యుపిఏ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీస్థాయి అవినీతి చూసి వేసారిన భారతీయ ప్రజను మోదీ యిచ్చిన 'తినను, తిననివ్వను' స్లోగన్ విపరీతంగా ఆకర్షించింది. అది కేవల వాగ్దానంతో ఆగిపోదని, అమలు చేసి చూపిస్తాడని ఆశ పెట్టుకున్నారు. ఇప్పటిదాకా ఎన్డిఏ హయాంలో భారీ స్కామ్ ఏదీ బయటపడలేదన్నది వాస్తవం. అయితే అక్రమం జరగగానే వెంటనే బయటకు రావడం జరగదు. అలా జరిగి వుంటే యుపిఏ 2 అధికారంలోకి వచ్చేదే కాదు. అడానీ, అంబానీ వంటి వ్యాపారవేత్తలకు గతంలో కంటె ఎక్కువగా దోచి పెట్టడం సాగుతూనే వుంది. కొన్నేళ్లు పోయాక వివరాలన్నీ బయట పడినపుడే మోదీ పాలనపై సరైన అంచనా వస్తుంది. చేసినదాన్ని మించి ప్రచారం చేసుకోవడంలో, వాస్తవాలు కప్పిపుచ్చడంలో చంద్రబాబుకూ పాఠాలు చెప్పగల సత్తా మోదీకి వుంది.
పాలకులు ఏం చెప్పినా నిజానిజాలు మీడియా వెలికి తీస్తుందని మన బోటి అమాయకులం అనుకుంటూ వుంటాం. అవన్నీ గతకాలపు రోజులు. ఇప్పుడు అధికారంలో వున్న ప్రతివారు ఎడ్మినిస్ట్రేషన్ కంటె మీడియా మేనేజ్మెంట్లో దిట్టలై పోయారు. నయాన నచ్చచెప్తున్నారో, భయాన బెదిరిస్తున్నారో చెప్పలేం కానీ మీడియా చాలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాస్తవం చెప్పవలసి వచ్చినా, దాన్ని మనం అవగాహన చేసుకోలేని రీతిలో, అంతరార్థం గ్రహించలేని తీరులో చెప్తున్నారు. అందువలన ఒకటికి నాలుగు పత్రికలు, ఆరు ఛానెల్స్ చదవాల్సి వస్తోంది, చూడాల్సి వస్తోంది. పైగా సరైన టైములో మీడియా నోరు విప్పదు. విషయం బయటకు వచ్చాక మాత్రం మసాలా వేసి, కవిత్వం రంగరించి అందిస్తుంది. ఉదాహరణకి నయీం వ్యవహారమే చూడండి. అతనిలాటివాడు, అలాటివాడు, వ్యవస్థ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు, అందర్నీ శాసించాడు అని యిప్పుడు కథనాలు వండి వారుస్తూన్న మీడియా అతను బతికుండగా దీనిలో పదో శాతమైనా రాసిందా? నిజానికి యిప్పుడు నిర్జీవుడైన నయీం కంటె, సజీవంగా వున్న అతని వంటి అనేక మంది డాన్ల గురించి చెప్పాల్సి వుంది. అవేమీ చెప్పటం లేదు. జాతీయ వ్యవహారాల గురించి కూడా తెలుగు మీడియా చెప్పవలసినంత చెప్పటం లేదు. ప్రజలకు సమాచారం అందివ్వడం మీడియా ప్రధాన బాధ్యత. వాళ్ల అభిప్రాయాలను తీర్చిదిద్దే పని పెట్టుకోనక్కరలేదు. అందిన సమాచారంతో పాఠకుడు సొంత తెలివితేటలుపయోగించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలడు, అవసరమున్న చోట మార్చుకోగలడు.
