ఎమ్బీయస్‌: గోడ్సేని ఎలా చూడాలి? – 26

1948 జనవరి నాటికి యీ సంఘటనలు యింకా జరగలేదు. కానీ అంతర్జాతీయ సమాజం దృక్కోణం, ఆలోచనాధోరణి ఎలా వుంటుందో మనకు ఒక సంకేతం యిస్తున్నాయి. పాకిస్తాన్‌కు మనం యివ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టినా, వాయిదా వేసినా…

1948 జనవరి నాటికి యీ సంఘటనలు యింకా జరగలేదు. కానీ అంతర్జాతీయ సమాజం దృక్కోణం, ఆలోచనాధోరణి ఎలా వుంటుందో మనకు ఒక సంకేతం యిస్తున్నాయి. పాకిస్తాన్‌కు మనం యివ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టినా, వాయిదా వేసినా వారు ఫిర్యాదు చేస్తే బ్రిటిషు ప్రభుత్వమో, కామన్వెల్త్‌ దేశకూటమో, ఐక్యరాజ్యసమితో, మరోటో కలగజేసుకునేది. అప్పుడే కాదు, యిప్పటికీ వారందరికీ పాకిస్తాన్‌ అంటే వల్లమాలిన ప్రేమ. పాపం చిన్నదేశం, భారత్‌తో ఎలా వేగుతోందో అంటూ దాని పక్షాన మాట్లాడతారు. దక్షిణాసియా ప్రాంతంలో భారత్‌ పెద్దన్న పాత్ర పోషిస్తూ అందర్నీ అదిలిస్తోందనే యిమేజి సృష్టిస్తారు. ఎందుకిలా అంటే నాకూ తెలియదు. సైకిలు వాడు రాంగ్‌సైడ్‌లో వచ్చిన కారును గుద్దినా జనాలు సైకిల్నే సమర్థిస్తారు. బ్రేకులు వేయలేకపోయావా అని కారువాణ్ని అదలిస్తారు. పిల్లలు కొట్టుకుంటూ వుంటే తలిదండ్రులు ఎప్పుడూ పెద్దవాణ్నే మందలిస్తారు. 'తమ్ముడు చిన్నవాడు కదా తెలియక చేశాడు, నువ్వు సర్దుకో.., నీ బొమ్మేలే, కాస్సేపు అడుకుని యిచ్చేస్తాడు' అంటూ పెద్దవాడికి సుద్దులు చెప్తారు. అంతర్జాతీయ వేదికలపై కూడా యిలాటి మెంటాలిటీయే వుందనుకుంటాను. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం లేదు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, చీటికిమాటికీ తగాదాలు పెట్టుకుంటోంది, అయినా దానికి అంతర్జాతీయంగా సానుభూతి లభిస్తోంది. ముస్లిము దేశాలు మాత్రమే మద్దతు యిస్తూ వుంటే మతం కారణంగా అనుకోవచ్చు, అమెరికా, రష్యా.. అన్నీ దానికి దన్నుగా నిలబడతాయి. అమెరికాలో అయితే పాకిస్తాన్‌ లాబీ ఎప్పుడూ పనిచేస్తూనే వుంటుంది. దానికి నిధులు అందేట్లు చేస్తుంది. అమెరికా సైనికస్థావరాలకు చోటిచ్చింది కాబట్టి అనుకుని సర్దిచెప్పుకున్నా, మరి రష్యా సంగతేమిటి? అది బలంగా వుండే రోజుల్లో ఇండియాను, పాకిస్తాన్‌ను సమదృష్టితో చూసేది. మనకు సాయం చేసినట్లే వాళ్లకీ చేసేది. అంతర్జాతీయ సంస్థల్లో, యితర దేశాల్లో లాబీయింగ్‌ చేయడంలో ఇండియా వెనకబడి వుందని నిపుణులు చెప్తూ వుంటారు. 

దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా యిలా వుంటే 1947లో పరిస్థితి ఎలా వుందో వూహించి చూడండి. అప్పుడు ప్రపంచంలో చాలాభాగం బ్రిటిషు నిర్వహణలో వుండేది. వాళ్లేం ప్రచారం చేస్తే అదే వేదం. వాళ్లు ఏం చెప్తున్నారు? అవిభక్త ఇండియాలో హిందువులు ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నారు. బ్రిటిషు వాళ్లు వెళ్లిపోయాక హిందువులు తమను అణగదొక్కేస్తారన్న భయంతో, తమకు రక్షణ వుండదనే భీతితో ముస్లిములు వేరే దేశం కావాలంటున్నారు. హిందువులు దానికి అడ్డుపడ్డారు. తామే మొత్తం పాలించాలని, ప్రజాస్వామ్యం పేరుతో అధికసంఖ్యలో వున్న తామే ఎల్లకాలం పాలించాలనే ఉద్దేశంతో వున్నారు. ధర్మబుద్ధిగల ప్రభువులు కాబట్టి బ్రిటిషువారు ముస్లిములకు విడిగా దేశం ప్రసాదించి మరీ తప్పుకుంటున్నారు. భారత్‌లో వుండిపోవడానికి నిశ్చయించుకున్న ముస్లింలను హిందువుల ప్రభుత్వం పీడించకుండా వారిపై నైతికపరమైన ఒత్తిడి తేవడానికి కామన్‌వెల్త్‌ కూటమిలో భారత్‌ చేరాలని బ్రిటన్‌ షరతు విధించింది… యీ తరహాలో వుంది వారి ప్రచారం. ఇలాటి పరిస్థితుల్లో ఇండియా పాకిస్తాన్‌కు న్యాయప్రకారం, ఒప్పందం ప్రకారం యివ్వవలసిన రూ.55 కోట్లు ఎగ్గొట్టినా, వాయిదా వేసినా ఇండియా యిమేజి ఏమవుతుంది? నా ఉద్దేశం – గాంధీ ఆలోచనలు యీ విధంగా సాగివుంటాయి. కానీ ఆనాటి కాంగ్రెసు నాయకులు కానీ, ప్రజలు కానీ యీ దృష్టితో చూడలేదు. ఈనాటికీ 99% భారతీయులు గాంధీని యీ విషయంలో తప్పుపడతారనే నా వూహ. 

మహాభారతంలో ధర్మరాజు పాత్ర అడుగడుగునా విమర్శకు గురవుతూంటుంది. భీమార్జునులు అతనిపై అనేకసార్లు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ద్రౌపది ఐతే చెప్పనే అక్కరలేదు. పాండవులు వనవాసంలో వుండగా దుర్యోధనుడు సపరివారంగా ఘోషయాత్రకు వచ్చాడు. గంధర్వులు అతన్ని, తమ్ములను, రాజస్త్రీలను బందీలుగా పట్టుకుపోతే అతని మంత్రులు వచ్చి పాండవుల సాయం కోరారు. భీముడు 'కాగలకార్యం గంధర్వులే చేశారు' అని చంకలు గుద్దుకున్నాడు. కానీ ధర్మరాజు 'జ్ఞాతుల మధ్య భేదాలు, కలహాలు సహజమే. శత్రుత్వాలు ఏర్పడుతాయి. కానీ వంశధర్మం నశించదు. మనలో మనకు వైరుధ్యమేర్పడితే మనం అయిదుగురం, వారు నూర్గురు, ఇతరులు అవమానిస్తూంటే మనం నూటఅయిదుగురం.' అని చెప్పి విముఖులుగా వున్న భీమార్జునులకు నచ్చచెప్పి పంపి కౌరవులను రక్షించాడు. అజ్ఞాతవాసం, అభిమన్యుడి వివాహం జరిగాక శ్రీకృష్ణుడు సలహా మేరకు పాండవులు ద్రుపదుని పురోహితుణ్ని కౌరవుల వద్దకు రాయబారిగా పంపారు. తాము రాజులందరినీ జయించి స్వయంగా సంపాదించిన ధనాన్ని, రాజ్యాన్ని మాత్రమే పాండవులు కోరారు. అది కౌరవపక్షపాతి అయిన బలరాముడికి కూడా రుచించింది. నిజానికి సంధి కుదిరివుంటే ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో భీమార్జునులు చేసిన ప్రతిజ్ఞలు ఎలా నెరవేరుతాయి? అవి నెరవేరాలంటే ఎకాయెకీ యుద్ధానికి వెళ్లిపోవాలి. కానీ పాండవులు వెళ్లలేదే! వెళ్లి వుంటే తమ స్వార్థం కోసం రక్తాన్ని ఏరులై పారించారని సమస్త రాజలోకం వారిని తప్పుపట్టేది. 

ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలుసు. అందువల్లనే సమాధానంగా సంజయుణ్ని పంపించాడు. 'కౌరవులు, పాండవులు, యింకా యిక్కడ వున్న రాజన్యులు అంతా క్షేమంగా వుండే విధంగా నీ ప్రతిభతో నీవే యీ సమస్యను పరిష్కరించాలి' అని తన మాటగా ధర్మరాజుకి చెప్పించాడు. ఇదీ లౌక్యం. అందరూ క్షేమంగా వుండేట్లా చూడాలి అంటూ బంతిని ధర్మరాజు గడిలోకి నెట్టేశాడు తప్ప ఏమీ ఆఫర్‌ చేయలేదు. పైగా 'యుద్ధం చేస్తే అందరికీ నాశనం కలిగిస్తుంది. జ్ఞాతులను చంపి రాజ్యం పొందినా ఆ తర్వాతి జీవితం మరణంతో సమానం. పాండవులు ధర్మరహితమైన పనిని ఎలా చేస్తారు?' అంటూ ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దానికి ధర్మరాజు 'నేను యుద్ధాన్ని కోరుతున్నట్లు ఎపుడైనా అన్నానా? యుద్ధం లేకుండా లభించేది చిన్నదైనా దాన్ని నేను పెద్దదిగానే భావిస్తాను. పాండవులకు రాజ్యం యివ్వకపోతే క్షేమం కాదనే సంగతి ధృతరాష్ట్రుడు తెలుసుకోవాలి. శాంతి కావాలంటే ఇంద్రప్రస్థంలో నా రాజ్యం వుండాలి. దుర్యోధనుడు అక్కడి నా రాజ్యం నాకు తిరిగి యివ్వాలి' అని బదులిచ్చాడు. దానికి సంజయుడు 'యుద్ధం లేకుండా దుర్యోధనుడు రాజ్యం యిస్తాడనుకోను. నీలాటి ఉత్తముడు యుద్ధం వంటి పాపపు పని చేయవద్దు. దైవం నీ పక్షాన లేడని మీ అరణ్యఅజ్ఞాతవాసాలే నిరూపించాయి.' అని సలహా యిచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కలగజేసుకుని ''పాండవులు శాంతికైనా, యుద్ధానికైనా సిద్ధమే'' అని చెప్పాడు. చివరిమాటగా ధర్మరాజు సంజయుడితో ''అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం అనే నాలుగు వూళ్లతో బాటు నీకు యిష్టమైన ఏదో ఒక గ్రామం కలిపి ఐదు గ్రామాలు యిచ్చినా సంధి కుదురుతుంది.'' అని చెప్పి పంపించివేశాడు. 

