ఇండస్ట్రీలో అంతుపట్టని వ్యవహారం ఏదన్నా వుందీ అంటే అది పవన్ కళ్యాణ్ నటించే సినిమాలే. అవి ఎప్పుడు మొదలవుతాయో, అసలు మొదలవుతాయో లేదో? ఎప్పుడు పూర్తి చేస్తారో? ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది ఎవ్వరికీ తెలియదు. ఆయన ఎప్పుడు షూట్ పెట్టమంటారో తెలియదు. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఆయన సై అన్నాక, అప్పుడు పరుగులు పెట్టాల్సిందే.
నిర్మాత శరద్ మురార్, డైరక్టర్ డాలీ ల పరిస్థితి ఇదే అని టాలీవుడ్ గుసగుసల సారాంశం. అయితే ఇలా అయితే నిర్మాతకు పాపం ఇబ్బంది కదా అని అమాయకంగా ప్రశ్నిస్తే, నిర్మాత ఎవరు పవన్ కళ్యాణ్ నేగా అన్న సమాధానాలు చటుక్కున వినిపిస్తున్నాయి. శరద్ మురార్ నిర్మాత అని వున్నా, కర్త కర్మ క్రియ అన్నీ పవన్ నే అని అంటున్నారు. అందువల్ల సమస్య ఏదయినా వుంటే ఆయనకే కానీ, ఇంకెవరికి కాదట.
ప్రేమమ్ ఫినిష్ చేసి, శృతి హాసన్ పవన్ సినిమాకు డేట్లు రెడీ చేసేసారు. కానీ వాళ్లు సినిమానే ప్రారంభించలేదు. ఆ మధ్య ముహుర్తానికి రెండు రోజులు అన్నారు. అయిపోయింది. మూడోవారంలో ప్రారంభించే అవకాశం వుంది అంటున్నారు. జరిగే దాకా తెలియదు.
ఇదిలా వుంటే పవన్ తో సినిమా అని డిసైడ్ అయిపోవడంతో, హారిక హాసిని సంస్థ చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ తాను పవన్ తోనే చేస్తా అనడంతో నిర్మాత చిన బాబు కాదనలేకపోతున్నారని వినికిడి. లేదూ అంటే ఆయనకు ఎవరో ఒక పెద్ద హీరోతొ సినిమా స్టార్ట్ చేయాలనే వుంది. కానీ త్రివిక్రమ్ ను కాదనలేని పరిస్థితి. అలా అని ఇలా ఎప్పుడు మొదలుపెట్టుకోవాలో తెలియని పరిస్థితి.
డాలీ డైరక్షన్ లో సినిమా ఓ కొలిక్కి వస్తే కానీ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ కాదు. పవన్ తన సినిమాను పక్కన పెట్టి ముందు హారిక హాసిని సినిమా చేసేస్తారేమో అన్న గుసగుసలు కూడా వున్నాయి. అలా అయితే పాపం, దర్శకుడు డాలీకి షాక్ అవుతుంది. అలా వుండదని, ముందు ఆ సినిమానే వుంటుందనీ వార్తలు వినిపిస్తున్నాయి. అలా అయితే హారిక హాసిని నుంచి సమీప భవిష్యత్ లో సినిమా వుండనట్లే మరి. నిజానికి పవన్ కు కమిట్ కాకుండా వుండి వుంటే అల్లు అర్జున్ తో మరో సినిమా ఈపాటి స్టార్ట్ చేసి వుండేవారు.
మొత్తానికి పవన్ పుణ్యమా అని ఇద్దరు డైరక్టర్లు, ఇద్దరు నిర్మాతలు అలా అగమ్యగోచరంగా చూస్తూ వుండిపోవాల్సి వచ్చింది.