హీరో మహేష్ బాబు బాగా ఎమోషనల్ అయిపోయారు. దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తరువాత ఆయన అభిమానుల ముందుకు వచ్చారు. సరిలేరు నీకెవ్వరు విడుదల తరువాత కోవిడ్ పరిస్థితులు అలుముకోవడంతో జనం అంతా ఇంటికే పరిమితం అయ్యారు.
సినిమాల నిర్మాణం ఆగిపోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి పరిస్థితులు దాదాపుగా చక్కబడ్డాయి. మహేష్ నటించిన సర్కారువారి పాట సినిమా విడుదలకు రెడీ అయింది. సినిమా ప్రీ రిలీజ్ మీట్ లో మహేష్ మాట్లాడుతూ దాదాపుగా కళ్ల నీళ్లు పెట్టుకున్నారు.
స్పీచ్ ప్రారంభంలో ఆయన స్టయిల్ లోనే మాట్లాడడం ప్రారంభించారు. కానీ ఫ్యాన్స్ దగ్గరకు వచ్చేసరికి భావోద్వేగానికి గురయ్యారు. ఫ్యాన్ వేలాదిగా తరలి రావడం, వాళ్ల కేరింతలు చూసి, ఇది చాలు, ఇక ధైర్యంగా ముందుకు వెళ్లిపోగలను అని అంటూ కంటతడి పెట్టుకున్నారు.
నిఙానికి మహేష్ బాబే కాదు చాలా మంది జనాలు పరిస్థితులు చక్కబడతాయా? మళ్లీ మామూలు అవుతాయా? జనాలు థియేటర్ కు ఇక రెగ్యులర్ గా వస్తారా? అనే సందేహాలతో బతికారు. కానీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప, అఖండ లాంటి సినిమాలు సాధించిన విజయాలు చూసి మళ్లీ స్థిమిత పడ్డారు. కంటెంట్ బాగుంటే జనం మళ్లీ మామూలుగా థియేటర్ కు వస్తారు అని రుజువయింది.
అలాగే ఫ్యాన్స్ రెండేళ్ల గ్యాప్ వచ్చిన తమ హీరోను అభిమానించడంలో ఏ మార్పు లేదని క్లారిటీ వచ్చింది. రెండు రాష్ట్రాల నుంచీ, సరిహద్దు ప్రాంతాల నుంచీ మహేష్ ఫ్యాన్స్ భయంకరంగా తరలి వచ్చారు. ఇవన్నీ చూసి మహేష్ ఒక్కసారి గత రెండేళ్ల కాలాన్ని గుర్తు తెచ్చుకుని వుంటారు. అందుకే భావోద్వేగానికి గురయ్యారు.