అభిమానం గుండెలనిండా వున్నపుడు మంచి చెప్పినా, చెడ్డలాగే కనిపిస్తుంది. ప్రపంచంలో చాలా మంది హీరోలు వుండొచ్చు. కానీ అభిమానులు స్వంత డబ్బులు ఖర్చు చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసే హీరో మెగాస్టార్ ఒక్కరే అంటూ ఆయన కొడుకు రామ్ చరణ్ సగర్వంగా ప్రకటించారు. సంతోషం.
అలాంటి హీరో మనకే వున్నందుకు. అభిమానులు అందరూ కలిసి లక్షల రూపాయిలు వసూలు చేసి, రాష్ట్రం అంతటా పూజలు, జపాలు, హోమాలు తొమ్మిది రోజులు నిర్వహించి. వాటి కోసం హాజరైన మెగా ఫ్యామిలీ జనాలకు ఏర్పాట్లు చేసి, శిల్పకళావేదిక లాంటి భారీ, ఖరీదైన వేదికలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు చేసారు. అంటే ఎన్ని లక్షలు ఖర్చయి వుండాలి. అభి మానులు ఎంత ఎంత చందాలు వేసుకుని వుండాలి? ఇలాంటి ఈవెంట్ కు, అది కూడా తన కోసం తన అభిమానులు చేస్తున్న ఈవెంట్ కు, తన పుట్టిన రోజుకు ఓ అరగంట పాటు హాజరు కావడానికి మాత్రం సదరు స్టార్ కు తీరికలేకపోయింది.
ఈసారికి మమ్మల్ని సెలబ్రేట్ చేసుకోమన్నారు అని రామ్ చరణ్ సర్ది చెబితే చెప్పి వుండొచ్చు గాక. కానీ హాజరుకాలేనంత బిజీలో వున్నారా? హాజరు కాలేనంత దూరంలో వున్నారా? అదే సమయంలో పార్క్ హయాత్ లాంటి విలాసవంతమైన హోటల్ లో ఆయన సినిమా, రాజకీయ సెలబ్రిటీలకు భారీ విందు ఇస్తూ గడిపారు. చిత్రమేమిటంటే, ఈ అభిమానుల ఫంక్షన్ కు హాజరైన మెగా హీరోలు అందరూ ముందుగానో, వెనకగానో ఆ ఫంక్షన్ కు కూడా హాజరయిన వారే. అంటే అక్కడికి వెళ్లడానికి వీలయింది కానీ, తన అభిమానులు, తన కోసం లక్షలు ఖర్చు చేసి నిర్వహించిన ఫంక్షన్ కు రావడానికి మాత్రం మెగాస్టార్ కు కుదరలేదు.
వీళ్లు కబుర్లు చెబుతారు. అభిమానులు లేకుంటే మేం లేము, వారి వల్లే ఇదంతా, వారికి ఆజన్మాంతం రుణపడి వుంటాం, ఇలా. శ్రీనువైట్ల సినిమాలో మాదిరిగా మెగా వాడకం అంటే ఇలా వుంటుందేమో ? సినిమాలు విజయవంతం చేయడానికి అభిమానులు కావాలి. తమ పుట్టిన రోజులు ఘనంగా జరపడానికి అభిమానులు కావాలి. కానీ తాము మాత్రం అభిమానులతో కాకుండా సెలబ్రిటీలతో విలాసవంతమైన హోటళ్లలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటాం.
ఏం చేస్తాం. అభిమానం గుండెలనిండా వున్నపుడు, ఇలాంటివి పెదవి పైకి రానీకుండా లోలోపలే ఎవరికి వారు అణచిపెట్టుకుంటాం. సర్లే, మన పని మనం చేసాం అని సరిపెట్టుకుంటాం. ఎందుకంటే మెగాభిమానులం కదా?