''ఈ కథలో ప్రాణాలతో బయటపడిన వారు కోరిన ప్రకారం.. పాత్రల పేర్లను మార్చాం. ఇందులో ప్రాణాలను పోగొట్టుకున్న వారిపై ఉన్న గౌరవంతో మిగతాదంతా జరిగినది జరిగినట్టుగా చెప్పాం..'' అమెరికా సినీ చరిత్రలోనే గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరున్న, హాలీవుడ్ చరిత్రలో వచ్చిన వంద గొప్ప సినిమాల్లో ఒకటిగా అనేక జాబితాల్లో నిలిచిన 'ఫార్గో' సినిమా టైటిల్ కార్డ్స్ లో మొదట పడే లైన్స్ ఇవి.
తాము ఈ సినిమాలో చెప్పబోతున్నది ఏమిటో.. టైటిల్ కార్డ్స్ లోనే చెబుతూ.. ప్రేక్షకుడిలో అమితాసక్తిని క్రియేట్ చేస్తూ ఆ పై సూటిగా కథను అన్ ఫోల్డ్ చేస్తారు కోయన్ బ్రదర్స్.
వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుగానే ఉన్నా, వాస్తవానికి వంద మైళ్ల ఆవల సాగుతున్నట్టుగా సాగే కథ ఫార్గో. కోయన్ బ్రదర్స్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో హాలీవుడ్ మూవీ మేకర్స్ ఎవ్వరూ టచ్ చేయని ఒక వైవిధ్యత ఉంటుంది. వీళ్ల సినిమాల్లో చాలా వరకూ విలన్స్ వ్యక్తులు కాదు, విధి! ఉందో లేదో తెలియని విధి సినిమా కథను నడుపుతూ ఉంటుంది.
నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్, బర్న్ ఆఫ్టర్ రీడింగ్, ఫార్గో.. ఈ సినిమాలన్నింటిలోనూ ఏదో ఒక స్ట్రేంజ్ డ్రామాను నడిపి కోయన్ బ్రదర్స్ ప్రపంచ సినీ చరిత్రలోనూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సినిమాలన్నీ ప్రేక్షకుడికి ఊహకు కొన్ని వందల మైళ్ల దూరంలో ఉంటాయి. అలాగని బీభత్సమైన సినిమాటిక్ మలుపులు కాదు.
వాస్తవంలో అనుకోకుండా జరిగే కొన్ని ఘటనల్లా ఉంటాయి ఈ దర్శకుల సినిమాల్లోని మలుపులు! అవే వీరి సినిమాలకు గొప్ప కీర్తిని తెచ్చి పెట్టాయి. ఇంత స్ట్రేంజ్ డ్రామాలను తెరకెక్కించడం అందరు దర్శకులకూ సాధ్యం కాకపోవడం కూడా వీరి సినిమాలకు ప్రత్యేక అభిమానగణాన్ని ఏర్పరిచింది.
ఫార్గో గురించి చెప్పుకోవడానికి ఓ రేంజ్ కథేమి ఉండదు. ఒక కార్ సేల్స్ మన్ కు తన వ్యాపారంలో వరసగా నష్టాలు వస్తుంటాయి. చాలా అప్పుల పాలవుతాడు. అతడికి పిల్లనిచ్చిన మామ పెద్ద ఆస్తిపరుడు. భార్యాపిల్లలను తన అప్పుల కష్టాల నుంచి బయటపడేయాలని ఆ కార్ల వ్యాపారి భావిస్తాడు. దాని కోసమని మామను ఊరికే డబ్బులు అడిగితే ఇవ్వడు. అప్పుడు ఒక ప్లానేస్తాడు. తన భార్య అంటే ఆమె తండ్రికి చాలా ప్రేమ. ఆమె చేత డబ్బులు అడిగిస్తే ఏమంటుందో అనే మొహమాటానికి వెళ్లి.. ఒక కిడ్నాప్ డ్రామాకు పథకం రచిస్తాడు.
