ప్రఖ్యాత మలయాళీ నటుడు మమ్ముట్టీ నటించిన తొలి సినిమా ఇంత వరకూ విడుదల కాలేదు! అంతే కాదు.. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తొలిసారి మేకప్ వేసుకున్న.. ఫ్రెష్ గా నటించిన సినిమా లు విడుదల కాకపోవడం అనేది ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నటీనటులకు అమితంగా బాధించేదే. అయితే తొలి సినిమా విడుదల కాకపోయినంత మాత్రాన పోయేదేం లేదు.. తొలి సినిమా విడుదలే కాకపోయినా.. హీరోయిన్ గా దూసుకపోవచ్చు అని నిరూపించడానికి విద్యాబాలన్ కూడా ఒక ఉదాహరణ.
ఆ కోవలోనే పయనిస్తోంది కీర్తీ సురేష్. ఈమెగురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఎక్స్ పోజింగ్ కు ఆమడదూరంలో ఉండి కూడా యువహీరోల సరసన అవకాశాలు సంపాదించుకుంటోంది కీర్తీ. ‘నేను శైలజ’ సినిమాతో హిట్ ను సొంతం చేసుకుని.. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ యంగ్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది కీర్తి. మరి దక్షిణాది నటి మేనకా సురేష్ కూతురు అయిన కీర్తికి సంబంధించిన విశేషం ఏమిటంటే.. ఈమె తొలి సినిమా ఇప్పటి వరకూ విడుదల కాకపోవడం.
కీర్తి నటించిన తొలి సినిమా తెలుగులోది కావడం.. దాని ఓపెనింగ్ కు సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేశ్ బాబులు క్లాప్ కొట్టడం విశేషం. రెండేళ్ల కిందట ఆ సినిమా షూటింగ్ మొదలైంది. పేరు కూడా పెట్టని ఆ సినిమాలో హీరో అలనాటి హీరో, ప్రస్తుత కేరెక్టర్ ఆర్టిస్టు నరేష్ తనయుడు నవీన్! విజయనిర్మలకు మనవడుకావడంతో ఈ సినిమా ముహూర్తానికి కృష్ణా , మహేశ్ లు కూడా హాజరయ్యారు. పెద్ద హీరోలతో సినిమాలు తీసిన నేపథ్యం ఉన్న “ఫ్రెండ్లీ మూవీస్’’ వాళ్లు ఆ సినిమాను మొదలుపెట్టారు. అయితే అంత నేపథ్యం ఉన్నా.. ఆ సినిమా పూర్తి అయినట్టుగా లేవు. విడుదల ఊసే లేదు.
ఆ సినిమా ను అలా వదిలేసుకుని.. కీర్తీ సురేష్ తమిళంలో మరో అవకాశాన్ని సంపాదించుకుంది. దాని ద్వారా వచ్చిన గుర్తింపుతో తెలుగులో అవకాశాలు సంపాదించుకుంది. ఇప్పుడు క్రేజీ తార గా దూసుకపోతోంది.