లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ తయారు చేయడానికి పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు అంటూ నేను పైన చాలా పెద్ద లిస్టే యిచ్చాను. అవన్నీ నిర్ధారించడం కష్టం, చాలా కసరత్తు కావాలి అనుకుంటే కనీసం ఆదాయపరిమితి అంశమైనా అమలు చేయాలి. ఎందుకంటే డబ్బు వుంటే చాలా అవరోధాలకు పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్న నెలకు 50 వేల ఆదాయం తక్కువేమీ కాదు. సగటు తలసరి ఆదాయంతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. అందునా యీ ఆదాయం గణించేటప్పుడు జీతం నుంచి, వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం లెక్కలోకి తీసుకోరు. ఈ పరిమితి కూడా యీ ఉద్యోగాల విషయంలో మాత్రమే తప్ప కాలేజీ ఎడ్మిషన్లు, సంక్షేమపథకాలు, ఎన్నికలలో అభ్యర్థులుగా నిలబడడాలు – వేటిలోనూ వర్తించదు. ఆ లెక్కన చూస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం పోదు. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే గ్రూపు ఎ, క్లాస్ 1 ఆఫీసర్ల కంటె కింది ర్యాంకులలో వున్న అధికారుల, ఉద్యోగుల విషయంలో జీతాలు, వ్యవసాయంపై ఆదాయం కాకుండా యితరత్రా వచ్చే ఆదాయం ఏటా 6 లక్షల కంటె ఎక్కువ వుంటేనే వారికి రిజర్వేషన్ వర్తించదు' అంటున్నారు. అంటే వారు ఎంత హైక్లాసు కుటుంబీకులో ఆలోచించండి.
అటువంటి కుటుంబంలో వున్న పిల్లవాడికి సరిగ్గా చదువుకునే అవకాశాలు వుండవని, సొంతంగా ఉద్యోగం తెచ్చుకోలేడనీ, సమాజంలో గౌరవప్రదమైన స్థానం వుండదనీ ఎలా నమ్మగలం? 50 వేల పరిమితి పెట్టినా దానికి కూడా తూట్లు పొడుస్తారు. ఉద్యోగస్తుల జీతం (అదెలాగూ లెక్కలోకి రాదు) విషయంలో ఆదాయం కచ్చితంగా చెప్పగలరు కాని, వ్యాపారవ్యవసాయ వర్గాలలో ఆదాయం తేల్చడం మహా కష్టం. బిసిలలో స్వయంఉపాధి (సెల్ఫ్-ఎంప్లాయ్డ్) కలవారు చాలామంది వున్నారు. వారు వెల్లడించే ఆదాయం నెలకు 50 వేలు వున్నపుడే యీ పరిమితి వర్తిస్తుంది. పల్లెటూళ్లలో మోతుబరులు సైతం తెల్లకార్డులు, గులాబీరంగు కార్డులు సంపాదించే యీ రోజుల్లో ఆదాయనిర్ధారణ మహా కష్టం. ఎంతోమంది ధనికులు యీ నిబంధనలోకి రాకుండా తప్పించుకుంటారు. అయినా యిలాటి నిబంధన కనీసం తొలి మెట్టుగానైనా రావాలనే అంటాను నేను. వచ్చినపుడే ఆ కులాల్లో పేద కుటుంబాలకు అవకాశాలు పెరుగుతాయి.
ఎస్సీ, ఎస్టీ, బిసిలలో సర్వే చేసి చూస్తే కొన్ని కుటుంబాల వాళ్లే రిజర్వేషన్ల వలన లబ్ధి పొందుతున్నారని తెలుస్తుందని అనుకుంటున్నాను. మాదిగ పోరాట సమితి వాదన చూడండి – ఎస్సీ రిజర్వేషన్ వలన మాలలే బాగుపడుతున్నారని, అందువలన ఎస్సీలలో కూడా వర్గీకరణ జరిపి తక్కిన ఉపకులాలకు కూడా సబ్-రిజర్వేషన్ యివ్వాలని అంటున్నారు. దానికి ప్రతిగా మాలలు 'మేం మిమ్మల్ని చదువుకోవద్దని అంటున్నామా? మాకు తెలివితేటలున్నాయి, మేం పైకి వస్తున్నాం, మమ్మల్ని చూసి అసూయ పడకండి, స్వయంప్రతిభతో పైకి రండి' అంటున్నారు. అవే మాటలు ఓసి, బిసిలు తమకు చెపితే మాలలేమంటారో తెలియదు. మాదిగ పోరాట సమితి వలన కొన్ని గణాంకాలు బయటకు వచ్చాయి. బిసిలలో కొన్ని కులాల వాళ్లు అలాటి కసరత్తు చేస్తే బిసి రిజర్వేషన్ వలన ఎంతమంది ధనికులు, ఏ కులాల వాళ్లు బాగుపడ్డారో తేలుతుంది. బిసిల నాయకత్వం యీ ధనికుల చేతిలో, పలుకుబడి వున్న వాళ్ల చేతిలో, రాజకీయవేత్తల చేతిలో వున్నంతకాలం అవి బయటకు వస్తాయనుకోను. బాగుపడినవాళ్లే యింకా బాగుపడుతున్నారు. ఆ పరిస్థితి మార్చాలంటే ఆర్థిక స్థితిగతుల పరిమితి పెట్టి కొందర్ని తప్పించాలి. మంద కృష్ణ మాదిగ వర్గీకరణ అంశం ఎత్తుకున్నారు కానీ ఎస్సీలలో కూడా ఆదాయ పరిమితి పెట్టాలని అని వుంటే పేద మాలలు కూడా అతనికి వత్తాసు పలికేవారు.
