ఇక్కడ గ్రాఛూస్ విషయానికి వస్తే – క్రాసస్తో సవ్యంగా బేరమాడినా పని జరక్కపోవడంతో అతను ఫ్లేవియస్ని పిలిచి 'వాడి కిద్దామనుకున్న ఇరవై లక్షలూ నీకిస్తాను. నువ్వు క్రాసస్ పనివాళ్లకు లంచాలు పెట్టి ఆమెను తప్పించి నా వద్దకు తీసుకురా. ఆమెను తీసుకువచ్చాక ఆమె నాతో ఓ రాత్రి గడపాలి. ఆ తరువాత ఆమెను రోమ్‌నుంచి తప్పిస్తాను. స్వేచ్ఛ నిస్తాను. క్రాసస్కు అందుబాటులో లేకుండా ఎక్కడికో పారిపోవడానికి ఏర్పాట్లు నువ్వే చెయ్యి. నీ వెనుక నేనున్నాను. ఈ విషయం బయట పడ్డాక క్రాసస్ కంటబడితే నిన్ను చంపేస్తాడు. అందుకని నువ్వూ ఊరొదిలి పారిపో. ఈ విషయాలన్నీ ఆమెకు ముందే చెప్పాలి. అప్పుడే ఆమె నీతో కలిసి నా దగ్గరకు రావడానికి ఒప్పుకుంటుంది.' అన్నాడు.
ఇరవై లక్షలు మాట వినగానే ఫ్లేవియస్ మూర్ఛపడ్డాడు. మర్నాడు క్రాసస్ ఊళ్లో లేకుండా చూసి ఏర్పాట్లన్నీ చేశాడు. చీకటిపడేవేళకు వరీనియాను వెంటపెట్టుకుని గ్రాఛూస్ వద్దకు వచ్చాడు.
ఆమెను చూడగానే గ్రాఛూస్ ముగ్ధుడయ్యాడు. నీక్కావలసిందేమిటి? అని అడిగాడు.
'స్వాతంత్య్రం. ఇంకెప్పుడు రోమ్ను చూడనక్కరలేకుండా నా కొడుకు స్వతంత్రుడిగా పెరిగితే నా కదే చాలు' అంది వరీనియా.
'ఎందుకీ స్వాతంత్య్రం? రైతుకూలీగా రెక్కలు ముక్కలు చేసుకోవడానికా? స్పార్టకస్ కూడా రోమ్ని అసహ్యించుకునేవాడు కదూ' అన్నాడు గ్రాఛూస్.
'అతను రోమ్ను వ్యతిరేకించాడు, రోమ్ అతన్ని వ్యతిరేకించింది.' అంది వరీనియా.
'తెలుసు. కానీ నేను రోమ్ను ప్రేమిస్తాను. రోమ్ నా ప్రాణం, నా జీవితం, నా మాతృమూర్తి. కానీ నా మాతృమూర్తి ఓ కులట. కానీ నాకు మాతృమూర్తే! స్పార్టకస్ కన్న కలలు కనడానికీ, అతని ఆలోచనా పద్ధతి కలగడానికి నాకు వయసు మళ్లింది. లేకపోతేనా, అతని పద్ధతిలోనే రోమ్ను తయారుచేసేవాణ్నేమో.' అన్నాడు గ్రాఛూస్ సాలోచనగా.
'నిన్ను ప్రేమతో నిండిన ఒక్క రాత్రి అనుభవిద్దామని అనుకున్నాను. మళ్లీ నా అంతట నేనే కాదనుకున్నాను. ఒక్క రాత్రి నీ గౌరవ మర్యాదలు పొందితే చాలనుకున్నా. నువ్వొక్క రాత్రి కృతజ్ఞత తెలిపితే చాలు. తెల్లవారేవరకూ మనం యిలాగే మాట్లాడుతూ కూచుందాం. అది చాలు నాకు.' అన్నాడు గ్రాఛూస్.
