ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు – 71

జయలలితను యిరకాటంలో నెగ్గిన ఆనందంతో కరుణానిధి బజెట్‌ సమావేశాన్ని మార్చి 25 న ప్రారంభించాడు. ఫైనాన్స్‌ శాఖ కూడా అతని వద్దనే వుంది కాబట్టి బజెట్‌ ప్రసంగం మొదలుపెట్టబోయాడు. దానికి ముందుగానే కాంగ్రెసు నాయకుడు…

జయలలితను యిరకాటంలో నెగ్గిన ఆనందంతో కరుణానిధి బజెట్‌ సమావేశాన్ని మార్చి 25 న ప్రారంభించాడు. ఫైనాన్స్‌ శాఖ కూడా అతని వద్దనే వుంది కాబట్టి బజెట్‌ ప్రసంగం మొదలుపెట్టబోయాడు. దానికి ముందుగానే కాంగ్రెసు నాయకుడు కుమరి ఆనందన్‌ ప్రతిపక్షనాయకురాలిపై పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని, ఆమె సభాహక్కులకు భంగం కలిగించారని అంటూ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తాడు. హోం శాఖ కూడా కరుణానిధి వద్దనే వుంది కాబట్టి సభ దాని గురించి చర్చించాలని స్పీకరును కోరాడు. జయలలిత లేచి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పోలీసులను తనను వేధిస్తున్నారని, తన టెలిఫోన్‌ ట్యాప్‌ చేశారని ఆరోపించింది. తన హక్కులు హరించినందుకు ముఖ్యమంత్రిపై, దురైపై చర్య తీసుకోవాలని స్పీకరును కోరింది. ఆమె యిలా అంటూండగానే ఆమెకు బద్ధవిరోధి, సొంతంగా పార్టీ పెట్టుకున్న పిఎచ్‌ పాండ్యన్‌ లేచి ఆమెపై బూతులు కురిపించాడు. (కొంతకాలానికి జయలలిత ముఖ్యమంత్రి కాగానే యితను ఆమె పాదాలపై పడి పార్టీలో చేర్చుకోమని అడిగాడు), స్పీకరు అతని మాటలను రికార్డుల నుంచి తొలగించాడు. పాండ్యన్‌ మాటలకు కోపం తెచ్చుకున్న ఎడిఎంకె సభ్యులు సభలో గలభా సృష్టించారు. 

స్పీకరు యీ గొడవలో ప్రివిలేజ్‌ మోషన్‌ అనుమతించనన్నాడు. దాంతో ఎడిఎంకె సభ్యులు వెల్‌లోకి ప్రవేశించి అరవసాగారు. అవేమీ పట్టించుకోకుండా కరుణానిధి బజెట్‌ ప్రసంగం చదవడానికి ఉద్యమించగా ''క్రిమినల్‌ ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి బజెట్‌ సమర్పించడానికి తగడు'' అంటూ జయలలిత అరిచింది. దాంతో సహనం కోల్పోయిన కరుణానిధి ''వెళ్లి శోభన్‌బాబును అడుగు'' అన్నాడు. శోభన్‌బాబు ప్రస్తావన రావడంతో జయలలిత అమిత కోపంతో ''వాణ్ని కొట్టండిరా'' అని ఒక్క అరుపు అరిచింది. దాంతో సెంగోట్టయన్‌ కరుణానిధిపై లంఘించి తోసేశాడు. అతని కళ్లజోడు విరిగిపోయింది. అతను తూలి కిందపడబోయాడు. తాము దైవసమానంగా భావించే నాయకుడిపై జరిగిన యీ దాడికి ప్రతీకారంగా డిఎంకె మంత్రులు, శాసనసభ్యులు ఎడిఎంకె సభ్యులపై పడి కొట్టసాగారు. వీళ్లూ తిరగబడి కొట్టారు. ఫైళ్లు, మైకులు, ఫర్నిచర్‌, చెప్పులు ఒకరిపై మరొకరు విసురుకున్నారు. డిఎంకె సభ్యుల్లో చాలామంది జయలలితను లక్ష్యంగా చేసుకుని విసిరారు. ఆమె తలకు, కుడి చేతికి, మోకాలికి, వెన్నుకు గాయాలయ్యాయి. పిడబ్ల్యుడి మంత్రి దురై మురుగన్‌ ఏకంగా జయలలితపై పడి ఆమె కొంగు పట్టుకుని లాగాడు. చీర చిరిగి ఆమె కింద పడిపోయింది. మొత్తమంతా 20 ని||లో సభ ముగిసిపోయింది. 

