శ్రీలంకలో ఎమర్జెన్సీ.. టీడీపీ ఇంకా ఎత్తుకోలేదేంటి?

దేశానికి, రాష్ట్రానికి తేడా తెలుసుకోకుండా శ్రీలంకతో లింక్ పెట్టి ఏపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు, లోకేష్. ఇప్పుడు శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. ఏపీలో కూడా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చేశాయంటూ చంద్రబాబు కొత్త విమర్శ ఎత్తుకుంటారేమో…

దేశానికి, రాష్ట్రానికి తేడా తెలుసుకోకుండా శ్రీలంకతో లింక్ పెట్టి ఏపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు, లోకేష్. ఇప్పుడు శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. ఏపీలో కూడా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చేశాయంటూ చంద్రబాబు కొత్త విమర్శ ఎత్తుకుంటారేమో చూడాలి. రాష్ట్రానికి, దేశానికి తేడా తెలుసుకోకుండా, మరోసారి అవివేకంగా ప్రవర్తిస్తారేమో.

గతంలో తాము అధికారంలో ఉండగా ఏపీని సింగపూర్ తో పోల్చి చెప్పుకుంటూ ఎగిరెగిరి పడేవాళ్లు టీడీపీ జనాలు. అసలు సింగపూర్ కి ఏపీకి పోలికేంటి, సింగపూర్ లాంటి బిల్డింగ్ లను చంద్రబాబు గ్రాఫిక్స్ లో చూపించేస్తే ఇక్కడి ప్రజలు ఆ భ్రమలో పడిపోతారని వారి నమ్మకం. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి వారితో చంద్రబాబు ఉన్న  ఫొటోలను ఇప్పటికీ పబ్లిసిటీకి వాడుకోవడం వారికి అలవాటు.

అసలు అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో పోల్చు కోవాలి కానీ, పక్క దేశాలతో ఏపీని పోల్చుకోవడం అనేది చంద్రబాబు డ్రామా. ఇప్పుడు తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా పక్క దేశాలతో ఏపీని పోల్చి చూస్తూ హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల శ్రీలంక ఆర్థికంగా దివాళా తీయడంతో ఏపీని పోల్చి చెబుతున్నారు.

శ్రీలంక ప్రభుత్వం అత్యుత్సాహంతో తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ప్రపంచ దేశాలన్నీ సాయం చేస్తున్నా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలయ్యే క్రమంలో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ నిన్న మొన్నటి వరకూ హడావిడి చేస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు సహా మిగతావాళ్లంతా వెటకారంగా మాట్లాడుతున్నారు.

ఉచిత పథకాలపై దేశంలో ఎక్కడ ఎవరు ఏ కామెంట్ చేసినా.. ఏపీకి ముడిపెడుతూ టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేసేది. ఇప్పుడు ఎమర్జెన్సీని కూడా ఏపీకి వర్తింపజేస్తూ టీడీపీ కామెంట్లు మొదలు పెట్టడం ఖాయం. ఓ దేశ ఆర్థిక పరిస్థితికి, సువిశాల భారత దేశంలోని ఓ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ముడిపెట్టడం, ఉచిత పథకాలతో నష్టం జరిగిపోతోందంటూ హేళన చేయడం టీడీపీకే చెల్లుతుంది. అలా పోల్చి చెప్పే క్రమంలో నవ్వులపాలవడం కూడా ఆ పార్టీ నేతలకే చెల్లింది.