చంద్రబాబునాయుడు ఓ అద్భుతమైన మాట చెప్పారు. నిజానికి ఇది అచ్చంగా ఏపీ రాజకీయాల విషయంలో వర్తించేది. కాకపోతే.. బాబు గారికి వయసు పైబడడం వలన కాస్త బ్యాలెన్స్ పట్టు తప్పింది గనుక.. హైదరాబాదులో తెలంగాణ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆయన ఆ మాటను సెలవిచ్చారు. ఇంతకూ ఏం చెప్పారో తెలుసా? ‘‘ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు డబ్బులు పనిచేయవు’’ అని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు ఉత్తేజం ఇచ్చే పనిచేశారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ అంతర్ధానం అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. సమాధి అయిపోయిన పార్టీని లేపి నిలబెట్టి.. దానికి ఊపిరిపోయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఆ మాటకొస్తే.. అంతో ఇంతో డబ్బున్న నాయకులెవ్వరూ తెలుగుదేశంవైపు కన్నెత్తి చూడడం లేదు. తమ నియోజకవర్గాల్లో లోకల్ ఈక్వేషన్స్ వల్ల కుదరని వారు మాత్రమే.. ఇంకా తెలంగాణ టీడీపీలో కొనసాగుతున్నారు.
అందువలనచేత.. డబ్బులేని వాళ్లయినా సరే.. రండి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా అని పిలుపు ఇస్తూ.. వారికి ధైర్యం చెప్పడానికి.. చంద్రబాబు ఈ మాట అన్నారు. తెరాస మీద వ్యతిరేకత ఉన్నది గనుక.. మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా పోటీచేసినా గెలుస్తారని.. పార్టీ శ్రేణులకు నచ్చజెప్పడం.. ఈ మాటల్లోని ఆంతర్యం.
నిజమే ఇలాంటి డైలాగు చెప్పడానికి చంద్రబాబుకు పూర్తి అధికారం ఉంది. ఎందుకంటే.. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు ఏమాత్రం పనిచేయవు అనే సంగతి ఆయనకు స్వానుభవంలో ఉన్నదే. ఆత్మానుభవంలోకి వస్తే గానీ తత్వం బోధపడదు అని కన్యాశుల్కంలో గిరీశం చెప్పినట్లుగా.. 2019 ఎన్నికలు చంద్రబాబుకు ఇలాంటి పుష్కలమైన అనుభవాన్ని మిగిల్చాయి. తన పుత్రరత్నాన్ని ఎమ్మెల్యే చేయాలనే అత్యాశతో, తాను ఎంతో అభివృద్ధి చేసేశానని భ్రమపడి మంగళగిరి నియోజకవర్గంలో పోటీచేయించిన చంద్రబాబు ఖంగు తిన్నారు.
ఎన్నికలు మొదలు కాగానే.. అక్కడ తమ ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారని, తన కొడుకుకు ఠికానా లేనేలేదని తెలిసొచ్చి వందల కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరించారు. ఇంటింటికీ ఏసీలు ఫ్రిజ్ లు వేలకు వేల రూపాయలు పంచి పెట్టారు. డబ్బు వెల్లువలా పారినా అక్కడ పుత్రరత్నం చిత్తుగా ఓడిపోయాడు. ఇంతకంటె గొప్ప అనుభవం ఏముంటుంది. అందుకే చంద్రబాబు అంత సాధికారంగా.. వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవు అని చెప్పినట్టుగా కనిపిస్తోంది.
సరిగ్గా ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలు అందరికీ తలో పదివేలు పంచిపెట్టిన కుట్రపూరిత బుద్ధి చంద్రబాబుది. అయిదేళ్ల పాలన అస్తవ్యస్తంగా సాగించి.. ఎన్నికలకుముందు.. లంచమిచ్చినట్టుగా.. దానికో కొత్త పేరు పెట్టి తలో పదివేలూ ఇచ్చినా వారు ఓట్లు మాత్రం వేయలేదు. అందుకే వ్యతిరేకత ఉంటే డబ్బులు పనిచేయవు అనే సంగతి ఆయనకు బాగా తెలుసు.
డబ్బులు మాత్రమే కాదు.. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు అలిపిరి బాంబుదాడి వంటి ఘోరమైన సంఘటన జరిగినా కూడా.. ప్రజలు జాలిచూపిస్తారు గానీ ఓట్లు మాత్రం వేయరని చంద్రబాబుకు చాలా బాగా తెలుసు. అందుకే ఆయన పార్టీ శ్రేణులకు ఇలాంటి మాటలు చెప్పగలుగుతున్నారు గానీ.. తెరాస మీద వ్యతిరేకత ఉన్నా కూడా.. అది తెలుగుదేశాన్ని ఎందుకు గెలిపిస్తుంది.
ఆల్రెడీ సమాధి అయిపోయిన పార్టీని, ఏపీలో కూడా సమాధి అయ్యే దిశగా సాగుతున్న పార్టీని ప్రజలు ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు? ప్రభుత్వ వ్యతిరేకత ఎడ్వాంటేజీ ఉంటే.. దానిని క్యాష్ చేసుకోడానికి బిజెపి, కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయి కదా.. అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.