సన్ నెట్‌వర్క్‌కు మబ్బు పడుతోంది

1993లో సన్ టివి నెట్‌వర్క్ ప్రారంభించిన దగ్గర్నుంచి మారన్ సోదరులు ప్రచండంగా వెలుగుతూ వచ్చారు. వారి సామ్రాజ్యం రోజురోజుకీ విస్తరిస్తూ పోయింది. వివిధ భాషల్లో 32 టివి ఛానెల్స్ ద్వారా తొమ్మిదిన్నర కోట్ల ఇళ్లకు…

1993లో సన్ టివి నెట్‌వర్క్ ప్రారంభించిన దగ్గర్నుంచి మారన్ సోదరులు ప్రచండంగా వెలుగుతూ వచ్చారు. వారి సామ్రాజ్యం రోజురోజుకీ విస్తరిస్తూ పోయింది. వివిధ భాషల్లో 32 టివి ఛానెల్స్ ద్వారా తొమ్మిదిన్నర కోట్ల ఇళ్లకు వ్యాప్తి, 45 ఎఫ్‌ఎమ్ రేడియో స్టేషన్లు, మ్యాగజైన్లు, రెండు దినపత్రికలు, కేబుల్ నెట్‌వర్క్‌కు 13 లక్షలమంది చందాదారులు, సన్ డిటిఎచ్‌కు 64లక్షల మంది చందాదారులు – ఇలా పైపైకి వెళ్లిపోతూ అమితంగా లాభాలు ఆర్జించింది. 2000లో సన్ పిక్చర్స్ అని సినిమా నిర్మాణం మొదలెడితే అక్కడా విజయమే. ఇంత సంపాదించినా మారన్ సోదరులు అత్యాశకు పోయి, అవినీతికి పాల్పడి ఇప్పుడు అరెస్టు అయ్యే ప్రమాదం కొని తెచ్చుకున్నారు. ఎయిర్‌సెల్ కంపెనీని మలేసియాకు చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మేయమని ఆ కంపెనీ యజమాని సి.శివశంకరన్‌పై ఒత్తిడి తెచ్చారని, అలా ఒత్తిడి తేవడానికి మాక్సిస్ నుండి రూ.742 కోట్ల లంచం తీసుకున్నారని సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిలో రూ.549 కోట్లు యుకెలో వున్న తమ సబ్సిడరీ ఏస్ట్రో ఆల్ ఏసియా నెట్‌వర్క్ లి. ద్వారా కళానిధి మారన్‌కు చెందిన సన్ డైరక్ట్ లి.లో పెట్టుబడి ద్వారా చెల్లించింది. తక్కిన రూ.193 కోట్లు మారిషస్‌లో వున్న మరో సబ్సిడరీ ద్వారా మారన్ సోదరులకు చెందిన సౌత్ ఏసియా ఎఫ్‌ఎమ్ లి.లో పెట్టుబడి పెట్టింది. 

ఈ సోదరులకు వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బల్లో చార్జిషీటు వ్యవహారం తాజాది. సన్ నెట్‌వర్క్‌లోని తన 3.43 కోట్ల షేర్లు కళానిధి పెట్టుబడి పెట్టిన స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు 2013-14లో రూ.1003 కోట్లు నష్టం వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాదు అనే ఐపిఎల్ క్రికెట్ టీము ఆపరేటింగ్ ఖర్చు రూ.129 కోట్లు చేరింది. దాన్ని భరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టీము – బెంగుళూరు టైటాన్స్‌లో వున్న తన షేర్లు కొన్ని అమ్మేయవలసి వచ్చింది. కేంద్రమంత్రిగా వుంటూ బిఎస్‌ఎన్‌ఎల్ చేత తన చెన్నయ్ ఇంటికి 323 హై స్పీడ్ ఫోన్‌లైన్లు వేయించుకుని, వాటిని సన్ గ్రూపుకి వాడుకోవడం ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్లు నష్టం కలిగించినందుకు సిబిఐ ఈ జూన్‌లో దయానిధిని విచారించింది. బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖ దేశభద్రత కారణాలు చూపిస్తూ సన్ గ్రూపుకి చెందిన కాల్ కేబుల్స్ లి. లైసెన్సు రద్దు చేసి, కంపెనీని 15 రోజుల్లోగా మూసేయాలని  ఈ ఆగస్టు 26న ఆదేశాలు జారీ చేసింది. వీళ్లు మద్రాసు హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఎయిర్‌సెల్ వ్యవహారం చాలారోజులుగా నలుగుతున్నా సాక్ష్యాలు చాలలేదంటూ చార్జిషీటు వేయకుండా సిబిఐ డైరక్టర్ రంజిత్ సిన్హా అడ్డుపడుతూ వచ్చాడు. ఇప్పుడు అతని ప్రతిష్టే మసకబారింది. యుపిఏ వున్నంతకాలం  మారన్ సోదరులు నెట్టుకుని వచ్చారు. ఇప్పుడు మోడీకి వీళ్లపై ప్రేమేమీ లేదు. డిఎంకెను అడ్డుపెట్టుకుని పోరాడదామంటే కరుణానిధి కుటుంబం వీళ్లను పెద్దగా పట్టించుకోవటం లేదు. అతి త్వరలో వీళ్లు అరెస్టయినా వింతేమీ లేదు.

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]