కబాలి తెరవెనుక ఏం జరిగింది?

 కబాలి సినిమా విడుదలవుతుంది అంటే టాలీవుడ్ లో ఒకటే హడావుడి. ఎందుకంటే రజనీ కాంత్ గత సినిమాల నష్టాల మూటల వ్యవహారాలు అలాగే వున్నాయి కాబట్టి. ముఖ్యంగా కొచ్చడియాన్ సినిమా వ్యవహారం కీలకమైనది. ఈ…

 కబాలి సినిమా విడుదలవుతుంది అంటే టాలీవుడ్ లో ఒకటే హడావుడి. ఎందుకంటే రజనీ కాంత్ గత సినిమాల నష్టాల మూటల వ్యవహారాలు అలాగే వున్నాయి కాబట్టి. ముఖ్యంగా కొచ్చడియాన్ సినిమా వ్యవహారం కీలకమైనది. ఈ సినిమా కారణంగా తెలుగునాట ఇంటింటా పరిచయమైన బ్యానర్ శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అన్నది ఏకంగా తెరమరుగైపోయింది. అప్పటి నుంచి ఆ సెటిల్ మెంట్ వ్యవహారం అలాగే వుంది. అయితే ఆ సినిమా, ఆ నిర్మాత, ఈ సినిమా, ఈ నిర్మాత వేరు వేరు కాబట్టి సమస్య అంతలా వుండకపోవచ్చు. కానీ లింగా కారణంగా కూడా దెబ్బతిన్న బయ్యర్లు వున్నారు. సాయి కొర్రపాటి లాంటి వాళ్లు సీడెడ్ కొని నష్టపోయారు.

మరోపక్క పాత బకాయిలకు సంబంధించిన మాటలు, చెక్కులు, వగైరాలు వున్నాయని వినికిడి. ఇలాంటి నేపథ్యంలో కబాలిని కొనుగోలు చేసారు. అయితే పాత బాకీల వాళ్లో, సమస్యలు వున్నవాళ్లో ఏకమై కబాలి విడుదల సమయంలోనే తమ సమస్యలు పరిష్కరించుకనే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆపాలనుకుంటున్నారని వార్తలు వినవచ్చాయి. ఇలాంటి టైమ్ లో కబాలి బిజినెస్ స్మూత్ గా జరిగిపోయిందని, లాభాల సంగతి ఎలా వున్నా, లాస్ అయితే లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ అలజడి అంతా ఏమయింది? గీతా ఆర్ట్స్ దగ్గర వున్న సినిమా నైజాంలో అభిషేక్ పిక్చర్స్ దగ్గరకు ఎలా చేరింది? ఇంతకీ కొన్నారా? లేదా? ఎంతకి కొన్నారు? ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. 

కబాలి వివాదాన్ని ఓ చిన్న ఉపాయం చేసి, మెల్లగా పక్కన పెట్టారని వినికిడి. వివాదం ఇండస్ట్రీ పెద్ద మనిషి దాసరి నారాయణ రావు దగ్గరకు కూడా వెళ్లింది. ఆఖరికి చిన్న మధ్యే మార్గం చేసారని తెలుస్తోంది. అందాకా నాలుగు కోట్లు నిర్మాత థానుకు ఇవ్వకుండా ఈ వివాదం కోసం పక్కన వుంచాలని నిర్ణయించినట్లు, రజనీకాంత్ అమెరికా నుంచి వచ్చాక, ఆయన దగ్గర సెటిల్ మెంట్ కు కూర్చునేందుకు ఇరు వర్గాలు ఓ అంగీకారానికి వచ్చాయని తెలుస్తోంది. అయినా కూడా ఏమయినా సమస్యలు వస్తాయేమో అన్న అనుమానాలు లేకపోలేదు. 

అందుకే ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ కు ఇచ్చారు. నిజానికి సినిమా మొత్తం గీతా దగ్గర వుంది. ఎందుకంటే గీతా ఆర్ట్స్ ముందుగా బయ్యర్లకు సినిమా కొనడానికి సాయం చేసినట్లు తెలుస్తోంది. సినిమాను అమ్మడమో, పంపిణీ చేయడమో చేసి గీతా తన డబ్బులు తను తీసుకుంటుంది. అయితే కమిషన్ నో, వడ్డీనో ఇలా సినిమా లెక్కలు వుండనే వుంటాయి. కబాలి కి వచ్చిన హైప్ చూస్తే నైజాం లో డిస్ట్రిబ్యూషన్ వున్న గీతానే సినిమా వుంచుకోవచ్చు. కానీ గీతా ఎందుకో అలా చేయలేదు మరి. కేవలం కృష్ణా జిల్లా మాత్రమే పంపిణీ చేస్తోంది.

అయితే తెలుగు వెర్షన్ నిర్మాతలు నైజాంలో 11 కోట్ల దగ్గర అమ్మకాల బేరం ప్రారంభించారు. కబాలి మొత్తం రైట్స్ తీసుకోవాలని ప్రారంభంలో ట్రయ్ చేసిన అభిషేక్ పిక్సర్స్ దగ్గరకే నైజాం బేరం వేళ్లింది. కానీ వాళ్లు 8 కోట్లకు మించి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఆఖరికి 8.5 కోట్ల గ్యారంటీ ఫిగర్ దగ్గర సినిమాను అభిషేక్ దగ్గర వుంచడానికి నిర్ణయించినట్లు టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. కాదు సేల్ పక్కా అని కూడా వినిపిస్తోంది.   

ఇక్కడ అభిషేక్ పిక్చర్స్ ను ఎంచుకోవడానికి వేరే కారణం కూడా వుందని టాక్ వినిపిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ కు తెలంగాణ అధికార పార్టీ ప్రతినిధులతో మంచి సంబంధాలు వున్నాయని, వాళ్లయితే, సినిమాకు ఏమయినా అడ్డంకులు వచ్చినా, ఆగకుండా అడ్డం పడతారనే ఉద్దేశంతో అభిషేక్ చెంతకు సినిమా చేరిందన్నది టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల గుసగుసల సారాంశం. మొత్తం మీద కబాలి సమస్య అలా సర్దుబాటు అయి మరో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్దమైపోయింది.

ఏమయితేనేం కబాలి తెరముందు వ్యవహారాలు ప్రేక్షకులకు ఆసక్తిగా మారాయి.  తెరవెనుక సంగతులు ఇండస్ట్రీ జనాలకు ఆసక్తిగా మారాయి.