సినీమూలం: సీతారామకల్యాణం- 2

వాల్మీకి రామాయణంలో సీత పుట్టుక గురించి జనకుడు విశ్వామిత్రుడికి రామలక్ష్మణుల ముందు చెప్పినదే,  సీత అహల్యకు చెప్పుకుంటుంది. దాని ప్రకారం జనకుడు భూమిని దున్నుతూ వుండగా భూమిని చీల్చుకుంటూ సీత ఉద్భవించింది. పెట్టె ప్రస్తావన…

వాల్మీకి రామాయణంలో సీత పుట్టుక గురించి జనకుడు విశ్వామిత్రుడికి రామలక్ష్మణుల ముందు చెప్పినదే,  సీత అహల్యకు చెప్పుకుంటుంది. దాని ప్రకారం జనకుడు భూమిని దున్నుతూ వుండగా భూమిని చీల్చుకుంటూ సీత ఉద్భవించింది. పెట్టె ప్రస్తావన లేదు. సీత అంటే నాగేటిచాలు అని అర్థం. నాగేటిచాలు వలన బయటపడింది కాబట్టి ఆమె సీత అయింది. అయితే సీత గత జన్మల గాథగా ''ఆనంద రామాయణం'' లోని మాతులుంగి కథను తీసుకుని ''సీతారామకల్యాణం'' సినిమాలో పెట్టారు. వరగర్వంతో రావణుడు అందర్నీ హింసించడంతో దేవతలు మొరపెట్టడంతో విష్ణువు లక్ష్మీ దేవిని పద్మాక్షుడనే రాజు యింట మాతులుంగి పేరుతో పుట్టమన్నాడు. నారదుడి ప్రేరణతో పద్మాక్షుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. విష్ణువే వచ్చి వరిస్తాడని అనుకున్నాడు. కానీ నారదుడు వెళ్లి రావణుణ్ని రెచ్చగొట్టాడు. అతను ఆమెను చేపట్టబోతూ వుండగా అదృశ్యమైంది. 

ఆనందరామాయణం ప్రకారం రాక్షసులు వచ్చి ఆ మంటపాన్ని నాశనం చేశారు. పద్మ అగ్నిలో దూకింది. రావణుడు వచ్చాడని, ఆమె మాయమైనదని కల్పించినది సినిమావారు. ఆనంద రామాయణం ప్రకారం ఓ సారి రావణుడు విమానంలో విహరిస్తూ వుంటే పద్మ అగ్నిలోంచి బయటకు వచ్చి విహరిస్తోంది. అతను చెరపట్టబోయాడు. ఆమె మళ్లీ అగ్నిలోకి దూకింది. అతను అగ్నికుండం వెతికితే ఆమె దేహం ఐదు రత్నాల రూపంలో దొరికింది. దాన్ని ఒక పేటికలో పెట్టి తనతో లంకకు తీసుకెళ్లాడు. 

సీతారామకళ్యాణం సినిమాలో యీ మధ్యలో వేదవతి కథ పెట్టి అప్పుడు పెట్టె కథ పెట్టారు. వేదవతి ప్రస్తావన దేవీ భాగవతంలో వుంది.  దాని ప్రకారం లక్ష్మీదేవి ధర్మధ్వజుడనే రాజుకి తులసిగా, అతని సోదరుడైన కుశధ్వజునికి వేదవతిగా పుట్టింది. వేదవతిని శంభుడనే రాక్షసుడు కామించాడు. కానీ యీమె తీవ్రదృక్కులకు భస్మమై పోయాడు. తర్వాత రావణుడు వేదవతిని చూసి వాంఛించాడు. ఈ సారి వేదవతి భస్మమై పోయింది. అతను ఆ భస్మాన్ని లంకకు తీసుకెళ్లాడు. ''సీతారామకళ్యాణం'' సినిమాలో అక్కడ మాయమైన పద్మాక్షుడి కూతురు కుశధన్వుడనే ముని వాకిట ప్రత్యక్షమౌతుంది. అతను వేదవతి అని పేరు పెట్టి తపస్సు చేసుకోమంటాడు. అక్కడకు రావణుడు వస్తాడు. దీని తర్వాత తీసిన ''సంపూర్ణ రామాయణం'' సినిమాలో పద్మాక్షుడి కథ తీసేసి, వేదవతి కథ మాత్రం చూపించారు. 