నిజానికి అప్పటికే కురుపాండవులు యుద్ధప్రయత్నాలు చేసేసుకుంటున్నారు. అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుడి వద్దకు వెళ్లడం, సాయం కోరడం అన్నీ జరిగాయి. అయినా ధర్మరాజు, ధృతరాష్ట్రుడు సౌమ్యవచనాలు పలుకుతూనే వున్నారు. అదీ రాజధర్మం. పరిస్థితి ఎటూ తేలకుండా వున్నపుడు కృష్ణుడు ఆఫర్‌ చేశాడు – ఉభయపక్షాల క్షేమం కోరి నేను కురురాజసభకు వెళతాను అని. నీకు హాని కలుగుతుందేమో వద్దు అన్నాడు ధర్మరాజు. 'సంధికి ప్రయత్నిస్తే లోకంలోని  ఏ రాజుకు మనలను తప్పుపట్టే అవకాశం వుండదు' అని కృష్ణుడు నచ్చచెప్పాడు. కృష్ణుడు రాయబారానికి బయలుదేరుతూ వుంటే సహదేవుడు, ద్రౌపది మాత్రమే యుద్ధం జరిగితీరాలన్నారు. తక్కిన అందరూ సంధి కుదిరితే మంచిదన్నారు. ధర్మరాజుకు క్షేత్రవాస్తవాలు తెలుసు. కురుక్షేత్రంలో కౌరవులు తమ తరఫున 11 అక్షౌహిణుల సైన్యం సమీకరించుకోగలిగితే (తెలుగువారు కౌరవుల పక్షానే పోరాడారట. మనదెప్పుడూ ఓడే పక్షమే) పాండవుల తరఫున పోట్లాడడానికి 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే సమకూరింది. కృష్ణరాయబారం, దాని పర్యవసానం మనందరికీ బాగా తెలుసు. వివరణ అక్కరలేదు. యుద్ధంలోకి దిగాక అంతా పాండవులు అనుకున్నట్టే జరగలేదు. వాళ్ల పిల్లలు సైతం మరణించారు. కృష్ణుడు ఎన్నో మాయోపాయాలు పన్ని వాళ్లను కాపాడుతూ వచ్చాడు. కర్ణుడు ధర్మరాజును చావగొట్టి చెవులుమూసినపుడు ఉక్రోషంతో ధర్మరాజు అర్జునుణ్ని, అతని గాండీవాన్ని తిట్టిపోశాడు. తన గాండీవాన్ని తిట్టినవాణ్ని చంపుతానని అర్జునుడి ప్రతిన వుంది. అందుకోసం కత్తి దూస్తే అప్పుడు కృష్ణుడు పెద్దవాళ్లని నిందిస్తే చంపినట్లే లెక్క, మీ అన్నని తిట్టేయ్‌ అన్నాడు. అప్పుడు అర్జునుడు చెలరేగి పోయి తన మనసులోని అక్కసంతా వెళ్లగక్కాడు – 'నీ రాజ్యాధిపత్యాన్ని నేను అంగీకరించటం లేదు. జూదమాడి, మమ్మల్ని కష్టాలపాలు చేసి యిప్పుడు మా ద్వారా శత్రువును జయించాలని చూస్తున్నావు. ఇప్పుడు ఎంతో మంది చచ్చిపోతున్నారు. దీనికంతా కారణం నీ వ్యసనం. మేము నీ ద్వారా పొందిన సుఖమంటూ ఏమీ లేదు. ద్రౌపది శయ్యపై కూర్చుని నన్ను పరాభవించవద్దు.' అని. 

చెప్పదలచినదేమిటంటే ధర్మరాజు తమ్ముళ్లకు అతనిపై ఎన్నో ఫిర్యాదులున్నాయి. కానీ సమయానుకూలంగా వ్యవహరించ దగిన కుశలత ధర్మరాజు వద్దే వుంది. కురువృద్ధుల వద్ద అతని మాటకే విలువ వుంది. భీమార్జునుల మాటకు కాదు. భీమార్జునులు ఎంత పరాక్రమవంతులైనా ధర్మరాజు పద్ధతే జయించింది. చివరకు అతడే రాజయ్యాడు.  అది డిప్లమసీ. స్టేట్స్‌మన్‌షిప్‌. ఇలాటి పెద్దమనిషి తరహా వలన కీడు కలిగిన సందర్భాలూ వున్నాయి. సైంధవుడు ద్రౌపదిని ఎత్తుకుపోయినపుడు భీమార్జునులు అతన్ని చంపడానికి వెళుతూంటే ధర్మరాజు 'ఆ సైంధవుడు దురాత్ముడయినప్పటికినీ గాంధారిని, దుశ్శలను తలచుకొని చంపకూడదు' అన్నాడు కానీ ద్రౌపది 'మీరు నాకు ప్రియం చేయదలచుకుంటే వాణ్ని చంపండి' అంది. భీమార్జునులు యిష్టం లేకపోయినా ధర్మరాజు మాటే విన్నారు. అతన్ని అవమానించి వదిలివేశారు. కానీ సైంధవుడు శివుణ్ని మెప్పించి, వరం పొంది పద్మవ్యూహ వేళ పాండవుల్లో నలుగురిని అడ్డగించి, అభిమన్యవధకు కారకుడయ్యాడు. మన తెలుగు సినిమాల్లో భీమార్జునులకు యిచ్చిన ప్రాముఖ్యత ధర్మరాజుకి యివ్వరు. రాజనీతిజ్ఞతలో, లౌక్యంగా మాట్లాడడంలో ధృతరాష్ట్రుడికి దీటైనవాడు ధర్మరాజే. సాధారణ ప్రజలకు భీమార్జునులు హీరోల్లా, అనుసరణీయుల్లా కనబడతారు. కానీ నిజానికి ధర్మరాజు వద్ద చాలా (జూదం కాదు) నేర్చుకోవాలి. 

మనం యిప్పటికీ సంయమనం, శత్రువు పట్ల సహనం ప్రదర్శించే నాయకుడిపై మండిపడతాం. ప్రజల సెంటిమెంటును, ఆవేశకావేషాలను సొమ్ము చేసుకుందామనుకునే నాయకులు వాళ్లను ఎడ్యుకేట్‌ చేయకపోగా వాళ్లు చెప్పినట్లు ఆడతారు. స్టేట్స్‌మన్‌ అయిన నాయకుడు 'ఇది పద్ధతి కాదు' అని వాళ్లకు చెప్పగలుగుతాడు. దానివలన ప్రజాభిమానం పోతుందని భయపడడు. 'కర్నూలును రాజధానిని చేస్తే విజయవాడ వాసులు మీ విగ్రహం పగలకొడతారట' అని ప్రకాశంగారికి చెప్తే 'కొట్టుకోమను, దాన్ని పెట్టమని నేనడిగానా?' అన్నాడాయన. అదీ గట్స్‌ అంటే. ఇప్పుడు అలాటి నాయకులు లేరు. స్టేట్స్‌మెన్‌ లేరు. రాష్ట్రవిభజన తర్వాత ప్రాంతీయ ప్రయోజనాలకు అతీతంగా న్యాయం మాట్లాడి, వివాదాలు పరిష్కరించగల అలాటి స్టేట్స్‌మన్‌ కోసం నేను ప్రార్థిస్తున్నాను. కనుచూపు మేరలో ఎవరూ కనబడటం లేదు. తను రూ.55 కోట్ల గురించి పట్టుబడితే దేశవాసులు అనేకమంది తనను తప్పుపడతారని గాంధీ వూహించేవుంటాడు. అయినా తను ధర్మం అనుకున్నది ఆయన చేశాడు. అది తప్పు అని మనం అనుకుంటే అనుకోవచ్చు. మనిష్టం.

దీనితో గోడ్సే వాదనలను ముగింపు పలుకుతున్నాను. దీని తర్వాత గోడ్సే విచారణ ఎలా జరిగిందో, ఆనాడు కోర్టులో వున్నవారి స్పందన ఎలా వుందో ఖోస్లా గారి పుస్తకం నుంచి ఎత్తి రాస్తాను. (సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Previous Articles