అన్నా హజారే ఉద్యమం సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ పేరు దేశమంతటా మారుమ్రోగింది. ప్రధాని పదవికి తగిన అభ్యర్థి అతనే అంటూ రాహుల్ గాంధీతో (ఇంకెవరూ దొరకనట్లు) అతన్ని పోల్చి చూపుతూ ఫార్వార్డ్లు వచ్చాయి. పోలిస్తే గీలిస్తే అప్పటి ప్రధాని మన్మోహన్‌తో పోల్చాలి కానీ బడుద్ధాయిగా, దేనిలోనూ ఆసక్తి లేని వ్యక్తిగా పేరుబడిన రాహుల్‌తో పోలికెందుకు? అప్పట్లో అరవింద్ కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కాబట్టి, బిజెపి అన్నా ఉద్యమానికి మద్దతు యిస్తోంది కాబట్టి యివన్నీ చాలా ఉత్సాహంగా చదివారు నెటిజన్లు, మధ్యతరగతి జనాలు. పోనుపోను అరవింద్ బిజెపికి పోటీగా ఎదగసాగడంతో, ఢిల్లీలో గెలిచి మోదీకి చెవిలో జోరీగలా తయారవడంతో ఎవర్ని సమర్థించాలో తెలియక వాళ్లు గందరగోళ పడసాగారు. ఉన్నదున్నట్లు చెప్పుకోవాలంటే మోదీ అరవింద్‌పై వ్యక్తిగతంగా కక్ష సాధిస్తున్నట్లే కనబడుతోంది. లెఫ్టినెంటు గవర్నరు ద్వారా అతన్ని అదుపులో వుంచుతూ, అతని ప్రభుత్వానికి అవరోధాలు కల్పిస్తూ, అతని పార్టీ ఎమ్మెల్యేలను సతాయిస్తూ ఉక్కిరిబిక్కిరి చేయడానికి నిశ్చయించుకున్నాడు. అరవింద్ కూడా నోరు పారేసుకుంటూ, ప్రచారార్భాటం చేసుకుంటూ, తనపై జరుగుతున్న దాడిని భూతద్దంలో చూపుకుంటూ, 'ఇతను అప్పటి మేధావి ఉద్యమకారుడు కాదు, యింకో రాజకీయ నాయకుడు మాత్రమే' అని అందరూ అనుకునేట్లు ప్రవర్తిస్తున్నాడు. ఆప్ ఎమ్మెల్యేలపై డజన్ల కొద్దీ కేసులు బనాయిస్తున్నారు. వీట ఔచిత్యంపై వ్యాఖ్యానించడానికి నెటిజన్లు, యువత, టీవీ చర్చల్లో పాల్గొనే మేధావులు.. ఎవరూ ఆసక్తి చూపటం లేదు. అవే కేసులు కాంగ్రెసు ఎమ్మెల్యేలపై వేసి వుంటే ఎన్నో కార్టూన్లు, సెటైర్లు పేలి వుండేవి.
ఇంతకీ ఆప్ ఎమ్మెల్యేలపై వేసిన కేసులు ఎలాటివి? ముందుగా తెలుసుకోదగినది – యితరుల కంటె తాము భిన్నం అని ఆప్ ఎంత చెప్పుకున్నా, గతంలో బిజెపి లేదా కాంగ్రెసులో పనిచేసిన వారిలో చాలామందిని ఆప్ తీసుకుంది. వారిలో చాలామంది హిస్టరీ షీటర్సున్నారు. ఢిల్లీ పోలీసులు చెప్పేదాని ప్రకారం 67 మంది ఆప్ ఎమ్మెల్యేలలో 23 మందిపై 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందే క్రిమినల్ చార్జెస్ వున్నాయి. అరవింద్‌తో కొంతకాలం పనిచేసి తర్వాత విభేదించి విడిగా వెళ్లిన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు 'శరద్ చౌహాన్, అమానతుల్లా ఖాన్ వంటి అనేక మందిని తీసుకోవద్దని మేం అరవింద్‌ను ముందే హెచ్చరించాం. కానీ అతను వినలేదు' అంటున్నారు. ఆత్మహత్యకు ప్రోద్బలం చేసిన (ఎబెటింగ్ సూసైడ్) కేసుపై శరద్ చౌహాన్‌ను జులై 31 న అరెస్టు చేశారు. సోనీ అనే ఆప్ మహిళా కార్యకర్త తనను సాటి ఆప్ కార్యకర్త లైంగికంగా వేధిస్తున్నాడని శరద్ వద్ద ఫిర్యాదు చేసింది. అయినా అతను ఆమెను గోడు పట్టించుకోకుండా ఆరోపితుణ్నే సమర్థించాడట. ఆమె ఆత్మహత్య చేసుకుంది. 'నువ్వు తగిన చర్య తీసుకోకుండా ఆమెను ఆత్మహత్య చేసుకునేట్లు చేశావు' అంటూ పోలీసులు యితనిపై కేసు పెట్టారు. అంతకు 8 రోజుల క్రితం అమానతుల్లా ఖాన్‌పై కేసు పెట్టిన కేసు – హత్యాయత్నం, బెదిరింపు, బలాత్కారం!
