సినిమాల్లో అమ్మ పాత్రలంటే నాకు వెంటనే గుర్తొచ్చేది కెవి.రెడ్డి సినిమాలే. తల్లి పాత్రని ఎంత అద్భుతంగా తీస్తాడంటే హీరోలతో సమానంగా వాళ్లు మనకి గుర్తుండిపోతారు.
పాతాళభైరవి మొదటి సీన్లోనే ఎన్టీఆర్, అంజిగాడు కర్రసాము చేస్తుంటారు. పనీపాట లేకుండా చెడిపోతున్నాడనే కోపం, బాధతో కర్ర తీసుకుని కొట్టడానికి తల్లి (సురభి కమలాబాయి) వస్తుంది. తల్లి కర్రను కొడుకు అడ్డుకుంటాడు. చివరికి లొంగిపోయి కొట్టమన్నప్పుడు తల్లి కొట్టలేక “భగవంతుడా, కొడుకుని ఇయ్యమంటే రాక్షసున్ని ఇచ్చావా” అని వాపోతుంది. ఇక్కడ రచయిత పింగళి చమత్కారం అంజి మాటల్లో కనిపిస్తుంది. రాక్షసుడంటే రక్షించేవాడట. ఆ తర్వాత రాజకుమారి వస్తుంది. కాబట్టి వాళ్లని లోపల పెట్టి తల్లి తలుపు వేస్తుంది.
ఈ కాసింత సీన్లో తల్లికొడుకుల అనుబంధాన్ని చెబుతాడు కెవి.రెడ్డి. కొడుకు గురించి ఎవరైనా దబాయించి అడిగితే భయపడడం తల్లుల సహజ లక్షణం. అలాంటిది రాజభటులే వచ్చి రాజుగారు పిలుస్తున్నారంటే భయంతో వణికిపోతుంది. కొడుకు ధైర్యం చెప్పి భటుల వెంట వెళ్లినా భయంతో బిడ్డను కాపాడమని ఆకాశం వైపు చూస్తుంది.
తర్వాత పాతాళభైరవి సాయంతో సంపదలు పొందిన కొడుకు పెళ్లి జరుగుతుంటే సాదాసీదాగా ఎప్పటిలా పూలు కడుతూ కూచుని వుంటుంది. కొడుకు చేతుల మీదుగా పట్టుచీరలు ఇస్తేనే తీసుకుంటుంది. రాజకుమారి అదృశ్యం తర్వాత కొడుకు కష్టాలు పడ్డాడనే బాధే తప్ప, సంపద పోయిందనే దిగులు లేదు. కొడుకే ఆమె ప్రాణం.
మాయాబజార్లో ముగ్గురు అమ్మలు. కొడుకుపై నమ్మకం, కూతురిపై జాగ్రత్త తల్లి లక్షణం. శశిరేఖ నెత్తిపై పండు పెట్టి అభిమన్యుడు కొట్టబోతే రేవతి (ఛాయాదేవి) కంగారు పడుతుంది. కానీ కొడుకు గురి తప్పడని సుభద్ర (రుష్యేంద్రమణి) అంటుంది. మనుషుల్ని విపరీతంగా పరిశీలించే లక్షణం ఉన్న కెవి.రెడ్డి సహజమైన మానవ మనస్తత్వాన్ని చూపిస్తాడు. వాళ్లు మహారాణులు, రాజులైనా స్వభావాలు ఏమీ మారవని చెప్పడం వల్ల ఆయన సినిమాలు శాశ్వతంగా నిలిచిపోయాయి.
రేవతి డబ్బు మనిషని ప్రియదర్శిని ద్వారా ప్రేక్షకులకు సూచన అందుతుంది. మరి ఆవిడ తన కూతురిని రాజ్యం పోగొట్టుకున్న అభిమన్యుడికి ఇస్తుందా? అందుకే ప్రేమని విడదీయాలని చూస్తుంది. అవమానంతో పుట్టిల్లు చేరిన సుభద్రని వాకిట్లోనే అవమానిస్తుంది.
