డాల్ఫిన్ దొరికింది.. కూర వండుకొని తినేశారు

చేపల వేటకు వెళ్లినప్పుడు వలలో చాలా రకాల జలచరాలు పడతాయి. వాటిలోంచి చేపల్ని మాత్రమే తీసుకొని, మిగతా ప్రాణుల్ని తిరిగి అదే జలాల్లోకి వదిలేస్తుంటారు జాలర్లు. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు మత్స్యకారులు…

చేపల వేటకు వెళ్లినప్పుడు వలలో చాలా రకాల జలచరాలు పడతాయి. వాటిలోంచి చేపల్ని మాత్రమే తీసుకొని, మిగతా ప్రాణుల్ని తిరిగి అదే జలాల్లోకి వదిలేస్తుంటారు జాలర్లు. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు మత్స్యకారులు మాత్రం ఆ పని చేయలేదు. ఏకంగా డాల్ఫిన్ ను వండుకొని తినేశారు.

భారీగా కురుస్తున్న వర్షాలకు నదీలు పొంగిపొర్లుతున్నాయి. చేపల వేటకు ఇదే మంచి సమయం. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లా నసీర్ పూర్ గ్రామంలో నలుగురు జాలర్లు చేపల వేటకు యమునా నదిలోకి వెళ్లారు. అనుకోకుండా వాళ్ల వలలోకి డాల్ఫిన్ వచ్చిపడింది.

దాన్ని వాళ్లు తిరిగి నీటిలోకి విడిచిపెట్టలేదు. భుజాలపై మోసుకుంటూ గ్రామంలోకి తీసుకొచ్చారు. దాన్ని చంపి, కూర వండుకొని తిన్నారు. వన్యప్రాణి సంరర్షణ చట్టం ప్రకారం, ఇలా డాల్ఫిన్ ను చంపడం చట్టరీత్యా నేరం.

దీంతో డాల్ఫిన్ ను కూర వండుకొని తిన్న మత్స్యకారులపై కేసు నమోదైంది. నలుగుర్లో రంజిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. చట్టరీత్యా వీళ్లకు మూడేళ్ల జైలుశిక్ష, 25వేల రూపాయల జరిమానా  విధించే అవకాశం ఉంది

ఇంతకీ ఈ మేటర్ ఎలా బయటకొచ్చిందో తెలుసా? డాల్ఫిన్ దొరికిందనే ఆనందంలో ఈ మత్స్యకారులు ఫొటోలు, వీడియోలు దిగారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో, విషయం పోలీసులకు తెలిసింది.

అవగాహన లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని అంటున్నాయి మత్స్యకార సంఘాలు. డాల్ఫిన్లను వేటాడకూడదనే విషయం చాలామందికి తెలియదని, తెలియక చేసిన తప్పుకు క్షమించి వదిలేయాలని కోరుతున్నాయి.