ఎవరైనా మహిళ నన్ను ఆప్ ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడు అని ఫిర్యాదు చేస్తే చాలు, ఆధారాలు చూపకపోయినా పోలీసులు వెంటనే అరెస్టు చేసేస్తున్నారు. జులై 9 న అరెస్టయిన ప్రకాశ్ జర్వాల్, జూన్ 25 న అరెస్టయిన దినేశ్ మొహానియా కూడా యిలాటి కేసులను ఎదుర్కుంటున్నారు. దినేశ్‌పై సీనియర్ సిటిజన్‌ను కొట్టినట్లు అభియోగం. సరైన ఆధారాలు చూపకపోవడంతో వీళ్లందరికీ బెయిలు లభిస్తోంది. అమానతుల్లా ఖాన్ కేసులో కూడా 'మీరు చూపుతున్న సాక్ష్యం సరిగ్గా లేదు' అని కోర్టు పోలీసులతో వ్యాఖ్యానించింది. అతనిపై ఫిర్యాదు చేసినామె 'పోలీసుల ఒత్తిడికి లొంగి నేను అతన్ని బెదిరింపు కేసులో యిరికించాను' అని వీడియోలో చెప్పింది. ఆమె అలా చెప్పినా పోలీసులు కేసు కొనసాగించి కోర్టుచేత అక్షింతలు వేయించుకున్నారు. సురేందర్ సింగ్ కేసు విషయంలో 'మీరు చేస్తున్న అభియోగానికిి, మోపిన సెక్షన్లకు పొంతన లేకుండా వుంది' అంది కోర్టు. అల్లర్లలో పాల్గొన్నాడంటూ 2015 నవంబరులో అఖిలేశ్ త్రిపాఠీపై పెట్టిన కేసు కొట్టేసింది. అరవింద్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలగుతున్న సోమనాథ్ భారతిపై 2015 డిసెంబరులో కేసు పెట్టారు. అతని భార్య 'నాపై దాడి చేయమని మా కుక్కను మా ఆయన ఉసిగొల్పాడు' అని ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా గృహహింస, హత్యాయత్నం సెక్షన్లతో కేసు పెట్టేశారు. తర్వాత చూడబోతే ఆ కుక్క భార్య పెంపుడు కుక్క. ఇతని మాట విననే వినదట! ఓ హోల్‌సేల్ కూరల వ్యాపారి ఫిర్యాదు చేశాడంటూ ఏకంగా ఉపముఖ్యమంత్రి మనీశ్ శిశోదియాపై కేసు పెట్టారు.
ఏడాది క్రితం భూ ఆక్రమణ నేరంపై మనోజ్ కుమార్‌ను, డిగ్రీ సర్టిఫికెట్టుకై ఫోర్జరీ చేసినందుకు జితేందర్ తొమార్పై కేసులు పెట్టారు. ఆప్ పంజాబ్గోదాలో దిగి బిజెపికి సవాళ్లు విసురుతున్న కొద్దీ కేసులు పెరిగిపోతున్నాయి. ఖురాన్లో పేజీలు చింపాడంటూ నరేశ్ యాదవ్ అనే ఎమ్మెల్యేపై కేసు పెట్టారు. పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసులంత తెలివైనవారు కాదు కాబోలు, మొదట్లో ముగ్గురు ఆరెస్సెస్ కార్యకర్తలు చింపారని కేసు పెట్టి, మధ్యలో మాట మార్చి, ఆప్‌ను లాక్కుని వచ్చారు. ఇవన్నీ కాకుండా పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమితులైన 21 మందిపై 'అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ఎందుకు చేయరాదు?' అని అడుగుతున్నారు. 'కాంగ్రెసు హయాంలో కూడా యిలాటి నియామకాలు జరిగాయి. అప్పుడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కానిది, మా హయాంలోనే ఎందుకయింది?' అని అరవింద్ మండిపడుతున్నాడు. ఆప్ విషయంలో యింత 'సమర్థవంతం'గా పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులు మరి బిజెపి నాయకుల విషయంలో మాత్రం ఎందుకు చేతకానివారై పోతున్నారని కొందరికి సందేహం. ఎన్డిఎమ్సి లీగల్ ఆఫీసరు ఎంఎం ఖాన్ హత్య కేసులో నిందితుడైన, ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్, బిజెపి నాయకుడు కరణ్ సింగ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు? పటియాలా హౌస్ కోర్టు ఆవరణలో జర్నలిస్టులు కొడుతూ వీడియో కెమెరాలకు పట్టుబడిన ఒపి శర్మ అనే బిజెపి ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేయలేదు? అని అడుగుతున్నారు.
