బ్రూసు ఒంటరిగా ప్రయాణం సాగించాడు. మర్నాడు సాయంత్రానికి ఆకలి, దాహం, అలసట పీడిస్తూ వుండగా ఒక రైతు కుటీరం తలుపు తట్టాడు. తలుపు తీసిన ముసలమ్మ ''రండి నాయనా, ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ యీ యింటికి ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతున్నాను.'' అంది. ''ఎవరతను?'' కుతూహలంతో అడిగాడు బ్రూసు.
''మన రాజు, రాబర్ట్ ద బ్రూస్'' గర్వంగా చెప్పింది ముసలమ్మ. ''ప్రస్తుతానికి అతన్ని జంతువు వేటాడినట్లు వేటాడుతున్నారు. కానీ అతను స్కాట్లండ్ మొత్తాన్ని ఏలే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.'' అందామె. బ్రూసు చలించిపోయాడు. ''నువ్వంతగా అభిమానించే బ్రూసును నేనే తల్లీ'' అన్నాడు.
ఆమె ఆనందాశ్చర్యాలలో మునిగిపోయి అతని ముందు మోకరిల్లి ''ఒంటరిగా ఎందుకున్నావు ప్రభూ? ఏరీ నీ వాళ్లంతా?'' అని అడిగింది. ''నా మనుష్యులంతా చెల్లాచెదరై పోయారు. ప్రస్తుతం నేను ఒక్కణ్నే.'' అన్నాడు బ్రూసు.
''నాకు ముగ్గురు కొడుకులున్నారు. ఇప్పణ్నుంచి వాళ్లు నీవాళ్లు.'' అందామె. ఆ ముగ్గురు దృఢకాయులూ అద్భుతమైన విలుకాళ్లు. ఆ రోజు నుంచి బ్రూసును వెన్నంటి వున్నారు. (ఈ ఉపకారాన్ని బ్రూసు మర్చిపోలేదు. తర్వాతి రోజుల్లో అతనికి సింహాసనం దక్కాక ఆమెను రప్పించి కష్టకాలంలో ఆదుకున్నావు, నీకేం చేయగలను అని అడిగాడు. రెండూళ్ల మధ్య భూమిని యిమ్మనమంది ఆవిడ. దాన్ని తన ముగ్గురు కొడుకులకు పంచింది) బ్రూసు అక్కడ వుండగానే అతని తమ్ముడు ఎడ్వర్డు, స్నేహితుడు జేమ్స్ ద డగ్లస్ అతన్ని వెతుక్కుంటూ వచ్చి చేరారు. వారి వెనక్కాల 150 మంది వీరులున్నారు. హఠాత్తుగా వచ్చి పడిన బలగాన్ని చూసి బ్రూసు తన కష్టాలన్నీ మర్చిపోయాడు. మళ్లీ పోరాటానికి సై అన్నాడు.
''మేం వచ్చేదారిలో ఒక గ్రామంలో 200 మంది ఇంగ్లీషు సైన్యం బస చేసి వుంది. మనం పూర్తిగా కనుమరుగై పోయాయన్న ధీమాతో వాళ్లు చాలా ప్రమత్తంగా వున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్లి పడితే విజయం తథ్యం'' అన్నాడు డగ్లస్. సరే అన్నాడు బ్రూసు. ఆ దాడి విజయవంతమైంది. ఆ తర్వాత అలాటివి ఎన్నో జరిగాయి. బ్రూసు మళ్లీ పుంజుకున్నాడని వినగానే స్కాట్లండ్‌లోని ఇంగ్లీషు దళపతులు బయటకు రావడం మానేసి ఎడ్వర్డు సైన్యసహాయం పంపుతాడని ఆశిస్తూ కోటలో తలుపులు మూసుకుని కూర్చోసాగారు.