వేదవతి భస్మం లంకకు వచ్చాక అనర్థాలు జరిగాయని, అందువలన మండోదరి వేరే చోట పాతి పెట్టించిందని, ఆమెయే సీతగా మారి లంకకు వచ్చి నాశనం చేసిందని ఆనంద రామాయణంలోనూ, దేవీ భాగవతంలోనూ వుంది. ఈ కథలేవీ వాల్మీకి రామాయణంలో లేవు. కానీ యీ సినిమాల్లో రావణుడు పూజ చేస్తూ వుంటే హఠాత్తుగా చేతిలో పువ్వు ఆవిర్భవించి, దానిలో పసిపాప పుట్టుకొచ్చిందని చూపించారు. రాక్షసులు పసిపాపను పెట్టిన ఆ పెట్టెను తీసుకుని వెళ్లి జనకుడి రాజ్యంలో ఓ పొలంలో పాతి పెట్టినట్లు చూపించారు. జనకుడు పొలం దున్నుతూ వుంటే పెట్టె, దానిలో పాప దొరికాయి.  బ్రహ్మవైవర్త రామాయణంలోనూ, ఆనంద రామాయణంలోనూ యిలా పెట్టెలో దొరికినట్టుగానే వుంది. 

యాగం జరుగుతూండగానే మారీచసుబాహులు భగ్నం చేయబోయారు. రాముడి బాణాలకు సుబాహుడు చచ్చిపోయాడు. మారీచుడు సముద్రతీరంలో పడ్డాడు. అయితే సీతారామకల్యాణంలో వేరేలా చూపించారు. దెబ్బ తగిలిన మారీచుడు సరాసరి రావణుడి వద్దకు వెళ్లి రాముడి గురించి చెప్తాడు. నిజానికి వాల్మీకి ప్రకారం రావణుడికి యీ ఘట్టంలో రాముడి గురించి గాని, సీత గురించి గాని తెలియదు. కానీ సీతారామకల్యాణంలోను, సంపూర్ణరామాయణంలోను నారదుడు వచ్చి ఆదిలక్ష్మియే సీతాదేవిగా ఉద్భవించింది కాబట్టి స్వయంవరంలో పాల్గొనమని పురికొల్పినట్టు చూపించారు. చిన్నపిల్లగా వున్న సీత శివధనస్సు ఎత్తేసిందని, అరుంధతి సీతకు శాపం యిచ్చిందని, ఆమె సలహా మేరకు స్వయంవరం ప్రకటించాడని జనకుడు ప్రకటించాడని,  ''సీతారామకల్యాణం'', ''సంపూర్ణ రామాయణం'' సినిమాలలో చూపించినట్టుగా వాల్మీకి రామాయణంలో లేదు. అంతేకాదు,   

రామలక్ష్మణులను యాగరక్షణకు తీసుకెళ్లిన విశ్వామిత్రుడు వారిని మిథిలా నగరంలో జనకుడు ఓ యజ్ఞం చేస్తున్నాడు చూద్దాం రండి అంటూ తీసుకెళ్లాడు. దారిలో గంగావతరణం గురించి, శివధనుస్సు గురించి కథలు చెప్పాడు. దారిలోనే అహల్య వృత్తాంతం కూడా. అహల్యను పెళ్లి చేసుకుందామని ఇంద్రుడు అనుకుని భంగపడ్డాడని యీ సినిమాల్లో చూపిన కథ వాల్మీకి రామాయణంలో లేదు. తన భర్త వేషంలో వచ్చినవాడు ఫలానా అని ఆమె గ్రహించింది అయినా దారి తప్పింది. భర్త ఆమెను 'కూడూ నీళ్లూ లేకుండా బూడిదలో పొర్లాడుతూ, తపస్సు చేస్తూ యిక్కడే పడివుండు' అని శపించాడు తప్ప రాయి అయిపోమనలేదు. రాముడి పాదం తగిలి ఆమె మనిషి అయిందన్న కథ కట్టుకథే. రాముడి రాకతో ఆమె పరిశుద్ధ అయింది అంతే.  

పెళ్లికి ముందు సీతారాములు ఒకరినొకరు చూసుకొనలేదు. రాముడు బజార్లో వెళుతూంటే వుంటే సీత చూసిందనీ, స్వయంవరానికి దండ పట్టుకుని వచ్చిందని యివన్నీ తులసీదాసు రాసిన రామచరితమానస్‌లో వుంది.  దాన్ని యీ సినిమాలలో చూపించారు. అంతేకాదు, స్వయంవరం గురించి  తెలిపి ఆహ్వానించినట్టుగా ''సీతారామకల్యాణం''లో నారదుడు వచ్చి చెప్పినట్టుగా ''సంపూర్ణ రామాయణం''లో పెట్టారు. వాల్మీకి రామాయణం ప్రకారం యాగం కోసం విశ్వామిత్రుడితో వచ్చిన రామలక్ష్మణులకు జనకుడు సీత పుట్టుక గురించి చెప్పి, ఆమె పెళ్లి గురించి తను పడ్డ అవస్థ చెప్పాడు. సీతను వరించి చాలామంది వచ్చారు. శివధనుస్సు ఎక్కుపెట్టినవారికే కన్యనిస్తానన్నాడీయన. వారికి చేతకాలేదు. ఇలా ఫెయిలైనవాళ్లందరూ ఏకమై మిథిలానగరాన్ని ముట్టడించారు. ఒక సంవత్సరం పాటు ముట్టడి సాగింది. అప్పుడు జనకుడు తపస్సు చేసి దేవతల సాయంతో వాళ్లను తరిమివేశాడు. ఇవన్నీ చెప్పి రాముడికి చూపించడానికి అది తెప్పించాడు. రాముడు అల్లెత్రాడు ఎక్కించి బాణం వదలబోతూ వుంటే ధనస్సు ఫెళ్లున విరిగిపోయింది. అప్పుడు జనకుడు 'యితను వీరుడు, యితనికి సీతను యిస్తాను' అన్నాడు. ఇదీ వాల్మీకి రాసినది. ''సీతారామకళ్యాణం''లో అయితే రావణుడు ఏకంగా స్వయంవరానికి వచ్చి విఫలమైనట్లు చూపించారు.  ''సంపూర్ణ రామాయణం''లో కూడా యీ ఘట్టం పెట్టారు.

