13 ఏళ్ల వనవాసం తర్వాత కరుణానిధికి మళ్లీ అధికారం దక్కడంలో స్థానిక కాంగ్రెసు నాయకుల పాత్ర చాలా వుంది. కరుణానిధి అభ్యర్థుల ఎంపిక నుండి అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అభ్యర్థుల్లో 60 శాతం మంది 25-45 మధ్య వయసువారే, ఉన్నత విద్యావంతులే. అతను కాంగ్రెసుపైనే తన అస్త్రాలు సంధించాడు. రాజీవ్ గాంధీ 'డిఎంకెవి ప్రాంతీయ, విచ్ఛిన్నకర తత్వం, మాది జాతీయ దృక్పథం' అంటూ వాదిస్తే కరుణానిధి మీకు ఢిల్లీ పాలన కావాలా? ఇక్కణ్నుంచే పరిపాలించాలా? అని సమావేశాల్లో అడిగేవాడు. 'కాంగ్రెసు నాయకులైన మూపనార్, చిదంబరం కోటీశ్వరులు. మిమ్మల్ని వాళ్ల గుమ్మాల్లోకి కూడా అడుగుపెట్టనీయరు. మేమైతే మీలో ఒకళ్లం' అని నచ్చచెప్పాడు. డిఎంకె పేపర్లయిన ''మురసొలి'', ''దినకరన్'' పత్రికలు విజయానికి ఎంతో దోహదపడ్డాయి. సుస్థిర పాలన కావాలంటే కరుణానిధే దిక్కు అనే నమ్మకం ప్రబలింది. ఎప్పుడూ ఓట్లేసే బిసిలతో బాటు డిఎంకె అంటే పడని బ్రాహ్మణుల ఓట్లు, ఎప్పుడూ కాంగ్రెసుకు ఓట్లేసే వణ్నియార్ల ఓట్లు పడ్డాయి. వీటన్నిటి కారణంగా ఆ పార్టీకి అనుకూలంగా 4% స్వింగ్ వచ్చింది. దక్షిణ తమిళనాడులో 1977 తర్వాత 12 సీట్లకు మించి పొందని డిఎంకెకు యీసారి 65 వచ్చాయి. మొత్తం మీద 127 సీట్లు ఎక్కువ వచ్చాయి. కాంగ్రెసు, జయలలిత వర్గం చేతులు కలిపి వుంటే వాళ్లకు 146 సీట్లు వచ్చి వుండేవి.
కానీ యిది జరగలేదు. జరగకుండా మూపనార్, చిదంబరం, జయంతీ నటరాజన్ అడ్డుపడ్డారు. వాళ్లకు జయలలిత అంటే పడదు. జయలలితతో పొత్తు పెట్టుకుంటే ఆమె అహంకారాన్ని భరించడం కష్టం అనుకున్నారు. ఈ ముగ్గురికీ కూడా అహంభావం పుష్కలంగా వుంది. జయలలిత నాయకత్వ లక్షణాలపై అందరికీ అనుమానం వుంది. ఎందుకంటే ఎడిఎంకె చీలిక తర్వాత జయలలిత వైపు వచ్చిన పెద్ద్ద నాయకులు నిలవలేదు. ఆమెతో ఒప్పందం కుదుర్చుకుని జానకికి ప్రత్యర్థిగా నిలిచిన పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నెడుంజెళియన్, పన్రూటి ఎస్.రామచంద్రన్, తిరునావిక్కరసు ఆమె నియంతృత్వ నాయకశైలిని విమర్శిస్తూ, ఆమె నిధుల లెక్క సరిగ్గా చెప్పటం లేదని ఆరోపిస్తూ ఆగస్టు నాటికల్లా పార్టీలోంచి బయటకు వచ్చేశారు. అయితే కార్యకర్తల్లో చాలామంది జయలలిత పక్షానే నిలిచారు. విడిగా వచ్చేసినవారు జానకి వర్గంతో చేతులు కలిపి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుందామనుకున్నారు. కానీ వీరప్పన్ కాంగ్రెస్‌తో కంటె డిఎంకెతో చేతులు కలిపే మూడ్‌లో వున్నాడు. వీళ్లు తిరిగి వస్తే మళ్లీ పదవులు అడుగుతారేమోనన్న బెంగ కూడా వుంది. అందువలన అడ్డుకోబోయాడు. చివరకు రానిచ్చాడు. అందరూ కలిసి జయలలితపై దండెత్తి ఆమెను రాజకీయాల్లోంచి తరిమివేస్తే కేవలం మూడు పార్టీలే మిగులుతాయి కదా అనుకున్నారు.