వాస్తవానికి గ్రాఛూస్ తుచ్ఛ రాజకీయాలతో పైకి వచ్చినవాడు. నిజాయితీపరులైన ప్రజాసేవకులను చంపించి పైకి వచ్చినవాడు. స్వేచ్ఛలు హరించేసిన రాజకీయ వ్యవస్థనే నమ్మినవాడు. అయినా అతనిలో మానవత్వం మేలుకొంది. స్పార్టకస్‌ను నాశనం చేశాక అతని వారసుణ్ని బతికించాలనిపించింది. వరీనియా వ్యక్తిత్వం అతన్ని ప్రభావితం చేసింది.
తెల్లవారగానే రథం వచ్చింది. వరీనియా వెళ్లబోతూ గ్రాఛూస్ వద్దకు వచ్చి ఓ తల్లి బిడ్డడిని లాలించినట్టు ముద్దుపెట్టుకుని లాలించింది. 'నువ్వు నాతో బాటు వచ్చేస్తే నిన్ను బాగా చూసుకుంటాను.' అంది.
'చాలు వరీనియా! ఆ మాటే చాలు' అన్నాడు గ్రాఛూస్ ఆ ఆత్మీయతకు కరిగిపోతూ. 'కానీ నేను నిస్సహాయుణ్ని. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, రోమ్ను అంతే ప్రేమిస్తున్నాను. వదిలి వెళ్లలేను.' అన్నాడు గ్రాఛూస్.
ఫ్లేవియస్ను పిలిచి 'ఇదిగో నా అధికార ముద్రతో యిచ్చిన అనుమతి పత్రాలు. ఈమెను ఇటలీ దాటించు. ఆల్ప్స్ పర్వతాల లోయలో నివసించే గాల్ రైతుల వద్దకు చేర్చు. వాళ్లు కల్లాకపటం తెలియని రైతులు. అక్కడే ఈమె వుండగలదు.' అని చెప్పాడు.
ఆమెను పంపించేశాక తన బానిసలందరికీ విమోచనా పత్రాలు పంచిపెట్టాడు. వాళ్లకు విముక్తి ప్రసాదించడంతో బాటు కాస్త డబ్బు యిచ్చాడు. అందర్నీ పంపేసి క్రాసస్కోసం ఎదురుచూస్తూ కూచున్నాడు. అనుకున్నట్టుగానే క్రాసస్ మహోగ్రంగా వచ్చాడు. కానీ అతను యింటిలోకి వస్తూండగానే గ్రాఛూస్ ఓ కత్తితో తనను తాను పొడుచుకుని మరణించాడు. అతని శవాన్ని చూస్తూనే క్రాసస్ నిర్ఘాంతపోయాడు. ఏం చేయలేక ఉక్రోషంతో యింటికి వెళ్లిపోయాడు.
ఇవతల వరీనియాను వెంటబెట్టుకుని ఫ్లేబియస్ రోమ్ విడిచి వెళ్లిపోయాడు. దారిలో అడ్డగించిన సైనికులకు గ్రాఛూస్ ఆజ్ఞాపత్రాలను చూపించాడు. రెండు రోజులు పోయాక ఆల్ప్స్ పర్వతాలు చేరారు. అక్కడ ఫ్లేబియస్ వరీనియా వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. వరీనియా రథం దిగి ఓ మైలు దూరం నడుచుకుంటూ వెళ్లి ఓ పల్లె చేరింది. అక్కడ ఓ రైతు భార్య ప్రసూతిలో చనిపోయింది. అతను వరీనియాను చేరదీశాడు. అతను అమాయకుడు. చదువూ, సంధ్యా వచ్చినవాడు కాడు. వరీనియాకు, అతనికి ఏడుగురు పిల్లలు పుట్టారు. స్పార్టకస్ వల్ల పుట్టిన పిల్లవాడికి వరీనియా స్పార్టకస్ అనే పేరు పెట్టింది. అతనికి ఏడే యేట తన తండ్రి గురించి చెప్పింది. అతనికి ఇరవై ఏళ్లుండగా జ్వరంతో మరణించింది.
