‘గురువారం’ విడుదలే ఇప్పుడు కలిసొస్తోంది..!

టాలీవుడ్ సినిమాల విడుదల ముహూర్తం క్రమంగా మారుతోంది. శుక్రవారం విడుదల అయ్యే సంప్రదాయాన్ని కాదనుకుని నిర్మాతలు ఇప్పుడు గురువారానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు.  వరసగా గత కొంతకాలంగా పరిస్థితిని చూసినా..మూడువారాల నుంచి విడుదల అవుతున్న సినిమాల…

టాలీవుడ్ సినిమాల విడుదల ముహూర్తం క్రమంగా మారుతోంది. శుక్రవారం విడుదల అయ్యే సంప్రదాయాన్ని కాదనుకుని నిర్మాతలు ఇప్పుడు గురువారానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు.  వరసగా గత కొంతకాలంగా పరిస్థితిని చూసినా..మూడువారాల నుంచి విడుదల అవుతున్న సినిమాల తీరును గమనించినా ఇప్పుడు ఇది స్పష్టం అవుతోంది. గురువారమే సినిమాలను విడుదల చేయడం ద్వారా లాంగ్ వీక్ ను పొందవచ్చనేది నిర్మాతల, దర్శకుల ఆలోచన. సినిమా శుక్రవారం విడుదల అయితే… విడుదల రోజు ఉండే క్రేజ్ తో  పాటు శని, ఆది వారాల వీకెండ్ హోరు కలిసిసొస్తుంది. 

శుక్రవారం వచ్చే సినిమాలకు విడుదల రోజు గనుక పాజిటివ్ బజ్ వచ్చిందంటే… శని, ఆదివారాల కామన్ ఆడియన్ కలెక్షన్లు, వీకెండ్ ను మల్టీ ప్లెక్సుల్లో గడిపేసే వారి కోసం తెగే టికెట్లతో సినిమాలు నిలబడుతున్నాయి.  ఎలాంటి సినిమా అయినా..తొలి వారం కలెక్షన్లను మీద మాత్రమే నిలబడే పరిస్థితులున్న నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలే ఆయువుపట్టుగా మారాయి. ఆ మూడు రోజుల్లో కాసుల వర్షం కురిస్తే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చినట్టు లేకపోతే… రెండో వారానికి సినిమా థియేటర్లలో నిలబడే పరిస్థితి ఉండదు. రెండో వారంతో పుంజుకున్న సినిమాలు..లాంగ్ రన్ మీద నిలబడే సినిమాల జాడే లేకుండా పోయిందిప్పుడు.

అందుకే కొందరు తెలివైన ఫిల్మ్ మేకర్లు శుక్ర, శని, ఆదివారాలకు తోడు గురువారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నారు.  గురువారమే సినిమాలను విడుదల చేస్తే.. రిలీజ్ రోజే సినిమాలను చూసే యావ ఉన్న వాళ్ల కాసుల పంట పండిస్తారు. ఆయా హీరోల అభిమానులు గురువారమే ఉత్సాహంగా థియేటర్లకు వస్తారు. ఇక శుక్రవారం ఉండనే ఉంటుంది. శని, ఆదివారాలు అదనం. శుక్రవారం విడుదలయ్యే సినిమాలకు మూడు రోజుల పాటు మంచిమార్కెట్ ఉంటే.. గురువారం వచ్చే సినిమాలకు నాలుగు రోజులు కలిసొస్తున్నాయి. దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఆ విధంగా ముందుకు పోతున్నారు.