ఎమ్బీయస్‌: సిపిఎం డైలమా

ఏప్రిల్‌ నెలలో రాబోతున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుతో జత కట్టాలో లేదో సిపిఎం తేల్చుకోలేకపోతోంది. బెంగాల్‌లో కాంగ్రెసు, సిపిఎంలకు ఒకరి పొడ మరొకరికి గిట్టేది కాదు. ఒకర్ని ఓడించి మరొకరు అధికారంలోకి…

ఏప్రిల్‌ నెలలో రాబోతున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుతో జత కట్టాలో లేదో సిపిఎం తేల్చుకోలేకపోతోంది. బెంగాల్‌లో కాంగ్రెసు, సిపిఎంలకు ఒకరి పొడ మరొకరికి గిట్టేది కాదు. ఒకర్ని ఓడించి మరొకరు అధికారంలోకి వచ్చారు. అలాటివాళ్లకు యీనాడు చేతులు కలపాలన్న ఆలోచన తెప్పించినది మమతా బెనర్జీ. ఆమె పరిపాలన బాగా లేకపోయినా, ఆమె పార్టీ పూర్తిగా బలహీనపడలేదు. కొత్తగా బిజెపి కొంత బలం పుంజుకుంది. బిజెపితో చేతులు కలిపితే ఓట్లు గణనీయంగానే పడతాయి. ప్రతిపక్షాలైన కాంగ్రెసు, సిపిఎం విడివిడిగా పోటీ చేస్తే త్రిముఖ పోరాటంలో తృణమూల్‌, బిజెపిలదే గెలుపు. కానీ అవి కలిసి పోటీ చేస్తే, ఒకరి ఓట్లు మరొకరికి బదిలీ చేసుకోగలిగితే తృణమూల్‌ను ఓడించడం సాధ్యమే. ఈ రకమైన ఆలోచన యీ మధ్యే జరిగిన సిలిగుడి మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల తర్వాత వచ్చింది. గత ఐదేళ్లగా తృణమూల్‌ లోకసభ, మునిసిపల్‌, పంచాయితీ యిలా అన్ని ఎన్నికలలో  గెలుస్తూ వచ్చింది. సిపిఎం, కాంగ్రెసు రెండూ దెబ్బ తింటూనే వచ్చాయి. వాటి కార్యకర్తలు పార్టీ వదిలి తృణమూల్‌లో చేరిపోతున్నారు, లేదా నిరాసక్తంగా వుంటున్నారు. దశాబ్దాలుగా వారికి ఓటేస్తున్నవారు కూడా తమ ఓటు వలన కలిగే ప్రయోజనమేముంది అనే మీమాంసలో పడ్డారు. ఇలాటి పరిస్థితుల్లో సిలిగుడిలో తృణమూల్‌, బిజెపి కాని పక్షాలన్నిటిని కూడగట్టుకుని సిపిఎం పోటీ చేసి అనేక సీట్లు గెలిచి మేయరు పదవి కూడా దక్కించుకుంది. ఇదే ఫార్ములాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేద్దామనే ఆలోచన బెంగాల్‌లోని కాంగ్రెసు, సిపిఎం నాయకుల్లో రగిలింది. 

ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ జనరల్‌ సెక్రటరీ ఓం ప్రకాశ్‌ మిశ్రా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన ఉత్తరం యీ మధ్య వెలుగులోకి వచ్చింది. దానిలో అతను – 'కాంగ్రెసు, వామపక్షాల కూటమిగా ఏర్పడితే మొత్తం 294 సీట్లలో 161 గెలుచుకుంటాయి, తృణమూల్‌కు 126 వస్తాయి, గూర్ఖా జనముక్తి మోర్చాకు 3, బిజెపికి 4 వస్తాయి' అని రాశాడు. కాంగ్రెసు అధిష్టానం ఏం ఆలోచిస్తోందో రాష్ట్రనాయకత్వానికి బోధపడటం లేదు. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెసు తృణమూల్‌ను బిజెపి కౌగిట్లోకి నెట్టకూడదనే ఆదుర్దాతో వుంది. డిసెంబరులో సోనియా పుట్టినరోజునాడు మమత ఢిల్లీ వెళ్లి మాట్లాడి వచ్చింది. 'బిజెపితో కలవకుండా వుండాలంటే నాతో పొత్తు పెట్టుకోమని మీ స్టేట్‌ యూనిట్‌కు చెప్పండి' అని మమత చెప్పి వుండవచ్చు. మమతను మచ్చిక చేసుకోవడానికి బిజెపి కూడా ప్రయత్నాలు చేస్తోంది. తృణమూల్‌ పెద్ద తలకాయలన్నీ యిరుక్కున్న శారదా చిట్‌ స్కాముపై సిబిఐ విచారణ వేగాన్ని మందగింప చేసింది. ఇటీవలే కలకత్తాలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశానికి అరుణ్‌ జైట్లీ వెళ్లి వచ్చారు. సుభాష్‌ బోసు ఫైళ్ల విషయంలో కూడా మమత, మోదీ కాంగ్రెసును అప్రదిష్టపాలు చేసే ప్రయత్నాలు చేయడంలో ఒకటయ్యారు. మరీ వదిలేస్తే మమత పూర్తిగా ఎన్‌డిఏ కూటమిలో చేరిపోతుందేమోనన్న భయంతో రాహుల్‌ తృణమూల్‌తో పొత్తు పెట్టుకుందామని ఆలోచిస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. ఆ మాట నిజమా అని రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు అధీర్‌ చౌధురీని అడిగితే 'నేను అధ్యక్షుడిగా వుండగా తృణమూల్‌తో పొత్తు అసంభవం. సిపిఎంతో చేతులు కలపాలని బెంగాల్‌ ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని ఢిల్లీకి వెళ్లి రాహుల్‌తో చెప్తాం' అన్నాడు. ఫిబ్రవరి 1 న బెంగాల్‌ ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ సభ్యులు రాహుల్‌ను కలిశారు కూడా. ఎలాటి నిర్ణయం తీసుకున్నారో యింకా వార్తలు రాలేదు. స్థానిక కాంగ్రెసు నాయకులు ''గతంలో సిపిఎంను గద్దె దించడానికి తృణమూల్‌తో చేతులు కలపమని మా పార్టీ ఓటర్లు అడిగేవారు. ఇప్పుడు తృణమూల్‌ను తొలగించడానికి సిపిఎంతో చేతులు కలపమంటున్నారు. ఇదివరకు సిపిఎం మా చేతులు నరికితే, యిప్పుడు తృణమూల్‌ ఏకంగా మా తలే నరుకుతోంది.'' అంటున్నారు. 

నిజానికి మమతపై ప్రజలు చాలా అసంతృప్తితో వున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే పారిశ్రామికీకరణ జరిగి తీరాలి. పెట్టుబడి పెట్టేవారు అడిగితే భూములివ్వాల్సిందే అని సిపిఎం వాదించి సింగూరులో టాటాలకు భూమినిస్తే తృణమూల్‌ పెద్ద ఆందోళన చేపట్టి అక్కడి ప్రజలను రెచ్చగొట్టింది. 1900 మంది రైతులు యిచ్చిన నష్టపరిహారం తీసుకుని 600 ఎకరాలు అప్పగించగా, తృణమూల్‌ బోధనలు విని 1200 మంది రైతులు తక్కిన 400 ఎకరాలు యివ్వలేదు, పరిహారమూ తీసుకోలేదు. ఈ ఆందోళన చూసి టాటా తన నానో ఫ్యాక్టరీని గుజరాత్‌ తీసుకుపోయింది.  2011లో మమత అధికారంలోకి వచ్చి సింగూరులో రైతుల నుంచి తీసుకున్న భూమిని వెనక్కి యిచ్చేస్తామంటూ చట్టం చేసింది. టాటా మోటార్స్‌ హైకోర్టుకు వెళ్లారు. అది చట్టవిరుద్ధం అని కోర్టు అంది. మమత సుప్రీం కోర్టుకి వెళ్లింది. అప్పణ్నుంచి అక్కడే పెండింగులో వుంది. ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నవారికి ఉద్యోగాలు రాలేదు కానీ నష్టపరిహారంగా వచ్చిన డబ్బు అనుభవిస్తున్నారు. నష్టపరిహారం వద్దన్నవారు ఉభయత్రా నష్టపోయారు. భూమి పనికిమాలినదిగా పడి వుంది. ధర లేదు. వారికి మమత ప్రభుత్వం నెలకు రూ. 2 వేల పెన్షను, 16 కిలోల బియ్యం యిస్తోంది. అవి తీసుకుంటూ, మమతను తిట్టుకుంటూ, టాటాలు తిరిగి వస్తే పూలదండేసి భూములు అప్పగిస్తామని చెపుతూ ఆ రైతులు కాలక్షేపం చేస్తున్నారు. మమత తరఫున సిపిఎంతో పోరాడిన విరోధి కమిటీ వీరుల్లో యిద్దరికి మంత్రి పదవులు దక్కాయి, కొందరికి స్థానిక సంస్థల్లో పదవులు దక్కాయి. అనేకమందికి ఉభయభ్రష్టత్వం, ఉప్పరిసన్యాసం సిద్ధించింది. 