ఈ ప్రశ్నను మహారాష్ట్రలో కాంగ్రెసు-ఎన్‌సిపి వేరే రకంగా అడుగుతున్నాయి. ఢిల్లీ ఎమ్మెల్యేలపై అన్ని కేసులు పెట్టేస్తున్నారే, మరి మహారాష్ట్ర ఎమ్మెల్యేలను ఎందుకు రక్షిస్తున్నారు? మీ పార్టీ వారనా? అని అడుగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఏకంగా 17 మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసి న్యాయపరమైన విచారణ కావాలన్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అవన్నీ ఉత్తుత్తివే అంటూ విచారణకు నిరాకరించాడు. టూరిజం మంత్రి జయకుమార్ రావల్ విషయంలో మాత్రం కాస్త వింతగా ప్రవర్తించ వలసి వచ్చింది. ఎందుకంటే అతని కథ యిప్పటిది కాదు. ధూలే జిల్లాలో దొండాచియా పట్టణంలో దాదాసాహెబ్ రావల్ కోఆపరేటివ్ బ్యాంకు లి. అని వుంది. దానిలో జయకుమార్ రావల్, అతని బంధువులు డైర్టర్లు. వాళ్లంతా డిపాజిటర్లు దాచుకున్న డబ్బును తమకు, తమ బంధువులకు ఋణాలుగా తీసేసుకున్నారు. అప్పిచ్చేటప్పుడు ఆస్తులు తనఖా పెట్టలేదు. జయకుమార్, అతని బంధువులు కలిసి పెట్టిన స్టార్చ్ ఫ్యాక్టరీ కూడా ఋణగ్రస్తుల్లో ఒకటి. డబ్బు తిరిగి కట్టలేదు. ఇలాటి చావుబాకీలు రూ. 28 కోట్లకు చేరి, బ్యాంకు ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమై పోయింది. 2003-04 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లపాటు వెలువడిన ఆడిట్ రిపోర్టులో యీ విషయాన్ని ఎత్తి చూపారు. అవి చూసి రిజర్వు బ్యాంకు ఆ బ్యాంకు లైసెన్సు రద్దు చేసింది. ఈ ఆడిట్ రిపోర్టు ఆధారంగా కొందరు డిపాజిటర్లు బ్యాంకు డైరక్టర్లపై పోలీసు కంప్లయింటు యిద్దామని చూశారు. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. తీసుకొనేట్లా పోలీసులను ఆదేశించమని కోరుతూ శరద్ పాటిల్ అనే డిపాజిటరు 2007లో బాంబే హైకోర్టు వారి ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ పెట్టాడు. ఆ విషయం తెలిసి రావల్ సోదరి, కజిన్ తాము యివ్వాల్సిన బాకీలు కట్టేసి ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవద్దంటూ కోర్టును కోరారు. కానీ కోర్టు పిటిషన్ స్వీకరించింది.
స్థానికంగా జయకుమార్ ప్రభృతులకున్న పలుకుబడి కారణంగా యీ కేసు నత్తనడక కూడా నడవదని గ్రహించిన ధూలే జిల్లా డియస్పీ యీ కేసును సిఐడికి అప్పగించమని, ముంబయిలోని డైరక్టరు జనరల్ (డిజి) ఆఫీసుకి రాశాడు. అయితే డిజి ఆఫీసు ఒత్తిళ్లకు లొంగి కాబోలు, దానిపై చర్య తీసుకోలేదు. కేసును వేగవంతం చేయమని డిపాజిటర్లు హైకోర్టుకి వెళ్లారు. కోర్టు పోలీసును ఒక సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము) ఏర్పాటు చేసి నిర్దిష్టమైన సమయంలో విచారణ పూర్తి చేయమంది. 2015 ఆగస్టు 21 న సిట్ ధూల్ ఎస్పీకి లేఖ రాస్తూ తమకు 8 మంది పోలీసు ఆఫీసర్లు, 55 మంది పోలీసులు, 5గురు లేడీ పోలీసు ఆఫీసర్లు, రెండు రయట్ కంట్రోలు టీములు, ఒక క్విక్ రెస్పాన్సు టీము, 10 వాహనాలు ఆగస్టు 23 ఉదయం 9 గంటల కల్లా సిద్ధం చేయమంది. ఎందుకిదంతా అంటే 56 మంది నిందితులలో యిద్దరు బిజెపి ఎమ్మెల్యేలు- ఒకరు దొండాచియా నియోజకవర్గపు శాసనసభ్యుడు జయకుమార్ రావల్ కాగా, మరొకరు నంద్దర్బార్ నియోజకవర్గపు శాసనసభ్యుడు విజయకుమార్ గావిట్. వారిని అరెస్టు చేయబోతే వారి అనుచరులు కల్లోలాలు సృష్టిస్తారనే భయంతో యీ ముందస్తు ఏర్పాట్లు!