కొన్ని రోజులకు ఆ ఊళ్లో కాటకం వచ్చింది. పన్నులు చెల్లించలేదని సైనికులు వచ్చి రైతులను బానిసలుగా తీసుకుపోయారు. జూనియర్ స్పార్టకస్, అతని సవతితమ్ముళ్లు కలిసి దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. సైనికులు అక్కడికీ వచ్చి వీళ్లతో పోరాడారు. ఒక్కోప్పుడు వీళ్లది పైచేయి, ఒక్కోప్పుడు వాళ్లది పై చేయి. చివరకి తండ్రిలాగానే ఇతనూ స్వాతంత్య్ర సమరంలో చనిపోయాడు. ఈ కథంతా చెప్పి రచయిత చివర్లో అంటాడు – సంఘంలో కొందరు శ్రమశక్తిని దోపిడీ చేసినంతకాలం స్పార్టకస్ పేరును చరిత్ర గుర్తు వుంటుంది అని. ఒక్కోప్పుడు అది గుసగుసలుగా వినబడవచ్చు, మరోప్పుడు అది రణన్నినాదమై దిక్కులు పిక్కటిల్లవచ్చు అని.
అరవైై ఐదేళ్ల్ల క్రితం రాసిన ఈ నవల ఇప్పటికీ చదవదగ్గదే. ఎందుకంటే సామ్రాజ్యవాదం వున్ననాళ్లూ ఈ పుస్తకం రెలెవెంటే! అమెరికాలో బానిసలకు విముక్తి ప్రసాదించారు కాబట్టి, ప్రపంచంలో బానిసలు యిప్పుడు లేరు కాబట్టి ఈ పుస్తకం చదవనక్కరలేదని అనుకోవద్దు.
మనుష్యులచేత ఊడిగం చేయించడం పాత ఫేషన్. ఇప్పటి సామ్రాజ్యవాదం దేశాల చేతనే ఊడిగం చేయిస్తోంది. తమకు నచ్చిన దేశం పక్కనున్న దేశాల మీద దాడి చేస్తే తప్పు లేదంటుంది. తనకు నచ్చనివాడు దేశం ఏలితే తప్పుడు ఆరోపణలు ఆరోపించి వాడినీ, వాడి దేశాన్నీ నాశనం చేసి వదిలిపెడుతుంది.
ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో అనేక సుగుణాలు వున్నట్టే ఇప్పటి అమెరికన్ సామ్రాజ్యంలో కూడా అనేక సుగుణాలు వున్నాయి. అక్కడ జాతిమతభేదం లేకుండా ప్రతిభకు పట్టం కడతారు. కానీ అలనాటి రోమన్లు ఆధిపత్య ధోరణితో, అహంకారంతో ఇతర దేశస్తుల జీవితాలను శాసించారు.ఈనాడు అమెరికా ఆసియన్, ఆఫ్రికన్ దేశాలపై ఎలా పెత్తనం సాగిస్తోందో, ఎలాటి అబద్ధాలు చెప్పి తన కిష్టం లేని పాలకులను తప్పిస్తోందో చూస్తున్నాం. ఆర్థికమాంద్యానికి అమెరికా ఎలా బలైందో చూశాం. గ్లోబలైజేషన్ పేరుతో అన్ని దేశాలలోనూ చొచ్చుకుపోయి వారి ఆర్థిక వ్యవస్థలను నాశనం చేద్దామనుకుంది. వరల్డ్బ్యాంక్ను చేతిలో పెట్టుకుని, లిబరలేజేషన్ గ్లోబలైజేషన్ పేరుతో ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తోంది. ఎదురుతిరిగిన దేశాలపై ఆంక్షలు విధించి సర్వనాశనం చేస్తోంది. సబ్సిడీలు ఆపాలని ఒత్తిడి చేస్తుంది. తన రైతుల వద్దకు వచ్చేసరికి సబ్సిడీలు యిస్తుంది. ఈ ద్వంద్వనీతి యితరులు సహించలేక గగ్గోలు పెట్టినా ఏమీ చేయలేకపోయారు. అంతలోనే అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలింది.