దీనికి తోడు తృణమూల్‌ అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు సిండికేట్లుగా ఏర్పడ్డారు. ఎవరైనా పరిశ్రమ పెడతాననగానే వాళ్లు వచ్చి తమకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు యివ్వకపోతే కుదరదని పేచీ పెడుతున్నారు. ప్రభుత్వం చూస్తే భూములివ్వదు, ప్రజలను రెచ్చగొడుతుంది. సొంతంగా భూమి కొని మొదలుపెడదామంటే స్థానికులు యిలా అడ్డుపడతారు.  నాయకులు, పోలీసులు వారికి వత్తాసు యిస్తున్నారు. ఇక పరిశ్రమలు ఎలా వస్తాయి? అందుకే రాలేదు. దాంతో ఆర్థికాభివృద్ధి ఆగింది. నిరుద్యోగం ప్రబలింది. పదవీకాలం అంతమయ్యే సమయానికి మమతకు యిదంతా తెలిసి వచ్చింది. ''సజ్జన్‌ జిందాల్‌ రూ.10,500 కోట్ల పెట్టుబడితో స్టీలు ప్లాంట్‌, రూ.800 కోట్లతో సిమెంటు ప్లాంటు పెడదామని వస్తున్నారు. మీరు అడ్డుపడకండి. పెద్ద పరిశ్రమ వస్తే దాని చుట్టూ అనేక చిన్న యూనిట్లు వస్తాయి. జనావాసాలు ఏర్పడతాయి. మార్కెట్‌ వస్తుంది. హోటళ్లు, దుకాణాలు వస్తాయి. అనేకమందికి ఉద్యోగాలు వస్తాయి.'' అని ఒక పబ్లిక్‌ మీటింగులో హితబోధ చేసి ''సహాయం చేస్తారు కదూ, రాష్ట్రానికి చెడ్డ పేరు తేరు కదూ'' అని జనాల్ని అడిగింది. జనాల నుంచి ఏ సమాధానమూ రాకపోవడంతో ''ఏమిటీ, గొంతు లేవటం లేదు'' అని రెట్టించింది. ఇక 'తప్పకుండా' అంటూ అరవక తప్పలేదు జనాలకి. ఇప్పటికిప్పుడు పెద్దమనుష్యులు అయిపోమంటే వాళ్ల తరమా? గతంలో సిపిఎం యివే మాటలు చెప్పినపుడు యిదే దీదీ వారిని వెక్కిరించింది కదా, యిప్పుడు గొంతు మారిస్తే అర్థం చేసుకోవడానికి టైము పట్టదా? నిజానికి సల్బోనీలో 4 వేల ఎకరాల స్థలంలో జిందాల్‌ రూ.35 వేల కోట్ల స్టీలు ప్లాంటు కడదామనుకున్నాడు. 2007లో అతను సిపిఎం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రెండేళ్ల తర్వాత భూమి స్వాధీనం చేసుకున్నాడు. కానీ చైనా నుంచి చవక ఉత్పత్తులు వచ్చి పరిశ్రమను దెబ్బ తీయడంతో ప్లాంటు ప్రారంభం ఆలస్యమైంది. దాంతో భూమి వెనక్కి యిచ్చేయాలనే ఆందోళన ప్రారంభమైంది. ఇప్పుడు ప్లాంటు సైజును మూడో వంతుకు కుదించి, 294 ఎకరాల భూమి విలువను వెనక్కి యిచ్చేస్తున్నాడు. ఫ్యాక్టరీ ఎలాగైనా నెలకొల్పించాలని మమత పట్టుదలగా వుంది. అందుకే దాని ప్రారంభోత్సవానికి జిందాల్‌ కంటె ముందుగా వచ్చి కూర్చుంది. ఈ తెలివితేటలు ఐదేళ్ల క్రితమే వుంటే బెంగాల్‌ పరిస్థితి, పార్టీ పరిస్థితి యిలా వుండేది కాదు.