ఇద్దరు ప్రొఫెషనల్ ఆకతాయిలను ఒక బార్లో మాట్లాడుకుంటాడు. తన భార్యను కిడ్నాప్ చేయమని వారికి చెబుతాడు. తనకు ఫోన్ చేసి ఎంత పరిహారం అడగాలో కూడా తనే చెబుతాడు. అందులో వారి వాటా ఎంతో వివరిస్తాడు. తనకు పిల్లనిచ్చిన మామ ఆ డబ్బులు ఇస్తాడని.. పరిమిత మైన వారి వాటా తీసుకుని తన భార్యను వదిలేయాలని, మిగతా డబ్బు తనదని అతడు మొత్తం ప్లాన్ ను వారికి చెబుతాడు.
అతడి ప్రతిపాదనకు ఆ కిడ్నాపర్లు కూడా ఓకే చెప్పి.. అతడి భార్యను కిడ్నాప్ చేస్తారు. ఆమెను ఇంటి నుంచి కిడ్నాప్ చేసుకుని వారు వెళ్తున్నప్పుడు కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. దారిలో కిడ్నాపర్ల కారును ఒక పోలీసాఫీసర్ ఆపుతాడు. నంబర్ ప్లేట్ల గురించి అతడు ఏదో అడగకపోతే ఆల్రెడీ ఒక కిడ్నాప్ చేసుకొచ్చిన వీళ్లు అది బయటపడుతుందనే భయంతో పోలీసాఫీసర్ ను కాల్చి చంపుతారు.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక కార్లోని వాళ్లు వీళ్లను గమనిస్తారు. దీంతో.. ఈ కిడ్నాపర్లకు మరింత దడ మొదలవుతుంది. కిడ్నాప్ బయటపడకూడదని పోలీసును చంపిన వీళ్లు, దాన్ని చూశారని కార్లో వెళ్తున్న ఒక తల్లీకొడుకును వెంబడించి వెంబడించి మరీ చంపుతారు. తాము కిడ్నాప్ చేసిన మహిళను తీసుకెళ్లి తమ దగ్గర బంధీని చేసుకుంటారు. కిడ్నాప్ పై తమకు అందిన ఫిర్యాదుపై విచారణ మొదలుపెట్టిన ఇన్వెస్టిగేటర్లకు.. దారిలో జరిగిన పోలీసాఫీసర్ హత్య, ఆ సమీపంలోనే ఒక తల్లీకొడుకుల హత్యలు.. వీటన్నింటికీ ఏదో సంబంధం ఉందని పిస్తుంది.
మరోవైపు తమకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తి మామకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు కిడ్నాపర్లు. అతడు అంత తేలికగా స్పందించడు. అల్లుడేమో మామపై ఒత్తిడి తెస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ కు దిగిన లేడీ ఆఫీసర్ కు కిడ్నాప్ అయిన మహిళ భర్త పై సహజంగానే అనుమానం వస్తుంది. ఈ కేసు ఏమీ తేలకనే.. కిడ్నాపర్ల ఆచూకి ఆ మహిళా ఆఫీసర్ కు తెలుస్తుంది. మొత్తం కథ బయటకు వస్తుంది. కిడ్నాప్ అయిన మహిళ కూడా అనూహ్యంగా కిడ్నాపర్ల చేతిలో మరణించి ఉంటుంది అప్పటికే.