తోడుగా నాయకులు పెద్దగా లేని జయలలితతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని కాంగ్రెసు కేంద్ర నాయకత్వం మీమాంసలో పడింది. ఇంటెలిజెన్సు బ్యూరో రిపోర్టులు తెప్పించి చూశారు. చాలాకాలం ప్రతిపక్షంలో వుండడం చేత డిఎంకె క్యాడర్ తరిగిపోయిందని, డిఎంకె వ్యతిరేక ఓటు కాంగ్రెసుకే వస్తుందని ఐబి అంచనా వేసింది. జయలలిత కూడా తోడైతే గెలుపు ఖాయం అంది. ఒక సీనియర్ కాంగ్రెస్ నేత, ఐబి అధికారి యీ రిపోర్టులతో జులైలో జయలలితను కలిసి మాట్లాడారు. చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు విడతల చర్చలు జరిగేసరికి చిదంబరం, మూపనార్, జయంతి నటరాజన్, వాళప్పాడి రామమూర్తి, మరి కొందరు ఎంపీలు అడ్డుకోవడం ఆరంభించారు. ఒంటరిగా పోటీ చేస్తే యీ సారి పూర్తి గెలుపు సాధ్యం కాకపోయినా క్యాడర్‌కు ఉత్సాహం వుంటుందని, భవిష్యత్తులో అది పనికి వస్తుందని వాదించారు. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు వుండాలని కేంద్రమంత్రి అరుణాచలం, బూటా సింగ్, కుమారమంగళం వాదించారు. రాజీవ్ పన్నెండు మంది ఎంపీలను, బూటా సింగ్‌ను, పివి నరసింహారావును దఫదఫాలుగా పంపి రాష్ట్ర కాంగ్రెసు నాయకులతో కలిసి మాట్లాడి పరిస్థితి అంచనా వేయమన్నాడు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు మూపనార్ కావడం చేత కార్యకర్తలలో పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని మాత్రమే కేంద్ర నాయకులను కలవనిచ్చాడు. వాళ్లు ఢిల్లీ వెళ్లి పొత్తుకు అందరూ వ్యతిరేకం అని చెప్పారు. దీనికి తోడు ఎఐసిసి ఒక కంప్యూటర్ కంపెనీ చేత 42 వేల పోలింగు బూతుల్లో అభిప్రాయ సేకరణ చేయించింది. సర్వే ఫలితాల ప్రకారం జయలలితతో పొత్తు లేకపోతేనే కాంగ్రెసు గెలుస్తుందని ఓటర్లు చెప్పారు. ఓటమి తర్వాత సర్వే ఎందుకు విఫలమైందని ఆరా తీస్తే స్థానిక నాయకులు సర్వే జరిపించకుండా ఉత్తుత్తినే అలా రిపోర్టు యిప్పించారని తేలింది. 70% వరకు గణాంకాలు కిట్టించినవే. కానీ యివన్నీ పరిగణనలోకి తీసుకుని పొత్తు వద్దని రాజీవ్ అనుకున్నాడు. చర్చలు విఫలమయ్యాయి.
ప్రచారసభల్లో జయలలిత ప్రసంగాలకు వస్తున్న స్పందన చూసి పునరాలోచన ప్రారంభమైంది. వెంకట్రామన్కు సన్నిహితుడైన సీనియర్ కాంగ్రెస్ నేత జయలలితతో మాట్లాడి మళ్లీ చర్చలకు ఒప్పించాడు. నవంబరు మొదటి వారంలో రాజీవ్ ప్రతినిథి బూటా సింగ్‌తో మాట్లాడడానికి జయలలిత యిద్దరు నాయకులను ఢిల్లీ పంపింది. రెండు రకాలుగా అనుకున్నారు. మొదటి దాని ప్రకారం జయలలితకు 55% సీట్లు, కాంగ్రెసుకు 45%. ముఖ్యమంత్రి ఎవరో ఎన్నికల తర్వాత తేల్చుకోవాలి. ఇంకో ప్రతిపాదన ప్రకారం సీట్లు 50-50 పంచుకుని జయలలితను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగానే ప్రకటించాలి. ఈ చర్చలు జరుగుతూండగానే మూపనార్-చిదంబరం బృందం వాటిని చెడగొట్టడానికి రాష్ట్ర కార్యకర్తలు మూపనార్‌ను ముఖ్యమంత్రిగా నిర్ణయించారు అనే వార్త స్థానిక పత్రికల్లో వచ్చేట్లు చేశారు. దాంతో ఒళ్లు మండిన జయలలిత తన మధ్యవర్తుల్ని వెనక్కి వచ్చేయమంది. ఆ చర్యకు కినిసిన రాజీవ్ మూపనారే ముఖ్యమంత్రి అని తనే ప్రకటించేశాడు.
