రివ్యూ: రోజులు మారాయి
రేటింగ్: 1.5/5
బ్యానర్: గుడ్ సినిమా గ్రూప్, మారుతి టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: తేజస్వి మదివాడ, కృతికా జయకుమార్, పార్వతీశం, చేతన్ మద్దినేని, వాసు ఇంటూరి, రాజా రవీంద్ర, అలీ, జబర్దస్త్ అప్పారావు, పోసాని కృష్ణమురళి తదితరులు
మాటలు: రవి నంబూరి
సంగీతం: జెబి
కూర్పు: ఉద్ధవ్
ఛాయాగ్రహణం: పి. బాల్‌రెడ్డి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: జి. శ్రీనివాస్‌రావు
కథ, కథనం: మారుతి
దర్శకత్వం: మురళీకృష్ణ ముడిదాని
విడుదల తేదీ: జులై 1, 2016
ఇటీవలి కాలంలో హిట్టయిన చిన్న సినిమాల్లో ఎక్కువ శాతం హారర్ కామెడీలో లేదా, బూతు అంశాలున్న సోకాల్డ్ యూత్ సినిమాలో. ఆ ట్రెండులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన (బహుశా ఆ ట్రెండుకి ఇంకోసారి పునాది వేసిన అనాలేమో) మారుతి 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్'లాంటి యూత్‌ఫుల్ బూతు కామెడీలు, 'ప్రేమకథాచిత్రమ్'లాంటి హారర్ కామెడీతో తన ఉనికిని చాటుకున్నాడు. భలే భలే మగాడివోయ్‌తో మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్ అయిపోయిన మారుతి ప్రస్తుతం వెంకటేష్‌తో 'బాబు బంగారం' అనే సినిమా తీస్తున్నాడు. మధ్యలో కాస్త ఖాళీ దొరికిందేమో 'రోజులు మారాయి' చిత్రానికి కథ, కథనం రాసిచ్చాడు. ఈ సినిమాని తన 'బాబు బంగారం' హీరో వెంకటేష్‌కి చూపిస్తే 'నువ్వు నాకు నచ్చావ్'లో చెప్పిన డైలాగ్‌నే కాస్త మార్చి మారుతితో చెప్పే అవకాశముంది… 'బాబూ, ఖాళీగా ఉంటే రామకోటి రాసుకో, ఇలాంటి కథలు రాయకు' అని!
మారుతికి సింపుల్ కథని కూడా కమర్షియల్‌గా చెప్పే తెలివితేటలున్నాయి. అతను మొదట్లో తీసిన సినిమాల్ని బూతు చిత్రాలంటూ తీసి పారేయవచ్చు కానీ, వాటిని వర్కవుట్ చేయడం అందరి వల్లా అవలేదు మరి. అయితే అప్పట్లో సక్సెస్ అయి తీరాలనే కసితో మనసుపెట్టి తీసుకున్న సినిమాలవి. ఇప్పుడు తన పెన్ను విదిలిస్తే లక్షలొచ్చి పడిపోతున్నాయంటే ఏదో మొక్కుబడిగా రాసుకున్నట్టుందిది. మారుతి అనుకున్న కథలో యూత్‌ని ఆకట్టుకోవడానికి కావాల్సిన ముడిసరుకు అయితే ఉంది. కాకపోతే దానిని ఒక సినిమాగా మలిచేంత సమయం దొరికినట్టు లేదు. అందుకని సేఫ్‌గా 'ఈ రోజుల్లో', 'ప్రేమకథాచిత్రమ్' రెండిటినీ మిక్సీలో పడేస్తే వచ్చే మిశ్రమాన్నే దీనికి కథనంగా రాసిచ్చేసాడు. దీంతో ఇంటర్వెల్ వరకు ఒక సినిమా, అక్కడ్నుంచి మరో సినిమా చూసినట్టు అనిపిస్తుంది.
విచిత్రం ఏమిటంటే ఇందులోని పాత్రలు కూడా ఫస్ట్ హాఫ్‌లో ఒకలా, సెకండ్ హాఫ్ నుంచి మరొకలా ప్రవర్తిస్తాయి. ఉదాహరణకి వాసు ఇంటూరి ఫస్ట్ హాఫ్‌లో బిర్ర బిగుసుకుపోయి, ఒకే డైలాగ్‌ని ఎక్స్‌ప్రెషనే లేకుండా చెబుతుంటాడు. ద్వితీయార్థం మొదలవడమే అతను డాన్సులు వేసేస్తూ, సడన్‌గా కామెడీకి షిఫ్ట్ అయిపోయి, దృశ్యం స్పూఫ్ (పరమ అసహ్యంగా వుంది) చేసి చూపిస్తాడు. ఇక హీరోయిన్లలో కృతిక అయితే సీన్‌కో రకంగా బిహేవ్ చేస్తుంది. ఒక సీన్లో ఎదుటి వ్యక్తి నీళ్లలో పడితే చచ్చిపోతాడని తెలిసినా అతను నీళ్లల్లోకి దూకే వరకు టెన్షన్‌గా ఎదురు చూస్తుంది. నెక్స్‌ట్ సీన్లో తన కళ్లెదుట ఒక మనిషి చచ్చిపోతుంటే చూడలేనంటూ ఒకడిని కాపాడుతుంది. తేజస్వి అయితే తన స్వార్ధం కోసం ఇద్దరిని అకారణంగా చంపడానికి సిద్ధ పడిపోతుంది కానీ మళ్లీ క్యారెక్టర్ గురించి లెక్చర్లు దంచికొడుతుంది. ఇక పార్వతీశం అయితే గాఢంగా ప్రేమిస్తున్నానంటూ, అపర త్యాగిలా కబుర్లు చెబుతుంటాడు, మళ్లీ తను కోరుకునేది నాలుగ్గోడల మధ్య అయిదు నిమిషాల సుఖం అంటుంటాడు. ఒక్క క్యారెక్టర్‌కి కూడా రక్త మాంసాలు లేవు. అన్నీ ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తుంటాయి. ప్లాట్ పరంగా వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్ కూడా తెచ్చి పెట్టుకున్నట్టే అనిపిస్తాయి తప్ప ఫ్లోలో మిక్స్ అవ్వవు.