కిడ్నాప్ చేయించిన భర్తకు తన భార్యంటే ప్రేమే. ఆమెకు ఆర్థిక కష్టాలు లేకుండా చేయాలనే అతడు ఆమెనే కిడ్నాప్ చేయించి ఉంటాడు! తన మామ తనను నమ్మి డబ్బులు ఇవ్వడు అనే లెక్కలతో ఇంత నాటకానికి రెడీ అవుతాడు. అయితే ఒక్కసారి కిడ్నాపింగ్ డ్రామాకు రెడీ అయ్యాకా.. పరిస్థితి మొత్తం అతడి చేతుల నుంచి జారి పోతుంది. ఇదంతా కూలంకషంగా విశ్లేషించుకునే మహిళా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్వగతంతో సినిమా ముగుస్తుంది. ఇలాంటి సంఘటనలను దగ్గర నుంచి చూసి తన ఉద్యోగం మీదే ఆమె ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఇవన్నీ చూసి తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటుంది. అయితే బయట జరిగే ఈ ఘటనల గురించి, వాళ్లంతా ఎందుకు ఇలా చేశారనే ఆలోచనలను వదిలించుకుని తొలి సారి తను తల్లి కావాలని ఆ లేడీ ఆఫీసర్ నిర్ణయించుకోవడంతో సినిమా ముగుస్తుంది.
మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యల విషయంలో భార్య కిడ్నాపింగ్ కు అతడు ప్లాన్ చేయడంతో.. అతడితో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు బలవ్వడం, కిడ్నాపర్లు పోలీసాఫీసర్ ను చంపడాన్ని చూసిన తల్లీకొడుకులు కూడా వారి చేతిలోనే హతమవ్వడం.. ఇదంతా ఎందుకు జరిగినట్టు? అనే పోలీసాఫీసర్ స్వగతానికి సమాధానం దొరకదు.
కోయన్ బ్రదర్స్ సినిమాల శుభం కార్డు పోలీసాఫీసర్ల మీదే పడుతూ ఉంటుంది. నో కంట్రీ ఫర్ ఓల్డ్మెన్ ఇలాగే ముగుస్తుంది. ఒక డ్రగ్స్ కేసును విచారించి విసుగెత్తిపోయి రిటైర్మెంట్ కు దగ్గర పడ్డ పోలీసాఫీసర్ అంతర్మథనంతో ఆ సినిమా ముగుస్తుంది. అదే సినిమాలో డ్రగ్స్ తో కూడిన తన సూట్ కేసును మిస్ అయ్యి, దాన్ని తిరిగి సంపాదించుకోవడంలో అనేక మందిని దారుణంగా హతమార్చే విలన్ క్లైమాక్స్ లో యాక్సిడెంట్ కు గురయ్యి తీవ్రంగా గాయపడతాడు.
అతడి గన్నుకు సినిమా ఆసాంతం ఎదురే ఉండదు. తను అనుకున్నట్టుగా చేసి తన డ్రగ్స్ సూట్ కేసు సంపాదించుకుని వెళ్లిపోతూ ఉండగా… వేగంగా వచ్చి ఒక వాహనం ఢీ కొట్టడంతో అతడి చేయి విరిగిపోతుంది. అంత వరకూ మనుషులను ఎడాపెడా చంపిన అతడు చివరకు తన పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక అక్కడ నుంచి పరార్ అవుతాడు. ఇలాంటి స్ట్రేంజ్ క్లైమాక్స్ లు ఇవ్వడంలో ఈ దర్శక ద్వయం ప్రపంచ సినీ ప్రస్థానంలోనే ప్రత్యేకమైన వాళ్లు.
చాలా సింపుల్ కథతో, అనార్థోడాక్స్ వయెలెన్స్ తో సాగే 'ఫార్గో' ఒక హిడెన్ సోషల్ క్రిటిసిజమ్ ముగుస్తుంది. పాత్రలేవీ కథకు అనుగుణంగా సాగవు, పాత్రల తీరును బట్టి కథ సాగుతూ ఉంటుంది. ఇది డార్క్, వయెలెంట్, వెల్ కన్ స్ట్రక్చర్డ్ క్రైమ్ డ్రామా. ఈ తరహా సినిమాలను అంత వరకూ ఎవ్వరూ తెరకెక్కించని రీతిలో ఈ సినిమాను రూపొందించడంతో క్లాసిక్ గా శాశ్వత గుర్తింపును పొందింది.
– జీవన్ రెడ్డి. బి