కాంగ్రెస్ అప్రకటిత అధినేత రాహుల్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. తెరాస మీద నిప్పులు కురిపించారు. వారితో పొత్తు ఉండబోదని కూడా తెగేసి చెప్పారు. టీఆర్ఎస్ పతనానికే కాంగ్రెస్ పనిచేస్తుందని స్పష్టత ఇచ్చారు. పార్టీ శ్రేణులకు హెచ్చరికలు కూడా చేశారు. ప్రజల్లో ఉంటే తప్ప పార్టీ టికెట్ రాదని, హైదరాబాదు ఢిల్లీల్లో మాత్రమే తిరగడం వల్ల ఉపయోగం లేదని కూడా ఆయన హెచ్చరించారు. ఇదంతా ఒక ఎత్తు.
ప్రస్తుతానికి ఇటు తెలంగాణలోను, దేశవ్యాప్తంగా కూడా శవాసనం వేసి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడం ఎలా? అనే దిశగా ఆయన హైదరాబాదులో పెద్ద కసరత్తే చేశారు. అయితే ఈ కసరత్తు మొత్తం పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతూ, ఆయన ఫుట్ స్టెప్స్ లో నడుస్తూ, అదే వ్యూహాలతో ముందుకు సాగినట్టుగా కనిపిస్తోంది.
రాహుల్ హైదరాబాదు పర్యటనలో తెలంగాణ మేధావులతో విడిగా సమావేశం అయ్యారు. కేసీఆర్ పోకడలు అంటే గిట్టని మేధావులు మాత్రమే అని విడిగా చెప్పక్కర్లేదు. వీరిలో హరగోపాల్ వంటి పెద్దలు గద్దర్ వంటి అనేకమంది ఇతరులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్ధరణకు వారు తమకు తోచిన సలహాలు చెప్పారు.
రాహుల్ తండ్రికి తాత నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ను ప్రస్తావించిన హరగోపాల్, రాహుల్ కూడా ఏడాది పాటు భారతదేశ గ్రామాల్లో పర్యటించాలని వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. పార్టీ నాయత్వం విషయంలో సందిగ్ధాలు తొలగాలని కూడా పలువురు చెప్పారు. ఎప్పుడూ కూడా సలహాలు ఎవరు చెప్పినా అవి మంచివే అయి ఉంటాయి. కానీ.. ఆచరించే విషయంలోనే అనేకానేక అవాంతరాలు ఎదురవుతుంటాయి. తెలంగాణ మేధావులు చెప్పిన సలహాలు రాహుల్ కు తెలియనివీ కాదు, కొత్తవీ కాదు. కానీ.. ఆచరించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అనేది కీలకాంశం.
అలాగే రాహుల్ హైదరాబాదులోని వివిధ మీడియా సంస్థల అధిపతులతో కూడా భేటీ అయ్యారు. పార్టీ కోసం వారి సలహాలను కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా మెరమెచ్చు, ముఖప్రీతి భేటీలు. వారితో కలిసి విందులు, హైటీలు గడపడం- ఆ తర్వాత వారు చెప్పిన సలహాలను మరచిపోవడం చాలా మామూలే. మీడియా అధిపతులతో భేటీ అనేది సలహాల పరంగా ఎలా ఉన్నప్పటికీ.. వారితో యాక్సెస్ పెరగడం తమ పార్టీకి ప్రచారం పరంగా ఉపయోగపడుతుందనేది ఒక వ్యూహం.
నిజానికి ఇవన్నీ కూడా పవన్ కల్యాణ్ గతంలో అనుసరించిన, మరో రకంగా చెప్పాలంటే ప్రారంభించిన మార్గాలు. వాటిని రాహుల్ ఇప్పుడు అనుసరిస్తున్నట్లుగా, పవన్ ను ఫాలో అవుతున్నట్టుగా ఉంది. దామోదరం సంజీవయ్యను హఠాత్తుగా నెత్తిన పెట్టుకోవడం కూడా ఇలాగే అనిపిస్తుంది. దామోదరం సంజీవయ్య పేరు చెప్పుకుంటూ.. దళిత వర్గాల్లో తన పార్టీకి ఆదరణ కోసం పవన్ కల్యాణ్ నానా పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే.
పవన్ కల్యాణ్ కూడా తన పార్టీని గేర్ మార్చినప్పుడు మేధావులతో అనేక సమావేశాలు నిర్వహించాడు. మీడియా అధిపతులతో విందు భేటీలు పెట్టి.. వారిని సంతుష్టపరచి తన విస్తృతప్రచారానికి బాటలు వేసుకున్నాడు. అయితే వారిచ్చిన సలహాలన్నింటినీ మాత్రం గంగలో కలిపేశాడు. అందుకే ఆయన పార్టీ.. ఎందుకూ కొరగాని రీతిలో కులాన్ని మాత్రమే నమ్ముకుని కునారిల్లుతోంది. రాహుల్, లేదా ఆయనను ఇలాంటి పనులకు ప్రేరేపించిన రేవంత్ రెడ్డి, పవన్ ను ఫాలో అవడం మంచిదే. కానీ మేధావుల నుంచి వచ్చిన సలహాలను గుర్తుంచుకుని ఆచరిస్తే వారికి భవిష్యత్తు ఉంటుంది.