చంపేస్తున్నారు బాబోయ్…!

సుంకర అన్నపూర్ణ..ఈ పేరు ఇటీవల తెలుగు నెటిజన్లకు, తెలుగు సినిమాల వ్యవహారాలను నెట్ లో ఫాలో అయ్యేవారికి పూర్తిగా తెలిసిపోయిన పేరు. ఆ అమ్మాయి ఉన్నట్లుండి తెలుగు సినిమాల మీద వాటిల్లో అమ్మాయిలకు లభించే…

సుంకర అన్నపూర్ణ..ఈ పేరు ఇటీవల తెలుగు నెటిజన్లకు, తెలుగు సినిమాల వ్యవహారాలను నెట్ లో ఫాలో అయ్యేవారికి పూర్తిగా తెలిసిపోయిన పేరు. ఆ అమ్మాయి ఉన్నట్లుండి తెలుగు సినిమాల మీద వాటిల్లో అమ్మాయిలకు లభించే గౌరవం మీద, తెలుగు సినిమా సెలబ్రిటీల మీద తన ఇష్టానికి మాట్లాడుకుంటూ పోయింది.

నిజానికి ఇవేమీ కొత్తేమీ కాదు..జనానికి తెలిసినవే, మాట్లాడుకుంటున్నవే. అయితే ఆ అమ్మాయి కాస్త అడుగు ముందుకేసి, మనిషా పశువా..దున్నపోతా..ఇట్లాంటి భాష మాట్లాడింది. నిజానికి ఆమెపై కోపం వుండొచ్చు..లేదా ఆమె అలా మాట్లాడకూడదు అని అనిపించవచ్చు..కావాలంటే పరవునష్టం దావా కూడా వేసుకోవచ్చు. కానీ సినిమా జనాలు ఎవరూ, అస్సలు పట్టించుకోకుండా వదిలేసారు. 

కానీ అలా వుండిపోతే ఎలా, చేతిలో స్మార్ట్ ఫోన్, దానికో కెమేరా వుండబట్టేగా సదరు సుంకర అన్నపూర్ణ అలా మాట్లాడేసి, ఇలా నెట్ లోకి తోసేసింది.అందుకే మన జనాలు కూడా మొదలెట్టేసారు. సినిమా అభిమానులు ముందుగా బోణీ కొట్టారు. అక్కడితో ఆగినా బాగుండును.

కానీ ఇప్పుడు మిగిలిన వారు కూడా తమ క్రియేటివిటీ చూపించడం ప్రారంభించారు. నిన్నటికి నిన్న ఏంకర్ రవి తన సమాధానం తాను ఇచ్చారు. ఇప్పుడు బాలనటుడు, హీరో అనిపించుకున్న బాలాదిత్య కూడా గొంతు కలిపేసాడు. ఏకంగా పదినిమషాల విడియో తీసి నెట్ లోకి వదిలేసాడు. 

వీళ్లంతా చెప్పేది ఒక్కటే సుంకర అన్నపూర్ణ అనే అమ్మాయి సినిమా వాళ్లను అలా తిట్టడం తప్పు. సినిమాను సినిమాగానే చూడాలి. వెళ్లామా..చూసామా..వచ్చామా..వదలేసామా..అని తప్ప, కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు లాజిక్ లు, ఇతరత్రా వ్యవహారాలు పీకకూడదు అని. 

నిజమే సుంకర అన్నపూర్ణ అలాగే పీకి వుండొచ్చు. ఆవేశంలో నటులను, సినిమా జనాలను కాస్త అతియైన భాషతో నిలదీసి వుండొచ్చు. గతంలో అనేకానే మంది తెలుగు సినిమా వ్వవహారాలను పత్రికల్లో, టీవీల్లో ఎండగట్టిన సంగతి కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. శ్రీశ్రీ ఏమంటాడు..పబ్లిక్ లో నిల్చుంటే ఏమైనా అంటాం..అన్నాడు.

ఆలీ పబ్లిక్ గా సమంత నడుము బెంజ్ సర్కిల్ లా వుంటుంది అని అంటే అది కామెడీగా ఫన్నీగా తీసుకోవాలని కొందరు అంటే, కాదు, సీరియస్ గా తీసుకోవాలని ఫెమినిస్టులు అనడం కామన్. ఇప్పుడు సుంకర అన్నపూర్ణ వ్యవహారాన్ని కూడా అలాగే తీసుకుని వదిలేయాలి కానీ, ఇక పోటా పోటీగా విడియోలు వదులుతుంటే ఎలా?

నిజానికి అన్నపూర్ణకు మద్దతుగా ఎవరూ ఏ విడియో విడుదల చేసి వుండకపోవచ్చు. అలా విడుదల చేయడం మొదలుపెడితే సినిమాల వ్యవహారాలు బజార్నపడతాయి. శ్రీనువైట్ల గతంలో తన సినిమాలో సినిమా సంగీతం దర్శకుడిగా బ్రహ్మీని పెట్టి ఓ స్పూఫ్ చేయలేదా? అలా అంటే అది కూడా తప్పే. అక్కడ టేకిటీజీగా తీసుకుంటే, ఇక్కడా టేకిటీజీగా తీసుకోవాలి.

అంతే కాదు, చాలా సినిమాల్లో పైగా విశ్వనాధ్ సినిమాల్లో కూడా మన తెలుగు సినిమా వ్యవహారాలను విమర్శించిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి దున్నపోతు, మనిషా, పశువా అన్న పదాలు వాడకుండా వుంటే ఇక్కడా సమస్య వుండకపోనేమో?

అంతెందుకు సోషల్ నెట్ వర్క్  లో కూడా తరచు మన సినిమాలపై విమర్శలు, కామెంట్ లు నిత్యం వస్తూనే వుంటాయి. బూతు సినిమాలను ఎండగడుతూనే వుంటారు. అలాంటి బూతు సినిమాలను కూడా వెళ్లామా, చూసామా, వచ్చామా అని వదిలేద్దామంటే ఎలా? 

ఏదైనా అతి పనికిరాదు. అటు అన్నపూర్ణ సుంకరకైనా..ఇటు దానికి సమాధానం చెబుతున్నవారికైనా?