నాన్నకు ప్రేమతో..ఎన్టీఆర్ కు డూ..ఆర్ డై సినిమా. సుకుమార్ కు మళ్లీ భారీ సినిమాల దర్శకత్వం రావాలన్నా ఇదే చాన్స్. మంచి నిర్మాత అనిపించుకున్న బోగవల్లి ప్రసాద్ గట్టెక్కాలన్నా ఇదే అవకాశం. ఇలాంటి సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయాలన్నది సంకల్పం. మరోపక్క బాబాయ్ బాలయ్య డిక్టేటర్ తో పోటీ పడుతోంది బుడ్డోడు ఎన్టీఆర్ సినిమా. అయితే ఈ సినిమా విడుదలపై బోలెడు సందేహాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఈ సినిమా 14 న విడుదలకు షెడ్యూలు చేసారు. థియేటర్లు బ్లాక్ చేసారు. ప్రకటనలు షెడ్యూలు చేసారు. కానీ ఆ రోజుకు రెడీ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి.
సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి వుందని, అందులో ఓ ఫైట్ కూడా వుందని తెలుస్తోంది. రాజీవ్ కనకాల డేట్స్ నే అయిదు దాకా వున్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ కు వంట్లో బాగాలేక, ఇతరత్రా కారణాల వల్ల రెండు రోజులు షూటింగ్ జరగలేదు. అదీ కాక, ఇప్పటి దాకా తీసినదే రెండున్నర గంటలకు పైగా వచ్చిందని, ఇంకా తీయాల్సి వుందని, ఇదంతా కలిపితే మూడు గంటలు అవుతుందని వినికిడి.
దీనంతటనీ కుదించి, సరిగ్గా ఎడిట్ చేయడానికి తనకు కాస్త టైమ్ అవసరం అని దర్శకుడు సుకుమార్ అంటున్నాడట. కావాలంటే ఈ నెలాఖరు లో లేదా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ పెట్టుకోమంటున్నాడట. దీనికి తోడు దేవీ వర్క్ కూడా ఇంకా చాలా బ్యాలెన్స్ వుందని తెలుస్తోంది.
వీటన్నింటికి కలిపి మిగిలిన సమయం 12 రోజులు. దాంట్లో సెన్సారు కూడా వుంది. అంటే పది రోజుల్లో ఇవన్నీ పూర్తి కావాలి. ఎలాగైనా చేయాల్సిందే అని నిర్మాత ప్రసాద్, హీరో ఎన్టీఆర్ చాలా పట్టుదలగా వున్నారని వినికిడి. ఇంత హడావుడిగా చేస్తే క్వాలిటీ ప్రాబ్లమ్ వస్తుందని దర్శకుడు సుకుమార్ భయమట. మొత్తానికి ఏం జరుగుతుందో మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది.