చిరంజీవి ఆ పాత్ర చేయగలరా?

మనమంతా..క్రిటిక్స్, సినిమా లవర్స్..మంచి సినిమా అని ముక్త కంఠంతో అన్న సినిమా. మన తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు కలిసి, ఓ అచ్చమైన తెలుగు కథను తీయడానికి ముందుకు వస్తే, దాంట్లో పాత్ర పోషించడానికి…

మనమంతా..క్రిటిక్స్, సినిమా లవర్స్..మంచి సినిమా అని ముక్త కంఠంతో అన్న సినిమా. మన తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు కలిసి, ఓ అచ్చమైన తెలుగు కథను తీయడానికి ముందుకు వస్తే, దాంట్లో పాత్ర పోషించడానికి మాత్రం తెలుగు నటుడు దొరకలేదు. మళయాలం నుంచి మోహన్ లాల్ ను తెచ్చుకోవాల్సి వచ్చింది.  దీని వల్ల అదనపు ఖర్చు అయిందా? లేదా అదనపు వెసులు బాటు వచ్చిందా అన్న విషయం పక్కన పెడితే, ఇదే పాత్రలో మన హీరో ఎవరైనా వుంటే మరింత బాగుండేదేమో అన్న చిన్న ఆలోచన. 

దృశ్యం సినిమా మళయాలం నుంచి తెచ్చుకుని మరీ వెంకీ చేసారు. నిజానికి మనమంతా సినిమాలో పాత్రకు ఆయనా సూట్ అవుతారు. కానీ దృశ్యంలో వున్నట్లు పక్కన మీనా, ఆమెతో చిలిపి రొమాన్స్ వుండవు ఇందులో. అంతెందుకు మన మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి పాత్ర చేయకూడదా? 60లు వచ్చేసినా ఇంకా హీరోలుగానేనా? 

చిత్రమేమిటంటే మన హీరోలు యంగ్ గా వుండగా, విగ్ లు పెట్టుకుని నాన్న క్యారెక్టర్లు, అన్న క్యారెక్టర్లు డబుల్ రోల్ సిన్మాల్లో చేస్తారు. జుట్టు తగ్గిపోయాక కూడా విగ్గే పెట్టుకుని, యంగ్ హీరోల పాత్రలు పోషిస్తారు. మన నిర్మాతలు, దర్శకులు సరైన నటుల కోసం పక్క భాషల్లో వెదుకుతారు. మళ్లీ కళామతల్లి, నటనే ఆశయాలు మాత్రం వినిపిస్తుంటాయి.