తమను మట్టి కరిపించిన మమతా బెనర్జీని ఓడించాలన్న కుతూహలం సిపిఎంకు ఎంత వున్నా, కాంగ్రెసుతో చేతులు కలపాలంటే చేతులు ముందుకు రావటం లేదింకా. తరతరాలుగా తమంటే పడని కాంగ్రెసు ఓటర్లు తమకు ఓట్లేస్తారా లేదాన్న సందేహం పీడిస్తోంది. ఈ విషయమై 16 మంది సభ్యులున్న పాలిట్‌ బ్యూరో చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల విభాగాలు వేర్వేరు దృక్పథాలతో వున్నాయి. బెంగాల్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య, బిమాన్‌ బోస్‌, సూర్యకాంతి మిశ్రా, మహమ్మద్‌ సలీమ్‌, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ వీరందరూ పార్టీ జనరల్‌ సెక్రటరీ సీతారాం యేచూరిపై ఒత్తిడి తెస్తున్నారు. అతనికి ఆ పదవి దక్కడానికి వీరందించిన సహాయమే కీలకం కాబట్టి అతను వారి మాట కాదనలేడు. అయితే పూర్వ జనరల్‌ సెక్రటరీ ప్రకాశ్‌ కారట్‌, అతని భార్య బృంద, అతని సన్నిహితుడు పినరాయ్‌ విజయన్‌ కాంగ్రెసుతో పొత్తుకు ససేమిరా అంటున్నారు. ఎందుకంటే వీరు కేరళకు చెందినవారు, కేరళలో లెఫ్ట్‌, కాంగ్రెసు వేర్వేరు కూటములకు నాయకత్వం వహిస్తున్నాయి. యుపికి చెందిన సుభాషిణీ ఆలీ, ఆంధ్రకు చెందిన రాఘవులు కూడా కారట్‌ వైపే వున్నారు. ''వీరి మాటలు వినే గతంలో చెడ్డాం. యుపిఏ1కు మద్దతిస్తూ ఎంతో పలుకుబడి అనుభవించాం. అమెరికాతో అణు ఒప్పందం విషయంపై  పంతానికి పోయి, 2008లో మద్దతు ఉపసంహరించి ఆ ప్రభుత్వాన్ని కూలదోయబోయాం. ఆ ప్రభుత్వం పడిపోలేదు సరి కదా, తర్వాతి ఏడాది యినుమడించిన బలంతో యుపిఏ2 కూడా అధికారంలోకి వచ్చింది. 2008లో 62 మంది ఎంపీలున్న మన లెఫ్ట్‌ ఫ్రంట్‌కు యీనాడు కేవలం 9 మంది వున్నారు. అప్పుడు మూడు రాష్ట్రాల్లో అధికారంలో వున్నాం. ఈనాడు ఒకే ఒక చిన్న రాష్ట్రం త్రిపురలో వున్నాం. మనకు కంచుకోటలాటి బెంగాల్‌లో 2014 పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి చోటిచ్చాం. మన ఓటింగు శాతం 29%కు పడిపోగా బిజెపికి 17.6% దక్కాయి. గుడ్డిగా కాంగ్రెసును ద్వేషిస్తూ పోతే బిజెపి, తృణమూల్‌ కలిసి మనల్ని బెంగాల్‌లో తుడిచి పెట్టేస్తాయి.'' అని బెంగాల్‌ నాయకులు వాదిస్తున్నారు. 

ఎవరి మాట వినాలో సిపిఎం అధినాయకత్వం యింకా తేల్చుకోలేదు. అటు కాంగ్రెసు అధిష్టానమూ తేల్చుకోలేదు. బెంగాల్‌ సిపిఎం రాష్ట్ర కమిటీ ఫిబ్రవరి 12, 13 తారీకుల్లో సమావేశమై ఏం చేయాలో చర్చించి ఒక తీర్మానం చేస్తుంది. 'అది వచ్చాకనే ఫిబ్రవరి 17, 18 తారీకుల్లో జరిగే సమావేశంలో సెంట్రల్‌ కమిటీ దానిపై ఆలోచిస్తుంది.' అంటున్నాడు ప్రకాశ్‌ కారట్‌. ఏం జరుగుతుందో వేచి చూడాలి.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]