రూ. 20వేలు జరిమానా నిజమేనా..?

సందు దొరికితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి సోషల్ మీడియాలో ఓ బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు లేనిపోని ఊహాగానాలు కూడా సృష్టించి, వ్యాపింపజేయడం వీళ్ల పని. ఇందులో భాగంగానే…

సందు దొరికితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి సోషల్ మీడియాలో ఓ బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు లేనిపోని ఊహాగానాలు కూడా సృష్టించి, వ్యాపింపజేయడం వీళ్ల పని. ఇందులో భాగంగానే 2 రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే 20వేల రూపాయల ఫైన్ విధిస్తారనేది ఆ వార్త సారాంశం. ఆగస్ట్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందంటూ 48 గంటలుగా తెగ ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో చెక్ చేసుకోకుండా.. చాలామంది అప్పుడే విమర్శలు గుప్పించారు.

2 రోజులుగా చక్కర్లు కొడుతున్న ఈ అంశంపై రవాణాశాఖ కమిషనర్ స్పందించారు. ఇదంతా కట్టుకథ అని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే రాష్ట్రంలో జరిమానాలు విధిస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు.

ఇక ఇయర్ ఫోన్స్/హెడ్ ఫోన్స్ విషయానికొస్తే.. చెవులకు ఇవి పెట్టుకొని వాహనం నడుపుతూ పట్టుబడితే తొలిసారి 15 వందల నుంచి 2వేల రూపాయల వరకు ఫైన్ విధిస్తామని, అది కూడా మోటారువాహనాల చట్టం ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. పలుమార్లు ఇదే విధంగా దొరికితే, అప్పుడు ఫైన్ 10వేల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు.

ఈ నిబంధనలు కూడా చాలా కాలంగా అమల్లో ఉన్నాయని, కొత్తగా విధించినవి కావని కమిషనర్ స్పష్టం చేశారు. కమిషనర్ ప్రకటనతో 2 రోజులుగా నడుస్తున్న ఈ ఊహాగానానికి చెక్ పడింది.