జయలలిత యీ సంఘటనను పూర్తిగా వినియోగించుకుంది. అలనాటి కురుసభలో పాంచాలికి జరిగిన పరాభవం లాటిది యీ కాలంలో జరిగిందని,  కరుణానిధి దుర్యోధనుడు కాగా, దురైమురుగన్‌ దుశ్శాసనుడని, అతని ఆజ్ఞపై తనను వివస్త్రను చేయబోయాడని, అంతేకాకుండా అసెంబ్లీలో తనపై హత్యాప్రయత్నం జరిగిందని గగ్గోలు పెట్టింది. వెంటనే వెళ్లి ఆసుపత్రిలో చేరింది. దెబ్బ తగిలిందని డాక్టర్లు సర్టిఫై చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తనపై విషప్రయోగానికి ప్రయత్నం జరిగిందని ఆరోపించింది. మార్చి 24 వరకు కరుణానిధిది పైచేయిగా వుంది. కానీ 25 నాటి సంఘటనతో పరిస్థితి తారుమారైంది. కరుణానిధి చేసిన వ్యాఖ్య గురించి చెప్పాలంటే రాజకీయాల్లో పండిపోయిన వ్యక్తి అనవలసిన మాట కాదది. రాజకీయ అసహనానికి తోడు పురుషాహంకారం కూడా ఆ మాటలో తొంగి చూసింది. కరుణానిధి కున్న వ్యవహారాలు కూడా తక్కువేమీ కావు. అతని ఒకప్పటి మిత్రుడు, కవి కణ్ణదాసన్‌ తన ఆత్మకథలో రాసిన ఆంతరంగిక విషయాలలో కరుణానిధిని సచ్ఛీలుడిగా రాయలేదు. అలాటి వ్యక్తి జయలలిత వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనుచితం. దానిపై గొడవ రగిలిన తర్వాత కూడా కరుణానిధి తన వ్యాఖ్యలకు చింతించలేదు. జయలలితపై దాడి చేసిన మంత్రిని శిక్షించలేదు. స్పీకరు చేత 28 మంది ఎడిఎంకె సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేయించాడు కానీ డిఎంకె సభ్యులెవరినీ ఏ విధంగానూ దండించలేదు. తన మాటలకు, తన పార్టీ సభ్యుల ప్రవర్తనకు క్షమాపణ చెప్పి వుంటే ప్రజలు క్షమించేవారేమో. కానీ పశ్చాత్తాపం ప్రకటించకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళల దృష్టిలో కరుణానిధి దిగజారిపోయాడు. 

జయలలిత మహిళగా చాలా అవమానాలు పడింది. ఎన్నికల ప్రచారానికి వెళితే అభిమానం పేరుతో జనాలు మూగి ఆమెను ఎక్కడ పడితే అక్కడ తడిమేసేవారు. ఎమ్జీయార్‌ శవం దగ్గర గంటల తరబడి నిలబడినప్పుడు ఆమెను అక్కణ్నుంచి తరిమివేయడానికి జానకి తాలూకు మహిళలు, వీరప్పన్‌ తాలూకు మహిళలు పక్కకు వచ్చి నిలబడి పాదాలు తొక్కేశారు, గిల్లేశారు, బయటకు తెలియకుండా బూతులు కురిపించారు. అన్నీ దాటుకుని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎదిగినా అక్కడ యిలాటి ఘోర అవమానం జరిగింది – తక్కినవారందరూ సచ్ఛీలురు, ఆమెకు మాత్రమే అలాటి గతం వుందన్నట్లు సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి అలా మాట్లాడడం, మంత్రి హోదాలో వున్న వ్యక్తి మీదపడి అవమానం చేయడం ఎదురైంది. ఈ పరాభవం, ప్రతీకారజ్వాల లోంచి ఒక నాయకురాలు ఉద్భవించింది. మెదడులోంచి పలాయనం ఆలోచనను తరిమివేసి కరుణానిధిని పదవీభ్రష్టుణ్ని చేసేదాకా నిద్ర పోకూడదని, దానికోసం ఎవరితోనైనా సరే రాజీ పడాలని నిశ్చయించుకుంది.

తన అవమానాన్ని ఎత్తిచూపుతూ అసెంబ్లీ చర్చల్లో ఒక మహిళ పాల్గొనే పరిస్థితి ఏర్పడేదాకా తను అక్కడ అడుగు పెట్టనని, పోలీసు పాలన ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తానని  ప్రకటిస్తూ కాంగ్రెసుకు సంకేతాలు యిచ్చింది. అయితే జయలలితతో చేతులు కలుపుతారా అని కాంగ్రెసు నాయకుడు మూపనార్‌ను అడిగితే అతను ఎటూ చెప్పలేదు. కానీ హై కమాండ్‌ జయలలితతో చేతులు కలపాల్సిందే అని ఆదేశాలు పంపింది. ఏప్రిల్‌ 7 న మద్రాసులో రెండు పార్టీలతో కలిపి బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి చిదంబరంను పంపింది. డిఎంకెలో మొన్నటివరకు సభ్యుడిగా వుండి, జయలలితను చెడతిట్టిన సినీనటుడు, దర్శకనిర్మాత అయిన టి.రాజేందర్‌ (నటుడు శింబు తండ్రి) డిఎంకెలో స్టాలిన్‌ ప్రాముఖ్యాన్ని నిరసించి బయటకు వచ్చేసి యీ సమావేశంలో పాల్గొన్నాడు.

ఇదంతా చూసి కరుణానిధి జంకాడు. మేలో జరగవలసిన మద్రాసు కార్పోరేషన్‌ ఎన్నికలను వాయిదా వేసేశాడు. ఎందుకని అడిగితే రంజాన్‌ మాసం వస్తోంది కాబట్టి అన్నాడు! ఈ లోగా ఎడిఎంకె ఉపసభనాయకుడు తిరునావిక్కరసుపై అవినీతి కేసు బనాయించాడు. ఎమ్జీయార్‌ కాబినెట్‌లో హౌసింగ్‌ మంత్రిగా అతను 1987 డిసెంబరులో 73 జివోలు విడుదల చేశాడని, వాటిలో నియమాలు ఉల్లంఘించిన బిల్డర్లు 30 మంది వున్నారని  ఆరోపణ! దానికి బదులుగా తను చేసినదంతా న్యాయబద్ధంగానే వుందని తిరునావిక్కరసు వాదించాడు. జయలలితపై సానుభూతి కనబరచనివారిలో వీరప్పన్‌ ఒకడు. కరుణానిధిపై ఆమె అన్యాయమైన ఆరోపణలు చేస్తోందన్నాడు. అలాటివాడు ఆగస్టులో ఆమె పార్టీలో చేరాడు. అదీ జయలలిత పవర్‌! సశేషం)

ఫోటో – దురై మురుగన్‌ 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

Click Here For Archives