యూత్‌ఫుల్ కామెడీగా మొదలైన చిత్రం తర్వాత థ్రిల్లర్‌గా టర్న్ తీసుకుని, అటుపై హారర్‌లోకి అడుగు పెట్టి ఫైనల్‌గా ఎటూ కాని చిత్ర విచిత్రాకృతిని సంతరించుకుంటుంది. కేవలం ట్రెండ్‌ని క్యాష్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుందే తప్ప ఎక్కడా ఒక మంచి సినిమా ఇద్దామనే తపన కనిపించదు. భలే భలే మగాడివోయ్ తీస్తూ, బాబు బంగారంకి కథ సిద్ధం చేస్తూ బహుశా మారుతి గుర్తించి ఉండడేమో కానీ రోజులు మారిపోయాయి. ఇంకా ఇలాంటి కంగాళీ కథలు కలెక్షన్లు కొల్లగొట్టే రోజులు కావివి. క్లీన్ సినిమాలు తీస్తాడనే పేరున్న దిల్ రాజు ఇలాంటి సినిమాని పూర్తిగా చూసి కూడా ఎందుకోసం దీంతో అసోసియేట్ అయ్యాడనేది ఆయనకే తెలియాలి.
కథ, కథనం లాంటి పెద్ద మాటల జోలికి పోకుండా కేవలం సన్నివేశాలు, సంభాషణల పరంగా చూస్తే ప్రథమార్థంలో కొన్ని జోకులు పేలాయి. ముఖ్యంగా పార్వతీశం డైలాగ్స్‌తో యూత్ రిలేట్ చేసుకుంటారు. కథేమీ లేకుండా ఇలాంటి వాటితో కాలక్షేపం చేసేసినా టార్గెట్ ఆడియన్స్ నుంచి పాస్ మార్కులు పడిపోయి ఉండేవేమో కానీ తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నంలో లేనిపోని అంశాలన్నిటినీ ఒక సినిమాలోనే ఇరికించి కంగాళీ చేసి పారేసారు. ద్వితీయార్థంలో 'చివరి వరకు ఎలా కూర్చుంటారో చూద్దాం' అంటూ ప్రేక్షకులకి సవాల్ విసిరినట్టు ముందుకెళ్లే కొద్దీ మరింతగా ఇబ్బంది పెడుతుంది.
పార్వతీశం ఒక్కడూ తన స్లాంగ్‌తో ఈ సినిమాని సేవ్ చేసేందుకు కృషి చేసాడు కానీ సెకండాఫ్‌లో అతని చేతులు కూడా నరికి పారేసారు. తెర వెనుక నుంచి కూడా దీనిని ఆదుకునే అద్భుత శక్తులున్న అవుట్‌పుట్ ఎవరినుంచీ రాలేదు. దశ, దిశ లేకుండా మారుతి రాసిచ్చేసిన స్క్రిప్టుతో దర్శకుడు ఏమీ చేయలేకపోయాడు. మాటలన్నీ రవి నంబూరి రాసాడో, లేక మారుతి స్క్రిప్టుతో పాటు కొన్ని డైలాగులు కూడా రాసిచ్చేసాడో కానీ ద్వందార్థాల్లో మారుతి ముద్ర స్పష్టంగా వినిపించింది. సక్సెస్ కావడం కోసం మొదట్లో ఎలాంటి సినిమాలు తీసినప్పటికీ ఇప్పుడు భలే భలే సినిమాలు తీస్తోన్న మారుతి మరొక్కసారి తన ఎక్స్ వర్షన్‌ని రీ విజిట్ చేసుకోవడానికి ఈ కథ రాసినట్టుంది. అయితే పూర్తిగా ఒక జోనర్‌కి కట్టుబడకుండా అన్నిట్లో వేలు పెట్టడంతో ప్రయోగం బెడిసికొట్టింది.
బోటమ్ లైన్: రోజులు మారాయి… మారుతి మారలేదు!
– గణేష్ రావూరి