తెలుగునాట ఇప్పుడు ట్రెండింగ్ వర్డ్ ఏమిటంటే ‘పొత్తులు’. ఎవరు మాట్లాడినా ఇవే మాటలు. ఎవరు ఏం చేసినా ఇదే కార్యక్రమం. ఆంధ్రలో లో వున్న వైకాపా తప్పించి మిగిలిన రాజకీయ పార్టీలు అన్నీ పొత్తులు బాబూ పొత్తులు అంటూనే వున్నాయి. తెలంగాణలో అధికారంలో వున్న తెరాస కు కొత్త పొత్తులు అక్కరలేదు. ఆల్రెడీ మజ్లిస్ తో పొత్తు వుండనే వుంది. తెలుగుదేశం పార్టీ పొత్తులో రామచంద్రా అంటూ అలమటిస్తోంది. జనసేన ఓ పక్క భాజపాతో సంసారం చేస్తూనే, వేరే పొత్తులు పెట్టుకుంటే తప్పేంటి? అది చారిత్రక అవసరం అన్నట్లు మాట్లాడుతోంది.
ఇంతకూ పొత్తులు దేనికి పెట్టుకుంటారు. ఎదుటివాటి బలం, బలగంతో మనం చాలలేము అన్న భావన మనసును తొలిచేస్తున్నపుడే కదా? పాండవులను ఎదిరించడం కష్టం అనే కదా ధుర్యోధనుడు కృష్ణుడి సాయం అడిగి సైన్యంతో పొత్తు పెట్టుకున్నది. కృష్ణుడు తన కంట్రోల్ లో వున్న, తన మాట వినే సైన్యం అంతటినీ ధుర్యోధనుడికి ఇచ్చి తను మాత్రం ధర్మరాజుతో వెళ్లాడు. గోపాల గోపాల సినిమాలో ఆధునిక కృష్ణుడిగా కనిపించాడు పవన్. బహుశా అందుకనేమో, తాను భాజపాతో వుంటూ తన సైన్యాన్ని తెలుగుదేశంతో పంపాలని చూస్తున్నారు.
కానీ ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. పొత్తులు అన్నవి రాజకీయ వ్యూహాలుగా వుండాలి కానీ ప్రచారాలుగా మారకూడదు. వన్స్ పొత్తులు కుదిరిన తరువాత కావాలంటే అందరూ కలిసి వేదికలు ఎక్కడి చేయి చేయి కలిపి పైకెత్తి పట్టుకుని ఫొటొలకు ఫోజులు ఇవ్వొచ్చు. అప్పుడు ఆ మీటింగ్ లకు అన్ని పార్టీల జనం వచ్చి కళకళ లాడవచ్చు. కానీ ఆదికి ముందే తమకు పొత్తుులు కావాలి మొర్రో అని చంద్రబాబు, మేం పొత్తులకు రెడీ అంటూ పవన్ పదే పదే పలవరించడం వల్ల జనాల్లోకి ఏం సందేశం పంపించాలనుకుంటున్నట్లు?
పవన్ బలం సాయం లేకుండా జగన్ ను తాము ఢీకొనలేమని చంద్రబాబు, తమకు స్వంతంగా పోటీ చేసే ఆలోచన లేదు చంద్రబాబుతో కలిసే వెళ్తాం అని పవన్ బాబు చెబుతున్నట్లే కదా? తెలుగుదేశంతో సరిపడకే కదా కాపులు అంతా జనసేన పంచన చేరింది? ఇప్పుడు అదే తెలుగుదేశం పల్లకీని మోయాలంటే ఏమనుకుంటారు ఆ సామాజిక వర్గం అంతా. సరే, అధికారం కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే సామాజిక వర్గం సై అంటే అనొచ్చు కానీ ఆ వర్గం తో చిరకాల వైరం తోనే జనసేనకు దగ్గరైన వర్గం సంగతేమిటి? లేదా ఆ రెండు వర్గాలు ఒక్కటైతే, వాటితో పొసగని మిగిలిన వర్గాల వైనమేమిటి?
ప్రజారాజ్యం ఎందుకు విఫలమైంది. జనసేన అధిపతి రెండు చోట్ల ఎందుకు ఓడిపోయారు. ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీలుగా వాటికి ముద్ర వేయడం ఒక కారణం కాదా? ఇప్పుడు ఆ పార్టీని దగ్గరకు తీసుకోవడం ద్వారా మిగిలిన సామాజిక వర్గాలకు దూరం అయ్యే ధైర్యం తెలుగుదేశం పార్టీ ఎందుకు చేస్తున్నట్లు? కేవలం కాపుల అండ వుంటే లేదా వుండకపోతే జగన్ ను ఢీకొనలేమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిసైడ్ అయిపోయారా? మరి అలాంటి నేపథ్యంలో మిగలిన సామాజిక వర్గాల ఓట్ల పరిస్థితి ఏమిటి? ఆ ఓట్లను జగన్ కు వదిలేస్తారా?