పేదరికం కారణంగా అవకాశాలు పోగొట్టుకునే వారి పట్ల సమాజం సానుభూతితో వుంటుంది. అగ్రకులమైనా అణగారిన కులమైనా వారికి ఉచితంగా కోచింగ్ క్లాసులు ఏర్పాటు చేసి యితరులతో పోటీ పడే స్థాయికి వారి ప్రతిభను పెంచుతామని ప్రభుత్వం అంటే ప్రజామోదం లభిస్తుంది. అలా కాకుండా ధనం, అధికారం, పదవి అనుభవించేవారు కేవలం కులం పేరు చెప్పి రిజర్వేషన్లు కొట్టుకుపోతూ వుంటే కడుపుమంటగా వుంటుంది. సమాజంలో వైషమ్యం పెరుగుతుంది. అవకాశం చిక్కినపుడు వారి పట్ల వివక్షత చూపించే ప్రమాదం వుంది. ఆదాయ పరిమితి పెడతాం అంటే బిసిలలో చేర్చమని అడిగే కులాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఆ కులసంఘాల నాయకులు సాధారణంగా ధనికులు, ఉద్యోగాలు, పదవుల్లో వున్నవారే అయి వుంటారు. తమ వారసులకు లాభం కలగదనేసరికి వారికి ఆసక్తి తగ్గుతుంది. బిసిల కోటా యిప్పుడున్న శాతంతో ఆగినా సరిపోతుంది. బిసిల్లో క్రీమీ లేయరు పోటీలోంచి తప్పుకోవడంతో, రిజర్వేషన్ ఫలాలు యిప్పటిదాకా చేరని కుటుంబాలకు చేరతాయి. వారిలో కొందరు ముందుకు వస్తారు, పైకి వెళతారు. అందువలన క్రీమీ లేయరు విధానాన్ని తప్పక అమలు చేయవలసినదే. ఆదాయ పరిగణనలో జీతం, వ్యవసాయంపై ఆదాయం తీసేయడం సరికాదు. అవి కలిపి చూడాలి. అంతేకాదు కారు కలిగివుండడం/.. యిన్ని ఎకరాల మాగాణీ లేదా యిన్ని ఎకరాల మెట్ట/ యింత విలువ చేసే సొంత యిల్లు/యింతమంది ఉద్యోగులు వున్న వ్యాపారం.. యిలా కొన్ని పెరామీటర్లు కూడా జోడించాలి.
బిసిల విషయంలోనే యివన్నీ పెట్టాలా, ఎస్సీల విషయం వదిలేయాలా అనే ప్రశ్న ఛట్టున వస్తుంది. ఎస్సీల విషయంలో కూడా యివన్నీ జరగాలి. అయితే బిసిల విషయంలో రాష్ట్రప్రభుత్వాలు చొరవ చూపించి అమలు చేస్తే, ఎస్సీల విషయంలో కొన్నాళ్లకు కేంద్రం కూడా ధైర్యం కనబరచవచ్చు. బిసిలకు లేదా ఎస్సీలకు ఆదాయపరిమితి పెడితే బిసిలు ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారు అనుకోవడం భ్రమ. ఆయా కులసంఘాల నాయకులు ఎదురు తిరుగుతారు కానీ యీ విధానం వలన తమకు లబ్ధి కలుగుతోందని గ్రహించిన అనేక మంది పేద బిసి, ఎస్సీలు ప్రభుత్వానికి మద్దతుదారులుగా మారతారు. వాళ్లలో చదువు పెరిగినకొద్దీ ఏ విధానం తమకు మేలు చేస్తోందో గ్రహించే జ్ఞానం కలుగుతుంది. ఏ కులసంఘపు నాయకుడికి తన కులంవాళ్లపై అదుపు లేదన్నది వాస్తవం. బిసి నాయకులెవరూ సొంతంగా పార్టీ పెట్టి నడపగలిగినది లేదు. మామూలు పార్టీల్లోనే చేరి బిసి పేరు చెప్పి పదవులు సంపాదించుకోవడం తప్ప! అది గ్రహించి కెసియార్ ధైర్యంగా ముందుకు వెళితే శ్లాఘనీయుడే! – (సమాప్తం)
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)