్ ఉత్సాహంగా ''అవునండి, మా మంత్రిగారు వస్తూనే దాని గురించి మాట్లాడారు. మా డిపార్టుమెంటంతా చాలా చిత్తశుద్ధితో దాన్ని అమలు చేద్దామని చూస్తున్నాం. ఇది యితర శాఖలకు కూడా స్ఫూర్తిదాయకంగా వుంటుంది.'' అన్నాడు.
అది విని హంఫ్రీ తెల్లబోయాడు. ఇలాటి అమాయకుడికి ప్రమోషన్ యిచ్చి పొరపాటు చేశానా అని చింతించాడు. ఈ కొత్త పాలసీకి ఎలా ఎసరు పెట్టాలో అప్పుడే అతను తన బుర్రలో ఓ పథకం వేసుకుని వున్నాడు. ఇప్పుడు బెర్నార్డ్ మాట విని ఆర్నాల్ఞ్కి తన సామర్థ్యం మీద అపనమ్మకం ఏర్పడుతుందని జంకు కలిగింది.
కంగారుగా ''చూడు బెర్నార్డ్, నేను మన డిపార్టుమెంటులో 'పాలనలో పారదర్శకత' అనే పేరుతో శ్వేతపత్రాన్ని విడుదల చేశానంటే దాని అర్థం అది అమలు చేస్తామని కాదు. కార్యాచరణలో అతి క్లిష్టమైన దాన్ని హెడింగ్‌లో పెట్టేస్తాం. 'ఇన్వర్స్ రెలవెన్స్' అనే సిద్ధాంతం యిక్కడ వర్తిస్తుంది. దేన్నయితే అతి తక్కువగా చేద్దామనుకుంటావో, దాని గురించి అతి ఎక్కువగా మాట్లాడతాం.'' అని వివరించాడు.
కానీ బెర్నార్డ్‌కు యిన్ని తిప్పలెందుకో అర్థం కాలేదు. ''మనం పారదర్శకంగా వుంటే వచ్చే నష్టం ఏముంది?'' అని అడిగాడు.
ఆర్నాల్డ్ చికాకు పడ్డాడు. ''పాలన – పారదర్శకత యీ రెండూ విరుద్ధపదాలు బెర్నార్డ్! రెండు విరుద్ధపదాలను ఒక మాటలో ఎలా సమన్వయం చేస్తావ్? నువ్వు పాలనైనా చేయి, పారదర్శకంగానైనా వుండూ. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు.''
''ప్రజాస్వామ్యంలో వుంటున్నాం కాబట్టి పౌరులకు తెలుసుకునే హక్కు వుంటుంది.'' అన్నాడు బెర్నార్డ్.
''ప్రజాస్వామ్యంలో వుంటున్నారు కాబట్టి పౌరులకు అజ్ఞానంలో వుండే హక్కు వుంది'' అని సవరించాడు హంఫ్రీ.
''..అన్నీ తెలుసుకుంటే తప్పు జరగనిస్తున్నామనే అపరాధ భావన వుంటుంది. తెలియకుండా అంధకారంలో వుండడంలో ఒక డిగ్నిటీ, ఒక హుందాతనం వుంది'' అందించాడు ఆర్నాల్డ్.
బెర్నార్డ్ తన మొండిపట్టు వీడలేదు. ''పారదర్శకత కావాలని మంత్రిగారు పట్టుబడుతున్నారు.''
''అడిగాడు కదాని యిచ్చేయకూడదు. తాగుబోతు విస్కీ కావాలని అడుగుతాడు. ఇస్తామా?'' నచ్చచెప్పబోయాడు హంఫ్రీ.
''కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రతి మంత్రి మూడు వారాల్లో యిలాటి మాటలే మాట్లాడతాడు. మన అధికారయంత్రాంగం కలగజేసుకుని సరిదిద్దకపోతే నవ్వులపాలవుతాడు. మంత్రి చేసే తప్పొప్పులను కడుపులో పెట్టుకుని రహస్యాలు కాపాడవలసిన బాధ్యత సెక్రటరీది. సెక్రటరీ అనే పదంలోనే సీక్రసీ అనే మాట దాగి వుంది.'' అని ఆర్నాల్డ్ హెచ్చరించాడు.
అయినా బెర్నార్డ్ మూర్ఖంగా వాదిస్తూ వుండడంతో తన పథకం గురించి చెప్పకూడదని హంఫ్రీ నిశ్చయించుకున్నాడు.
ఇంగ్లండు ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఒక ఆర్డర్ యిన్వాయిస్ హంఫ్రీ ఆఫీసు కాగితాల్లో వుంది. ఫ్రాంక్‌కు అన్ని కాగితాలూ చూపించాలని ఆర్డరున్నా దీన్ని 'సెన్సిటివ్' గా పరిగణించి అతనికి కాపీ పంపలేదు. ఇప్పుడు హంఫ్రీ ఆ యిన్వాయిస్ ఫ్రాంక్ కంట పడాలని నిశ్చయించాడు. డైరక్టుగా అతనికి పంపించకుండా అతనంతట అతనే కనిపెట్టినట్లు వుండాలని అతని బల్లమీద వున్న కాగితాల కుప్ప కింద దీన్ని పెట్టమని తన అసిస్టెంటుకి చెప్పాడు.
అనుకున్నట్టుగానే నవంబరు 5 మధ్యాహ్నం అది ఫ్రాంక్ కంటపడింది. వెంటనే పెద్దగా అరుచుకుంటూ జిమ్ గదిలోకి చొరబడి ''ఇది చూశావా?'' అంటూ ఓ కాగితాన్ని అతని కళ్ల ముందు ఆడించాడు.
''అదేమిటో తెలియదు కానీ, మొత్తం మీద యీ ఆఫీసర్లు నీకు కాగితాలు పంపుతున్నందుకు సంతోషం'' అన్నాడు జిమ్.
''పంపుతున్నారు కానీ, అసలైన కాగితాలు పంపటం లేదు.''
''అలాగా, ఏ 'అసలైన' కాగితాలు పంపటం లేదు?''
''నాకు పంపనపుడు, ఏవి పంపలేదో ఎలా తెలుస్తుంది?''
ఈ మాట నిజమే అనిపించింది జిమ్‌కు. దీన్ని ఫ్రిజ్‌లో లైటు సమస్య అంటారు. ఫ్రిజ్ తలుపు మూసిినపుడు లైటు వెలుగుతోందా లేదా అని తెలుసుకోవడం ఎలా? తెలుసుకోవాలంటే తలుపు తెరవాలి. తెరిస్తే తలుపు మూసినట్టు కాదు.
''అసలు సంగతి విను. నాకు వీళ్లు పంపేదంతా పరమ చెత్త. కానీ నేను తక్కువాణ్ని కాను. ఇదిగో యీ కాగితం పట్టుకున్నాను. దెబ్బకి యీ హంఫ్రీ గాడి పిలక మన చేతికి చిక్కింది.'' ఫ్రాంక్ వూగిపోతున్నాడు. ''వీళ్లు అమెరికా నుండి వెయ్యి కంప్యూటర్ వీడియో డిస్ప్లే టెర్మినల్స్ కొనడానికి ఆర్డర్ యిచ్చారు. ఒక్కోటి పదివేల పౌండ్లు ఖరీదు. ఆ టెర్మినల్స్, యిక్కడ.. నీ నియోజకవర్గంలోనే బర్మింగ్‌హాంలో తయారవుతూంటే ఎక్కడో పిట్స్బర్గ్ నుంచి కోటి పౌండ్ల ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఖర్చు పెట్టి తెప్పించాలా? ఆ కోటి పౌండ్లు ఎవరివి? బ్రిటిషు పౌరులవి. ఆ ఆర్డరు యిక్కడే యిస్తే నీ నియోజకవర్గంలోని ప్రజలకు ఆ మేరకు ఉద్యోగాలు వచ్చేవి కదా!'' అని ఆవేశపడిపోయాడు.