లిబరలైజేషన్ పేరుతో యితర దేశాలను దోచుకోబోతే అమెరికా బ్యాంకులు రూల్సే లిబరలైజ్ చేసి పారేశాయి. మెడకాయ మీద తలకాయ లేనివాడికి కూడా అప్పులిచ్చేసిన కొన్ని ఏజన్సీలు, ఆ అప్పులను యింకోడి నెత్తికి కట్టేసి తాము దాటేశాయి. పునాది బలంగా లేకుండానే పేకమేడలు కట్టుకుంటూ పోయారు. అంతగా వస్తే యిళ్లు వేలం వేయవచ్చు అనుకున్నారు. వేయడానికి వాటికి అంత విలువ వుంటేగా! ఉత్పాదన లేకుండా డబ్బు సర్క్యులేట్ చేసి గాలి బుడగలు చూసి మురిసిపోయారు. అలనాటి రోమన్లలాగానే అమెరికన్లు విలాసాలు మరిగారు. అప్పుచేసి పప్పుకూడు లాగించారు. ఉన్నట్టుంది ఆ రంగురంగుల గాలిబుడగ ఓ సారి ఠప్ప్మని పేలింది. చేతికి మిగిలినది కాస్త సబ్బు నురగే!
ఇతరుల యిళ్లకు నిప్పు పెడితే తన యిల్లు మాత్రం కాలకుండా వుంటుందా? ఆనాటి రోమన్ సమాజం నైతిక విలువలు కోల్పోయి దర్పంతో, మదంతో తమ సమాజాన్ని భ్రష్టు పట్టించుకున్నారు. నేటి అమెరికన్ సమాజమూ అంతే! కుటుంబ వ్యవస్థ చెదిరిపోయింది. మానవతా విలువలు మంట గలిసాయి. ఆర్థిక వ్యవస్థ పతనమైంది. నిరుద్యోగం ప్రబలింది. సామాజిక ఒత్తిళ్లు పెరిగాయి. అందుకనే వాళ్ల దేశంలోనే ఉగ్రవాదులు తలెత్తుతున్నారు. సెప్టెంబరు 11 దాడుల్లో ఉపయోగించినవి అమెరికన్ విమానాలే! ఆ విధ్వంసానికి సహకరించినది వారి ఉద్యోగులే!
రష్యాను దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ సహాయంతో ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లను సృష్టించిన అమెరికా యీరోజు తాలిబన్లంటే వులిక్కిపడుతోంది. తను తయారుచేసిన భూతానికే తనే ఆహారమౌతోంది. అఫ్గనిస్తాన్‌లో రేపిన ఉగ్రవాదం ధాటికి అమెరికా విలవిలాడుతోంది. అమెరికాకు సహాయపడిన పాకిస్తాన్ కూడా తాలిబన్ల దాడికి గురవుతోంది. అఫ్గనిస్తాన్‌ను అమెరికా పట్టుకు వేళ్లాడలేదు, అలాగని వదిలి రాలేదు. ఐసిస్ తయారుకావడానికి అమెరికా, దానికి వత్తాసు పలికిన రాజ్యాలు కారణం కాదా? అన్ని చేసి యీనాడు ఆసియన్లందరినీ అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆర్థికమాంద్యం తమ వుద్యోగాలు పోతున్నకొద్దీ ఆసియన్లు వాటిని తన్నుకు పోతున్నారని వారిపై జాతి వివక్షత ప్రదర్శిస్తున్నారు. నల్లజాతివారి సమస్య అమెరికాను విడిచిపెట్టలేదు. వారిని తమ దేశంనుండి తరిమేయలేరు. అలాగని పూర్తిగా తమలో కలుపుకోనూ లేరు. మరో స్పార్టకస్ ఉద్భవించడానికి దారి తీసే పరిస్థితులే యివి!
వర్తమానం అర్థం కావాలంటే గతం గురించి బాగా తెలుసుకోవాలి. అందువల్లనే ఈ పుస్తకం చదవండి. చాలా బాగుంటుంది. హైదరాబాద్ బుక్ ట్రస్టు వాళ్లు వేశారు. బుక్‌స్టాల్స్‌లో దొరకవచ్చు. (సమాప్తం) (ఫోటో – పారిస్‌లోని లూర్ మ్యూజియంలో స్పార్టకస్ విగ్రహం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)