ఈ లేఖ వస్తోందని తెలియగానే ఆగస్టు 20 న ఆరుగురు నిందితులు హోం శాఖ కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు లేఖ రాస్తూ ''ఇది రాజకీయ కక్షతో నడుస్తున్న కేసు. స్థానిక పోలీసులు మాకు వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు. అందువలన కేసు విచారణను సిఐడికి బదిలీ చేయాలి.'' అని కోరారు. ఇలాటి కోరిక ప్రతిపక్ష సభ్యుల నుంచి వస్తే అర్థం చేసుకోవచ్చు. అధికారపక్షం వారు చేశారంటే దాని అర్థం – కేసు విచారణను ఎలాగోలా జాప్యం చేయించాలనే! లేఖ అందగానే ముఖ్యమంత్రి కార్యాలయం ధూలే ఎస్పీ ఆఫీసుకి ఫోన్ చేసి 'లేఖపై నిర్ణయం తీసుకోబోతున్నాం కాబట్టి, అరెస్టులు చేయకండి' అని చెప్పింది. అంతేకాదు విచారణను సిఐడికి బదిలీ చేస్తూ ఆగస్టు 24 న హోం శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ''ఇదెక్కడి చోద్యం? తనను ఎవరు విచారణ చేయాలో నిందితుడు అడగడమేమిటి? మీరు ఒప్పుకోవడమేమిటి?'' అని ప్రతిపక్షాలు ఫడ్నవీస్‌ను కడిగేశాయి. ఫడ్నవీస్ దానికి డైరక్టుగా సమాధానం చెప్పకుండా 'ఈ కేసుకు అనుబంధంగా వేసిన తన కేసును కక్షిదారుడే విత్‌డ్రా చేసుకున్నాడు. దాన్ని బట్టే యీ కేసులో బలం లేదని తెలుస్తోంది' అన్నాడు. జరిగినదేమింటే యోగేశ్ షిండే అనే అతను సిఐడికి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ పిల్ వేశాడు. దానికి కోర్టు 'మీరు కేసు వేయడానికి రెండు నెలల ముందే సిఐడికి బదిలీ అయిపోయింది. ఇప్పుడు వాళ్లే విచారణ కొనసాగిస్తారు.' అని చెప్పింది. దాంతో అతను పిల్ ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఇందులో జయకుమార్ రావల్ నిర్దోషి అని ఎవరూ చెప్పలేదు. ''సిఐడి 24 మంది నిందితులను గుర్తించి, వారిపై చార్జిషీటు దాఖలు చేసింది.'' అని ఫడ్నవీస్ సభలో చెప్పాడు. కానీ జయకుమార్ రావల్ పేరు 25వ నిందితుడిగా వుందని చెప్పలేదు.
అవినీతి పట్ల మాది జీరో టోలరెన్స్ అని చెప్పుకునే బిజెపి మహారాష్ట్రలో వ్యవహరిస్తున్న తీరు యిది. అవినీతి విషయంలో మాట ఎలా వున్నా ఆప్ పట్ల మాత్రం బిజెపి జీరో టోలరెన్సు చూపుతోంది. దేశం మొత్తంలో 290 ప్లస్ బిజెపి ఎమ్మెల్యేల పట్ల క్రిమినల్ కేసులున్నాయని, ఆప్ ఎమ్మెల్యేల విషయంలో వ్యవహరించినంత జోరుగా వారిపై కూడా వ్యవహరిస్తేనే బిజెపి నిజాయితీ తెలుస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఎవరి విషయంలో చొరవ తీసుకుంటారు, ఎవరి విషయంలో తాత్సారం చేస్తారు అనేది తెలుసుకోవాలంటే మనం ఒకే ప్రశ్న వేయాలి – 'అస్మదీయుడా? తస్మదీయుడా?' అని.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)