నట్టి కుమార్, చిన్న నిర్మాత, చిన్న ఎగ్జిబిటర్. కానీ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలకు ఎదురు ఈదుతూ వుంటారు. సంచలన ప్రకటనలు చేస్తూ వుంటారు. ముఖ్యంగా సినిమా రంగాన్ని గుప్పిట్లో వుంచుకున్న కొందరు పెద్దలపై మాటల తూటాలతో విరుచుకుపడుతుంటారు. ఎందుకొచ్చింది..మాటకు మాట ఎదురువస్తుందని, నట్టి కుమార్ మాటలను ఎవరూ కౌంటర్ చేసే సాహసం చేయరు. అలాంటి నట్టి కుమార్ మళ్లీ మరోసారి మీడియా మీట్ ఏర్పాటు చేసారు. సోమవారం నాడు. అది కూడా కాంటెంపరరీ ఇస్యూ నయీమ్ వ్యవహారంపై. నయీం బాధితులు చాలా మంది ఇండస్ట్రీలో వున్నారని గుసగుసలు వినిపిస్తున్న నేఫథ్యంలో నట్టి కుమార్ ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు చాలా మందిలో ఇదే డిస్కషన్.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, ఉత్తరాంధ్రలో నయీమ్ మనుషుల దందా గురించి, హైదరాబాద్ లో ఇంకా సజీవంగానే వున్న నయీం నెట్ వర్క్ గురించి నట్టి కుమార్ మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో నయీం పేరు చెప్పుకునే, లేక అలాంటి దందానో నడుపుతున్నారని, వాళ్లే ఉత్తరాంధ్ర థియేటర్లు, క్యాంటీన్లు అన్నీ బలవంతంగా రాయించేసుకుంటున్నారని, దీన్ని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులు కూడా ఏమీ అడ్డుకోలేకపోతున్నారన్నది నట్టి కుమార్ ఆరోపణ అని తెలుస్తోంది. కబురు చేయడం, ఎంత కొంత చేతిలో పెట్టడం, థియేటర్ ను, థియేటర్ క్యాంటీన్ ను స్వాధీనం చేసుకోవడం వంటి దందాలు ఉత్తరాంధ్రలో నడుస్తున్నాయని, నట్టి కుమార్ థియేటర్ ను కూడా అలాగే తీసేసుకున్నారని వినికిడి. ఇలా థియేటర్లు వదులుకున్నవారిలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా వున్నారని నట్టి కుమార్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర థియేటర్ల క్యాంటీన్ల ద్వారా రోజూ లక్షల్లో, నెల నెలా కోట్లలో అక్కౌంట్ ఫర్ కాని వ్యాపారం సాగుతున్నా, ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం నష్టం పోతున్నా, ఎవరికీ పట్టడం లేదని, సేల్స్ టాక్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు మాట్లాడడం లేదని, క్యాంటీన్ల అమ్మకాలు, కొనుగోళ్లపై రికార్డులే వుండవన్నది నట్టికుమార్ ఆరోపణ.
ఇవి కాక, నయీమ్ విషయంలో టాలీవుడ్ జనాల సంబంధాలు, తనను కిడ్నాప్ చేసే ప్రయత్నం ఎలా జరిగింది, ఎలా విఫలమైంది, తనకు ముందుగా ఎవరు ఇన్ ఫర్ మేషన్ ఇచ్చారు, ఓ సినిమా నిర్మాత డిస్ప్యూట్ సైట్ కు నయీమ్ మనుషులు ఎలా కాపలా కాస్తున్నారు, ఇతరత్రా సంచలన సంగతులు నట్టికుమార్ చెప్పబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.