ఇప్పటివరకు ఎడ్వర్డు తన సేనాపతులను, దళపతులను పంపిస్తూ వచ్చాడు తప్ప స్వయంగా రాలేదు. ఇప్పుడు తను కదలిరాక తప్పదనుకున్నాడు. కానీ అతను అప్పటికే జబ్బు పడివున్నాడు. నడవలేడు, గుఱ్ఱం ఎక్కలేడు, చనిపోయేముందు స్కాట్లండ్ విజేతగా నిలవాలనే కోరికతో పల్లకీ ఎక్కి బయలుదేరాడు. కానీ స్కాట్లండ్ కనుచూపు మేరలో వుండగానే 68 వ యేట 1307లో కనుమూశాడు. ఆఖరి క్షణాల్లో కొడుకు రెండో ఎడ్వర్డుని పిలిపించి ''నువ్వు నా కోర్కెను తీర్చే బాధ్యత తలకెత్తుకోవాలి. స్కాట్లండ్‌ను జయించాకనే నా అంత్యక్రియలు చేయాలి'' అని ఒట్టు వేయించుకున్నాడు. కొడుకు సరే అన్నాడు కానీ మాట నిలబెట్టుకోలేదు. చనిపోగానే శవాన్ని వెస్ట్‌మిన్‌స్టర్‌కు పంపి ఖననం చేయించాడు. స్కాట్లండ్‌పై దండయాత్రకు బయలుదేరాడు కానీ దారిలో కష్టనష్టాలు భరించలేక ఒక యుద్ధం కూడా చేయకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.
ఇదే మొదటి ఎడ్వర్డుకు, రెండో ఎడ్వర్డుకు వున్న తేడా. రెండో ఎడ్వర్డును ఎడ్వర్డ్ ఆఫ్ సియర్నాఫోన్ అని కూడా అంటారు. అతను 1284లో పుట్టాడు. అతని అన్నలు జాన్, హెన్రీ, అల్ఫోన్సో ఒకరి తర్వాత మరొకరు చనిపోవడంతో ఆఖరివాడైన ఎడ్వర్డు 1307లో రాజయ్యాడు. తండ్రి వీరుడు, శూరుడు, యోధుడు కాగా కొడుకు తండ్రితో బాటు దండయాత్రల్లో 1300 నుంచి పాల్గొంటున్నా స్వభావరీత్యా లలితకళారాధకుడు, సరదా పురుషుడు.
ఫ్రాన్సు రాజైన నాలుగో ఫిలిప్స్ యిరుదేశాల మధ్య వైషమ్యాన్ని తగ్గించడానికి తన కుమార్తె ఇసబెల్లాను రెండో ఎడ్వర్డుకిచ్చి 1308లో వివాహం జరిపించాడు. కానీ రెండో ఎడ్వర్డు 1300 నుండి పియర్స్ గేవ్‌స్టన్ అనే వీరుడితో ఎక్కువ కాలం గడిపేవాడు. వాళ్లు స్నేహితులు మాత్రమే కారు, వారిద్దరి మధ్య స్వలింగసంపర్కం కూడా వుండేదని కొందరంటారు. ఏమైతేనేం, పియర్స్ తను రాజుకు ఆప్తుడనని చెప్పుకుంటూ అధికారం చలాయించడంతో తక్కిన సామంతరాజులందరూ అతనిపై అసూయ, కసి పెంచుకున్నారు. అతన్ని దూరం పెట్టాలని రాజుకి గట్టిగా చెప్పారు. మావగారు కూడా అలాగే చెప్పాడు. చివరకు ఎడ్వర్డు అతన్ని రాజ్యానికి దూరంగా పంపించాడు. అప్పుడు సామంతరాజులు, జమీందార్లు రాజుపై ఒత్తిడి తెచ్చి 1311లో కొన్ని సంస్కరణలు చేయించి, తమకు కొన్ని అధికారాలు బదిలీ చేయించుకున్నారు. వాటిని ఉపయోగించుకుని పియర్స్‌ను రాజ్యం నుండి బహిష్కరించారు. దాంతో రాజుకు కోపం వచ్చి సంస్కరణలు రద్దు చేసి పియర్స్‌ను వెనక్కి రప్పించాడు. అప్పుడు ఎడ్వర్డు దాయాది నాయకత్వంలో కొందరు సామంతరాజులు పియర్స్‌ను పట్టుకుని 1312లో ఉరి తీశారు. ఇక అప్పణ్నుంచి చాలా ఏళ్లపాటు రాజుకు, సామంతరాజులకు మధ్య కొట్లాటలు జరిగాయి. (సశేషం) (చిత్రాలు – రెండవ ఎడ్వర్డు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)