పుట్టింటిని వదిలి అడవులకి వెళుతున్నప్పుడు కూడా కొడుకు పక్కన ఉన్నాడనే విశ్వాసం సుభద్ర కళ్లలో. రాక్షస మాయని అభిమన్యుడు ఎదుర్కొన్నప్పుడు చేత్తో తట్టి అభినందిస్తుంది. ఘటోత్కచుడి గద తగిలి అభిమన్యుడు మూర్ఛపోతే ఆమెలోని ఉగ్ర రూపిణి బయటికొస్తుంది. తాను ఎవరో గుర్తు చేసుకుని బాణం చేతికి తీసుకుంటుంది. సాదాసీదాగా కనిపించే తల్లి కూడా బిడ్డల మీద దాడి జరిగితే ఎంత ఆగ్రహంతో ఊగిపోతుందో సుభద్రలో చూడొచ్చు.
ఇక హిడింబి (సూర్యకాంతం)కి ఘటోత్కచుడి ఆగడాలంటే భయం. ఏదో ఒకటి చేసి నెత్తి మీదికి తెచ్చుకుంటాడని. సీన్లోకి రావడం రావడమే “సుపుత్రా నీకిది తగదంటిని కదరా” అని వస్తుంది.
ఘటోత్కచుడికి ఆవేశం ఎక్కువ. కౌరవులపై యుద్ధానికి వెళ్తాను అనగానే కంగారు పడుతుంది. శశిరేఖను తీసుకురమ్మని సలహా ఇస్తుంది. దాంతో మాయశశిరేఖ ఘట్టం మొదలు.
జగదేకవీరుని కథలో ప్రతాప్ (ఎన్టీఆర్) దేవకన్యల గురించి చెప్పగానే తల్లి (రుష్యేంద్రమణి) కంగారు పడుతుంది. భర్త తల తిక్క మనిషని ఆమెకు తెలుసు. అందుకే “మీరు అడగడం, వాడు చెప్పడం” అని అక్కడితో ఆపడానికి ప్రయత్నిస్తుంది. తండ్రీకొడుకుల మధ్య వాదం పెరగకుండా చూడడం తల్లి లక్షణం. నాన్నకి కోపం తెప్పించకుండా క్షమాఫణ చెప్పమంటుంది. కొడుకుని రాజ్య బహిష్కరణ చేయకుండా అడ్డు పడినా ప్రయోజనం లేదు.
గత జన్మలో ఏ తల్లీబిడ్డల్ని విడదీశామో, ఇప్పుడు నా బిడ్డకి దూరమవుతున్నానని అమ్మవారి ముందు ఏడుస్తుంది. కొడుకుని రక్షించమని కోరుకుంటుంది.
కొడుకు శిలావిగ్రహంగా మారినప్పుడు ఉలిక్కిపడి అపశకునం అయ్యిందని దేవిని వేడుకుంటుంది. తల్లి కోసం పార్వతిదేవే స్వయంగా వెళ్లి హీరోని కాపాడుతుంది.
చాలా కాలం తర్వాత కొడుకుని చూసిన కళ్లలోని వెలుగు మామూలుగా ఉండదు. ఇంద్రకుమారి చీరను దాచడానికి తల్లి వద్దకు వెళ్లినపుడు స్త్రీ సహజమైన కుతూహలంతో చీరని చూసి “ఎంత బావుంది” అని ముచ్చట పడుతుంది. ఆ Expression అద్భుతం. కెవి.రెడ్డికే అది సాధ్యం.
మానవాతీత వ్యక్తుల్లో కూడా మామూలు మనుషుల్ని చూపడమే కెవి గొప్పతనం. (మదర్స్ డే సందర్భంగా)
జీఆర్ మహర్షి