ఎన్నికల ఫలితాలు విశ్లేషించినప్పుడు ప్రచారఘట్టంలో చివరి వారంలో డిఎంకె బలం 5-6% పెరిగింది. కాంగ్రెసుకు 28% ఓట్లు వస్తాయని మూపనార్ అంచనా వేయగా 22% వచ్చాయి. చివరి వరకు ఎటూ తేల్చుకోకుండా వున్న ఓట్లు జయలలితకు పడి ఆమెకు 25% వచ్చాయి. కాంగ్రెసుకు మొదట్లో వున్న బలం క్షీణించడానికి కారణం ప్రచారం జరిగిన తీరే. రాజీవ్ సలహాదారులు అతన్ని పూర్తిగా తప్పుదోవ వట్టించారు. తమిళనాడు ప్రజలకు 'కామరాజ్' అంటే అమిత గౌరవం. కామరాజ్ పాలనను తిరిగి తెస్తామని కాంగ్రెస్ అంటూ వచ్చింది. ఆ ఎన్నికలలో రాజీవ్ ఇందిరమ్మ పాలనను తిరిగి తెస్తామని ప్రచారం చేశాడు. ఎడాపెడా సంక్షేమ పథకాల హామీలు గుప్పించాడు. మీరు యిప్పటికైనా జాతీయ దృక్పథం అలవర్చుకోవాలని ఉపదేశాలు దంచి, వాటికి స్పందన రాకపోతే దారుణంగా ప్రాంతీయవాదాన్ని తలకెత్తుకున్నాడు. నెహ్రూ ప్రతిపాదించిన త్రిభాషాసూత్రాన్ని పూర్తిగా రద్దు చేస్తానని హామీ యిచ్చాడు. ఏం చేసినా ప్రజలు ఉత్సాహం కనబరచకపోతే యిక కరుణానిధిపై పడ్డాడు. తన ఉపన్యాసాల్లో ''డిఎంకె నాయకులు ఇందిరా గాంధీని చంపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఎమ్జీయార్‌ను చంపబోయిన వ్యక్తి బంధువులు ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు.'' నేషనల్ ఫ్రంట్ లో భాగస్వామిగా వున్నందుకు తప్పుపడుతూ ''ఖలిస్తాన్ కోసం పోరాడిన వ్యక్తులతో చేతులు కలిపిన డిఎంకె చేతుల్లో తమిళనాడు క్షేమంగా వుండగలదా?'' వంటి వాదనలు చేశాడు.
చివరకు ఏం జరిగింది? రాజీవ్ ప్రచారం చేసిన నియోకవర్గాల్లో 80% చోట్ల పార్టీ ఓడిపోయింది. కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రి కావలసిన మూపనార్‌కు వచ్చిన మెజారిటీ కేవలం వెయ్యి ఓట్లు. సినిమా స్టారు శ్రీదేవి కాంగ్రెసు తరఫున నిలబడిన తన తండ్రి తరఫున, కేంద్రమంత్రి అరుణాచలం తరఫున ప్రచారం చేసినా వాళ్లిద్దరూ ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి జానకి తన భర్త నియోజకవర్గంలో ఒక మామూలు న్యాయవాది చేతిలో ఓడిపోయింది. వీరప్పన్, నెడుంజెళియన్ ఓడిపోయారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన నటీమణి వెన్నిరాడై నిర్మల కూడా ఓడిపోయింది. శివాజీ గణేశన్ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. (సశేషం) ఫోటో – జికె మూపనార్
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)