జిమ్‌కు కూడా ఆవేశం ముంచుకుని వచ్చింది. ''పారదర్శకత వుంటేనే యిలాటివి బయటకు వచ్చి ప్రజలకు తెలుస్తాయి. ఫ్రాంక్, నువ్వు మహోపకారం చేశావ్. ఆగు హంఫ్రీని సంజాయిషీ అడుగుతాను.'' అని హంఫ్రీ కోసం కబురు పెట్టాడు.
ఆ రోజంతా హంఫ్రీ మీటింగుల్లోనే వున్నాట్ట. రాలేకపోయాడు.
మర్నాడు వచ్చాడు. జిమ్ యీ కాగితం చూపించి ''ఏమిటిది?'' అన్నాడు. 'పాత ప్రభుత్వహయాంలో యిచ్చిన ఆర్డర్ అది. 'మొత్తం సెక్రటేరియట్‌కు కావలసిన టెర్మినల్స్ మన డిపార్టుమెంటు కొని వాళ్లకు అందచేస్తోంది.'' అన్నాడు హంఫ్రీ.
''అది తెలుసు. కానీ అవి మన దేశంలో తయారైనవి కావు.''
''నిజమే''
''మా బర్మింగ్‌హాంలో కూడా తయారుచేస్తారు.''
''కానీ క్వాలిటీలో తేడా వుంటుంది.''
''ఏం వుండదు. అది నా నియోజకవర్గం.'' గర్వంగా చెప్పాడు జిమ్, అతనికి కంప్యూటర్లలో ఏమీ తెలియకపోయినా. ''ఈ ఆర్డర్ కాన్సిల్ చేసేయండి.''
''ఆర్థిక శాఖ ఒక్కటే ఆ పని చేయగలదు. ముందు చేసుకున్న ఒప్పందాలు – అదీ విదేశీ సప్లయిర్లతో చేసుకున్నవి – కాన్సిల్ చేయడమంటే మన వల్ల కాదు.''
''అయితే ఏం చేయాలి?''
''మీరు కాబినెట్లో దీని గురించి చర్చ పెట్టండి. మిడిల్ ఈస్ట్ గురించి, అణ్వాయుధ వ్యాప్తి గురించి వాళ్లు చేస్తున్న చర్చలు ఆపి, ఆఫీసు ఫర్నిచర్ గురించి మొదలుపెడతారేమో'' అని సూచించాడు హంఫ్రీ. కానీ దానిలో వెటకారం కనబడింది జిమ్‌కు. కాబినెట్ దాకా వెళ్లవలసినంత విషయం కాదిది. కానీ రేపు యీ విషయం బయటకు పొక్కినపుడు నా నియోజకవర్గంలో నా పరువేం కావాలి? అని వాపోయాడు.
'పొక్కడం దేనికి? విషయం బయటకు వెళ్లకుండా చూద్దాం' అన్నాడు హంఫ్రీ.
జిమ్ తెల్లబోయాడు – తన కొత్త పారదర్శకత పాలసీ అద్భుతంగా వుందని, అమలు చేసి తీరాలనీ ఉద్ఘాటించిన హంఫ్రీ యిప్పుడు యిలా మాట్లాడతాడేమా అని.
ఫ్రాంక్ కలగజేసుకున్నాడు – 'ఓకే, ఆర్డర్ కాన్సిల్ చేయలేకపోతే, దాని గురించి బయటకు చెప్పేద్దాం.'