జగన్ తప్పులు చెప్పి ఓట్లు అడిగితే అన్ని వర్గాలు కనెక్ట్ అవుతాయోమో కానీ, కేవలం పవన్ ను దగ్గరకు తీసుకుంటే కాదు కదా? ఈ లాజిక్ ను చంద్రబాబు ఎలా మిస్ అవుతున్నారు? ఆ సంగతి అలా వుంచితే ఇప్పుడు ఙనసేనకు కనీసం పాతిక సీట్లు అయినా ఇవ్వాలి. తెలుగుదేశం బలం లేని సీట్లు కదా ఎంచి ఎంచి మరీ ఙనసేనకు ఇస్తారు. ఇదే కదా రాజకీయం. తెలుగుదేశానికి బలం లేని సీట్లలో జనసేన పోటీ చేస్తే దానికి పొత్తు వల్ల ఒరిగేదేమిటి? ఆ సీట్లలో ఓడిపోతే జనసేనకు పొత్తువల్ల సుఖమేమిటి? మిగిలిన సీట్లలో తెలుగుదేశం పల్లకీ మోయడం మినహాయంచి.
ఇదిలా వుంటే ఎవరు కాదన్నా, అవునన్నా జనసేన లో మూడు వంతుల మంది జనం కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. జనసేన పోటీ చేయనపుడు వారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలంటే అట్నుంచి కూడా కాపు అభ్యర్థి వుంటే కొంత పాజిటివ్ అవుతుంది. అలా కాకుండా వేరే వాళ్లు వుంటే ఓట్ల ట్రాన్సాఫర్మేషన్ సాధ్యం అవుతుందా? అలా కానపుడు పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి మాత్రం లాభం ఏమిటి?
ఇలాంటి అనుమానాలు అన్నీ వున్నాయి. అయినా కూడా చంద్రబాబు పొత్తు కోసం తహతహలాడుతున్నారు. కేవలం ఓట్లు చీలిపోకుండా వుండడం కోసమేనా? లేక జనాలు తెలుగుదేశం పార్టీని ఇంకా నమ్మడం లేదు అన్న అనుమానం వీడడం లేదా? జనసేన వ్యూహాలు అన్నీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారవువుతున్నాయన్న గ్యాసిప్ లు వుండనే వున్నాయి. అలా అన్ని వ్యూహాలు పన్ని జనసేనను బలోపేతం చేసి తెలుగుదేశం సాధించేది ఏమిటి? పవన్ కళ్యాణ్ మాన్ ఆఫ్ మూడ్స్ అన్నది తెలిసిందే. రివర్స్ అయితే పరిస్థితి దారుణంగా వుంటుంది.
సాధారణంగా పొత్తులు అనేవి ఎన్నికలు ఆర్నెల్ల దూరంలో వుండగా మొదలై ఆరు రోజుల దూరంలో వుండగా ఫైనల్ అవుతాయి. కానీ రెండేళ్ల దూరం నుంచే ఎందుకు సందడి చేస్తున్నట్లు? ముందుగా జనసేన మీద ఎందుకు రుమాలు వేస్తున్నట్లు? జనసేనతో పాటు భాజపాను కూడా తోడు వస్తుందనా? నేరుగా తన దగ్గరకు రాని భాజపా వయా జనసేన మీదుగా వస్తుందని చంద్రబాబు ఆలోచనా? అప్పుడు ఆ పార్టీకి కూడా ఓ పదో, పరకో సీట్లు వదిలేయాలి కదా? ఇలా అన్ని పార్టీలకు కలిపి కనీసం 40 సీట్లు వదిలేయాలి. అంటే వైకాపాకు నలభై సీట్లు అప్పనంగా ముందే ఇచ్చేసినట్లు అవుతుంది. ఆపై ఆ పార్టీ స్వంతంగా ఓ యాభై సీట్లు తెచ్చుకుంటే చాలు. ఈ లెక్కలు చంద్రబాబుకు తట్టలేదంటారా? అనుమానమే.
చూస్తుంటే అధికారం అందుకోవాలి ఎలాగైనా? అని చంద్రబాబు డిస్పరేట్ గా ఏదో ఒకటి చేసేయాలని కిందా మీదా పడిపోతున్నట్లు వుంది. ఆ తపనలో, ఆ ఆతృతలో ఆయన నలభై ఏళ్ల అనుభవాన్ని, అది నేర్పిన పాఠాలను మరిచిపోతున్నట్లుగా వుంది. కేవలం పవన్ నామస్మరణమే తనను అధికార తీరానికి చేరుస్తుందనే మూఢ విశ్వాసం పెంచేసుకున్నట్లు కనిపిస్తోంది.