''సీతారామకళ్యాణం''లో యింకో సీను పెట్టారు. జన్మజన్మలుగా లక్ష్మీదేవిని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న రావణుడు స్వయంవరంలో భంగపడి, మాయోపాయంతోనైనా ఆమెను వశపరుచుకోవాలని రాముడి వేషంలో వస్తాడు. అయితే రాముణ్ని వలచిన శూర్పణఖ సీత వేషంలో అతని దగ్గరకు వస్తుంది. ఇద్దరూ కలిసి విహరించిన తర్వాత చివర్లో యిద్దరి మారువేషాలూ బయటపడతాయి. ఇది ఏ పురాణంలోనూ వున్నట్టు లేదు. శూర్పణఖ రాముణ్ని యీ దశలో చూడనే చూడదు.

వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు శివధనస్సును విరిచిన తర్వాత జనకుడు నా కూతుర్ని యిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి దశరథుని అనుమతి కోసం దూతలను పంపాడు. దశరథుడు ఒప్పుకుని పెళ్లి కోసం తరలి వచ్చాడు. జనకుడు యజ్ఞం పూర్తి చేసి రేపు పెళ్లి చేస్తానన్నాడు. తన తమ్ముడు కుశధ్వజుణ్ని పిలిపించాడు. అతను తన కూతురు ఊర్మిళను లక్ష్మణుడికి ప్రతిపాదించాడు. అప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు కుశధ్వజుడి మరో యిద్దరు కూతుళ్లయిన మాండవి, శ్రుతకీర్తిలను భరత శత్రుఘ్నులకు యిస్తే మంచిదని సూచించారు. పెద్దలు సరేనన్నారు. నలుగురి పెళ్లి ఒకే పందిట్లో జరిగిపోయింది. 

ఇంత ఘనంగా పెళ్లి జరిగిన కొన్నాళ్లకే వనవాసం, ఆ పైన ఏడాది ఎడబాటు, తిరిగి వస్తే అగ్నిపరీక్ష.. యిదేం సంసారసుఖం అనుకోవద్దు. రాజసౌధంలో వున్నా, వనవాసంలో వున్నా ఒకరిపై మరొకరికి ప్రేమ తరగకుండా వుండడమే దాంపత్యవిజయం. పట్టాభిషేకం మిస్సయిపోగానే అదేదో పూర్తి చేసుకుని రా, అప్పటిదాకా నేను పుట్టింట్లో వుంటాను అనలేదు సీతమ్మ. సీతను విడిచి వుండలేను అన్న రాముడు అగ్నిపరీక్షకు గురి చేయడమేమిటని అంటూంటారు. అది తనకోసం కాదు. పబ్లిక్‌ కోసం. ఎంతటివాళ్లయినా సరే పబ్లిక్‌ స్క్రూటినీకి తలవొగ్గాలి అని రాముడి ప్రిన్సిపుల్‌. ప్రస్తుత ప్రపంచంలో నాయకులను చూస్తున్నాం. అవినీతి కేసులు ఎవరిమీదనైనా పెట్టవచ్చు కానీ ఫలానా ఫలానా పదవుల వారికి ఎగ్జంప్షన్‌ వుంది. వారిని వేలెత్తి చూపకూడదు అని చట్టాలు రాసేసి వాటి వెనక్కాల దాగుంటున్నారు. ఇలాటి నాయకులకు అలవాటు పడిపోయిన మనకు రాముడి లాజిక్‌ను అర్థం చేసుకోవడం కష్టమే మరి. ఏది ఏమైనా ఎన్ని తర్కవితర్కాలున్నా సీతారాములంటే అన్యోన్య దాంపత్యం అనే సూక్తి,  రాముడు అంటే మంచి బాలుడు అనే నానుడి స్థిరమై పోయాయి. రామాయణంలో చెప్పిన మానవసంబంధాలు, వాటి విలువలు మనం మన్నిస్తూనే వున్నాం. సాధ్యమైనంతవరకూ ఆచరిస్తూనే వున్నాం. (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Part-1