దాని వలన లాభం ఏమిటని అడిగాడు హంఫ్రీ. జిమ్ దగ్గర జవాబు లేదు కానీ ఫ్రాంక్ ఠక్కున చెప్పాడు – 'ఒకటి యీ ప్రభుత్వం తన మానిఫెస్టోకు కట్టుబడి వుందని ప్రజలకు తెలుస్తుంది. ఈ ఆర్డర్ యివ్వడం ద్వారా పాత మంత్రి ఇంగ్లండు ప్రయోజనాలు కాపాడని దేశద్రోహి అని, మనది ఓపెన్ గవర్నమెంట్ అనీ ప్రజలకు తెలుస్తుంది. దాని వలన మనకు రాజకీయప్రయోజనం కలుగుతుంది.'
హంఫ్రీ కంగారుపడ్డాడు. ''అంటే.. మంత్రిగారు తన ఉపన్యాసంలో యీ రహస్య సమాచారాన్ని బయటపెట్టాలని మీ ఉద్దేశం కాదు కదా, కొంపదీసి..''
అప్పటిదాకా ఉపన్యాసం ఐడియా రాని ఫ్రాంక్ ఎగిరి గంతేశాడు. ''అవునవును. ఆఫీసు ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులను ఉద్దేశించి మంత్రి ఉపన్యసిస్తారు. దానిలో యీ కుట్రను బయటపెడతారు. ఉపన్యాస ప్రతిని ముందుగానే ప్రెస్‌కు విడుదల చేస్తారు.'' అని డిక్లేర్ చేశాడు.
హంఫ్రీ మొహం చిట్లించాడు. ''అమెరికన్లకు యిబ్బంది కలిగించడం అంత మంచిది కాదనుకుంటాను.'' అంటూ.
''మనం ఆలోచించవలసినది బ్రిటన్‌లోని పేదల గురించి కానీ అమెరికా కంపెనీల లాభాల గురించి కాదు హంఫ్రీ'' అన్నాడు జిమ్ విజయగర్వంతో.
హంఫ్రీ నిట్టూర్చాడు. ''ఇదే మీ నిర్ణయమైతే, మంచో చెడో డిపార్టుమెంటంతా మీ వెంటే నిలబడుతుందని హామీ యిస్తున్నాను.''
''మీరు ఉపన్యాసం రెడీ చేస్తే క్లియరెన్సు కోసం అన్ని డిపార్టుమెంటల్కు సర్క్యులేట్ చేసే బాధ్యత నాది'' అన్నాడు బెర్నార్డ్.
''తక్కిన డిపార్టుమెంట్లకు దీనితో సంబంధం లేదు. ఎవరికీ ముందుగా చూపించి అనుమతి తీసుకోనక్కరలేదు. వాళ్లకేదైనా అభ్యంతరాలుంటే పబ్లిగ్గా చెప్పమనండి. అదే కదా పారదర్శక ప్రభుత్వం అంటే.'' అన్నాడు జిమ్.
''ఆమోదం కోసం కాకపోయినా కనీసం సమాచారం యివ్వడానికైనా తక్కిన శాఖలకు తెలియపరచండి. మనం సమాచారాన్ని ప్రజలతో పంచుకోవడానికి సిద్ధపడినపుడు మన సహచరులతో పంచుకోవడంలో తప్పేముంది?'' అని వాదించాడు హంఫ్రీ. జిమ్‌కు అంగీకరించక తప్పలేదు. ''అయితే అన్ని శాఖలతో బాటు మీడియాకు కూడా కాపీ పంపండి.'' అని హంఫ్రీని ఆదేశించాడు.
''మీకు మేలు చేకూర్చేది చేయడానికే మేమున్నాం మంత్రిగారూ'' అన్నాడు హంఫ్రీ. (సశేషం)
(ఫోటో – బిబిసి వారి ''ఎస్ మినిస్టర్'' సీరియల్లో హంఫ్రీ, జిమ్, బెర్నార్డ్ పాత్రలు చూపించిన తీరు)
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)