ఐదొంద‌లు ర‌ద్దు.. వెయ్యి నోటు..? కాదంటే!

దేశంలో క‌రెన్సీ నోట్ల గురించి ఉన్న‌వీ లేనివీ గ‌ట్టిగా ప్ర‌చారానికి నోచుకుంటూ ఉన్నాయి. ప్ర‌త్యేకించి ఉన్న‌ఫ‌లంగా ప్ర‌ధాన‌మంత్రి మార‌కంలోని ఐదు వంద‌లు, వెయ్యి రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేసిన ద‌గ్గ‌ర నుంచి ర‌క‌ర‌కాల ప్ర‌చారాల‌కు…

దేశంలో క‌రెన్సీ నోట్ల గురించి ఉన్న‌వీ లేనివీ గ‌ట్టిగా ప్ర‌చారానికి నోచుకుంటూ ఉన్నాయి. ప్ర‌త్యేకించి ఉన్న‌ఫ‌లంగా ప్ర‌ధాన‌మంత్రి మార‌కంలోని ఐదు వంద‌లు, వెయ్యి రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేసిన ద‌గ్గ‌ర నుంచి ర‌క‌ర‌కాల ప్ర‌చారాల‌కు ఆస్కారం ఏర్ప‌డుతూ ఉంది. రెండు వేల రూపాయ‌ల నోటు గురించి అది ర‌ద్దు కాబోతోంద‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య గ‌ట్టిగా జ‌రిగింది. 

దాదాపు రెండేళ్ల నుంచి ఆ ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగింది. దీనిపై ప‌లువురు పార్ల‌మెంటేరియ‌న్లు కేంద్ర ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంట్ లోనే అడిగారు. రెండు వేల రూపాయ‌ల నోటును ర‌ద్దు చేసే ఉద్దేశం ఉందా.. అంటూ ఆరా తీశారు. అయితే అదేం లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

అయితే ఆ నోట్ల ముద్ర‌ణ మాత్రం దాదాపు ఆగిపోయిన‌ట్టుగా కేంద్రం అప్ప‌ట్లోనే క్లూలు ఇచ్చింది. ర‌ద్దు చేయం.. అని మాత్రం చెప్పింది. అలా చెప్పినా.. ఆ త‌ర్వాత కేంద్రం మార‌కంలోని రెండు వేల రూపాయ‌ల నోట్ల‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఆ నోట్ల‌ను వెన‌క్కు తీసుకోవ‌డానికి గ‌డువు స‌మ‌యం కొన‌సాగుతూ ఉంది. మ‌రి పార్ల‌మెంట్ లోనేమో.. రెండు వేల నోటును ర‌ద్దు చేసే ఉద్దేశం లేదంటూ చెప్పినా.. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేసింది. అలా పుకార్లే నిజం అయ్యాయి.

ఇంత‌లో.. ఇప్పుడు మ‌ళ్లీ వెయ్యి నోటు రాబోతోంద‌నే ప్ర‌చారం ఒక‌టి సాగుతూ ఉంది. డీమానిటైజేష‌న్ కు ముందు వెయ్యి రూపాయ‌ల నోటు మార‌కంలో ఉండేద‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెళ‌పెళ‌మ‌నే వెయ్యి నోట్ల‌ను లెక్క‌బెట్ట‌డం అయినా, వైట్ ష‌ర్ట్ లో ప్యాకెట్ లో ఆ రంగుల నోటు మెర‌వ‌డం అన్నా.. అదో గ్లామ‌ర్! దాన్ని ర‌ద్దు చేశారు న‌రేంద్ర‌మోడీ. మ‌రి ఇటీవ‌ల రెండు వేల రూపాయ‌ల నోటు ర‌ద్దు చేయ‌డంతో.. ఐదు వంద‌ల రూపాయ‌ల నోటు మాత్ర‌మే మార‌కంలో అతి పెద్ద‌దిగా మిగిలింది. 

ఇలాంటి నేప‌థ్యంలో.. వెయ్యి నోటు తిరిగి రానుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. అయితే కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేద‌ని అంటోంది. పార్ల‌మెంట్ లోనే ఈ ప్ర‌క‌ట‌న చేసింది. వెయ్యి రూపాయ‌ల నోటును తిరిగి తీసుకు వ‌చ్చే ఉద్దేశం ప్ర‌స్తుతానికి లేద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. అలాగే ఐదు వంద‌ల రూపాయ‌ల నోటును ర‌ద్దు చేసే ఉద్దేశం కూడా లేద‌ని చెప్పింది. మ‌రి క‌రెన్సీ నోట్ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ లో ఏం చెప్పినా.. రూమ‌ర్ల‌కు అయితే ఆస్కారం ఉండనే ఉంది. ఇది వ‌ర‌క‌టి రూమ‌ర్లే నిజం కావ‌డంతో.. ప్ర‌జ‌లు కేంద్రం ప్ర‌క‌ట‌న‌ల‌ను అంత తేలిక‌గా న‌మ్మేసే అవ‌కాశాలు త‌క్కువే!