సాయిధరమ్ తేజ లేటెస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫట్ మని నీటి బుడగలా పేలిపోయింది. ఇప్పుడు సాయి ధరమ్ పరిస్థితి కిం కర్తవ్యం అన్నట్లు తయారైంది. మెగా క్యాంప్ హీరోలకు సాయి ధరమ్ కాస్త భిన్నం. ఇమేజ్ ఎలా వున్నా, స్టామినా ఎలా వున్నా, ఏ మెగా హీరోలో కూడా అత్యుత్సాహం కనిపించదు. సైలెంట్ గా కెరీర్ డిజైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ సాయి ధరమ్ తీరువేరు. కాస్త హడావుడి ఎక్కువ. చిరంజీవిని, పవన్ ను తన చిత్తానికి తన సినిమాల్లో వాడేయడం అలవాటు.
స్టయిళ్లు, పాటలు, పేర్లు ఇలా ఒకటి కాదు. అన్నీ వాడేసుకోవడమే. ఆఖరికి గ్యాంగ్ లీడర్ టైటిల్ కూడా వాడేద్దామనుకున్నాడని, మెగాస్టార్ కు ఇష్టం లేదని తెలిసి ఆగారని వినికిడి. గట్టిగా రెండు సినిమాలు చేయకుండానే తనకు తానే సుప్రీమ్ హీరో అని టైటిల్ పక్కన చేర్చేసుకున్నాడు. ఇవన్నీ మెగాస్టార్ కు అంతగా రుచించలేదని ఇన్ సైడ్ గుసగుసలు వున్నాయి.
ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి అల్లు అర్జున్ నే పరోక్షంగా టార్గెట్ చేసాడు. అసలే మెగాక్యాంప్ లో బన్నీ క్యాంప్ వేరు అని ఇప్పటికే టాక్ వుంది. ఈ గ్యాప్ లో తను దూరి ప్రయోజనం పొందాలని సాయి ధరమ్ ప్లాన్డ్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అది కాస్తా వికటించేలా వుంది. ఇప్పటికే మెగా క్యాంప్ లో చిరు పాటలు, టైటిళ్లు వాడుతున్నవైనంపై అసంతృప్తి వుందని టాక్ వుంది. మరోపక్క ఇప్పుడు బన్నీ క్యాంప్ తో కూడా పెట్టుకుంటే, అరవింద్ లాంటి స్ట్రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నట్లే.
నిజానికి అద్భుతమైన హిట్ లు ఏవీ సాయి ధరమ్ ఖాతాలో లేవు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్ అని అన్నారు. ఆ సినిమా డైరక్టర్ కు ఏళ్లు దాటిపోయినా ఇంతవరకు సినిమా లేదు. పిల్లా నువ్వులేని జీవితం హిట్ అన్నారు. ఆ సినిమా డైరక్టర్ మరో సినిమా చేయగలిగారంతే. అది కూడా ఓ డిజాస్టర్. సుప్రీమ్ అమ్మిన రేంజ్ వేరు. వచ్చిన ఆదాయం వేరు. ఆ డైరక్టర్ కు కూడా ఆ తరువాత ఇంకా సినిమా ప్రకటన రాలేదు.
సోషల్ నెట్ వర్క్, వెబ్ మీడియాలో హడావుడి ఎక్కువ అసలు తక్కువ అని సాయి ధరమ్ పై గుసగుసలు వున్నాయి. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా అతని చేతిలో వుంది. గోపీచంద్ మలినేని తయారచేస్తున్న కథ ఇది. నిజానికి ఇది ఇంతకు ముందేప్రారంభం కావాల్సింది. కానీ కథ ఇలా కాదు అలా కాదు అంటూ సాయి ధరమ్ వంకలు పెట్టడంతో ఆగింది. ఇప్పడు ఇంక వంకలు పెట్టేంత సీన్ సాయి ధరమ్ కు వుండకపోవచ్చు. ఈ సినిమా అయితే తప్ప సాయి ధరమ్ కు కొత్త సినిమాలు రావడం అంత వీజీ కాదు. ఇన్నాళ్లు అండగా వున్న దిల్ రాజు వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. ఆయన బన్నీ తో సినిమా చేసే ప్లాన్ లో వున్నారు. అందువల్ల ఇక ఇటు చూడడం కష్టం.
ఇండస్ట్రీలోని గీతా, దిల్ రాజు, సురేష్ లాంటి బ్యానర్ల అండ లేకుండా సాయి ధరమ్ ముందుకు వెళ్లాలి. అలాగే నాని, విజయ్, శర్వానంద్, వరుణ్ తేజ, నిఖిల్, రాజ్ తరుణ్, లాంటి అనేక మంది యంగ్ హీరోల పోటీని తట్టుకుంటూ ముందుకు వెళ్లాలి. అది అంత సులువు కాదు. ఎందుకంటే వరుణ్ తేజతో సహా మిగిలిన వారికి సాయి ధరమ్ తేజకు ఓ తేడా వుంది. వారంతా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సాయి ధరమ్ కేవలం మాస్ ఇమేజ్ మీదే ముందు కు వెళ్తున్నాడు. మాస్ ఇమేజ్ నే బేస్ అనుకుంటే మారుతున్న ప్రేక్షకుల అభిరుచి రీత్యా, అది అంత అనుకూల అంశం కాదేమో?
మొత్తానికి గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా హిట్ కొడితే తప్ప, సాయి ధరమ్ కు కాస్త కష్టమే.