తన తొలి సినిమా ఫలితంతో ఒకింత నిరాశ పడే పరిస్థితిలో ఉంది నిహారిక కొణిదెల. ఈ సినిమాకు తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. ఇది సినిమా కాదు.. సీరియల్ అనే విమర్శ గట్టిగా వినిపించింది. క్రిటిక్స్ ఈ విధంగా తేల్చేయడంతో ఒక మనసు జోలికి వెళ్లే ప్రేక్షకులు తగ్గిపోయారు. వీకెండ్ లోనే ఈ సినిమా కలెక్షన్లు చాలా డల్ అయిపోయాయి.
మరి ఈ విధమైన ఫలితాన్ని పొందినా.. నిహారిక కొణిదెల నిరుత్సాహ పడాల్సిన పరిస్థితేం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. సినీ కుటుంబాల నుంచి వచ్చిన హీరోయిన్ల తొలి సినిమాలు ఇది వరకూ తన్నేసిన దాఖలాలున్నాయి. తొలి సినిమాలతో వారికి నిరాశే మిగిలింది. అయితే అదంతా తొలి సినిమాకే! ఆ తర్వాత వారి ప్రస్థానం ఊపందుకుంది.
దీనికి ఉదాహరణ సోనమ్ కపూర్, శ్రుతి హాసన్లే! సోనమ్ కపూర్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సినిమా 'సావరియా' సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలే ఉండేవి. అనిల్ కపూర్ కూతురు హీరోయిన్ గా, రణ్ బీర్ కపూర్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమా అత్యంత భారీ అంచనాలతో వచ్చి దారుణంగా నిరాశ పరిచింది!
అయితే సోనమ్ కెరీర్ పై ఆ సినిమా ప్రభావం కొద్ది కాలమే. ఇప్పుడు సోనమ్ దూసుకపోతోంది. నీర్జా వంటి సినిమాతో మంచి నటిగా కూడా మార్కులు కొట్టేసింది అనిల్ కపూర్ తనయ. ఇక తన తొలి సినిమానే కాదు.. తొలి తొలిగా చేసిన సినిమాలన్నీ ప్లాఫే కావడంతో శృతి హాసన్ చాలా నిరాశ పడింది. ఐరన్ లెగ్ అనే పేరు కూడా తెచ్చుకుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో శృతి స్థాయి ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు.
సో.. తొలి సినిమా ఫెయిల్యూర్ సినీ వారసురాళ్లకు శుభశకునమే! ప్రయత్నిస్తే నిహారిక హీరోయిన్ గా సత్తా చాటడం కష్టమేమీ కాదు.