సినిమా రివ్యూ: జేమ్స్‌బాండ్‌

రివ్యూ: జేమ్స్‌బాండ్‌ (నేను కాదు నా పెళ్లాం) రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి. తారాగణం: అల్లరి నరేష్‌, సాక్షి చౌదరి, ఆశిష్‌ విద్యార్థి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రఘుబాబు, అలీ,…

రివ్యూ: జేమ్స్‌బాండ్‌ (నేను కాదు నా పెళ్లాం)
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.
తారాగణం: అల్లరి నరేష్‌, సాక్షి చౌదరి, ఆశిష్‌ విద్యార్థి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రఘుబాబు, అలీ, జయప్రకాష్‌రెడ్డి, పృధ్వీ, ప్రవీణ్‌, చంద్రమోహన్‌, ప్రభ, హేమ తదితరులు
మాటలు: శ్రీధర్‌ సీపాన
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
ఛాయాగ్రహణం: దాము నర్రావుల
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథనం, దర్శకత్వం: సాయికిషోర్‌ మచ్చ
విడుదల తేదీ: జులై 24, 2015

అల్లరి నరేష్‌కి 'సుడిగాడు' తర్వాత సుడి కలిసి రావడం లేదు. వరుసపెట్టి చాలా ఫ్లాప్‌ సినిమాలు చేసిన నరేష్‌ ఇప్పుడు 'జేమ్స్‌బాండ్‌' భర్త పాత్ర పోషించాడు. 'మై వైఫ్‌ ఈజ్‌ ఏ గ్యాంగ్‌స్టర్‌' అనే కొరియన్‌ యాక్షన్‌ కామెడీ చిత్రం స్ఫూర్తిగా రూపొందిన ఈ చిత్రంతో మళ్లీ ట్రాక్‌ మీదకి రావాలనుకున్నాడు. గతంలో ఇలాగే కొరియన్‌ సినిమా 'మ్యారీయింగ్‌ ది మాఫియా'ని కాపీ కొట్టి 'అహ నా పెళ్లంట'తో హిట్‌ కొట్టిన నరేష్‌కి ఈసారి కొరియన్‌ మంత్రం కూడా పని చేయలేదు. 

అమాయకుడైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (నరేష్‌) ఒక మాఫియా డాన్‌ని (సాక్షి) పెళ్లి చేసుకుని ఇరకాటంలో పడడమే ఈ చిత్ర కథాంశం. కామెడీకి స్కోప్‌ ఉన్న సబ్జెక్ట్‌ అయినప్పటికీ నవ్వించేలా రూపొందించడంలో విఫలమయ్యారు. ఎరక్కపోయి మాఫియా డాన్‌ని పెళ్లి చేసుకున్న వ్యక్తి పాత్రనుంచి హాస్యం పుట్టించడానికి ఆస్కారం ఉన్నా కానీ దానిని వినియోగించుకోలేదు. ఇక అసలు కథకి సపోర్ట్‌గా రాసుకున్న సబ్‌ ప్లాట్స్‌ కూడా పేలవంగా ఉండడంతో జేమ్స్‌బాండ్‌ ముందుకి వెళ్లే కొద్దీ భరించలేని నసగా తయారైందే తప్ప నవ్వించలేదు. 

నవ్వించడం కోసమని చేయని ప్రయత్నమంటూ లేదు. సినిమా నిండా చాలా మంది కామెడీ ఆర్టిస్టులున్నారు. హీరోయిన్‌ దగ్గర, విలన్‌ చుట్టూ కూడా కమెడియన్లని పెట్టి నవ్వించడానికి ప్రయత్నించారు. అడపాదడపా కొన్ని జోకులు ఫర్వాలేదనిపించాయి తప్పితే వాటి కోసమని మిగతా సొద అంతా భరించడం చాలా కష్టం. కేవలం ప్రాస డైలాగులుంటే జనం నవ్వేస్తారనుకునే భ్రమలోంచి రచయితలు బయటకి రావాలి. సన్నివేశంలో నవ్వించే సత్తా లేనప్పుడు కనీసం సంభాషణలతో అయినా కొంతవరకు కాపాడ్డానికి వీలున్న జోనర్‌ కామెడీ ఒక్కటే. అయితే కామెడీ పండించడానికి రచయిత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టకపోతే ఇలాంటి నాసిరకం సినిమాలే వస్తాయి. 

చిన్న అవుట్‌లైన్‌ దొరికితే దాంతో అలరించే కామెడీ సినిమాని రూపొందించే టాలెంట్‌ ఉన్న ఇవివి సత్యనారాయణ లాంటి దర్శకులు లేని వెలితి బాగా కనిపిస్తోంది. లో బడ్జెట్‌ సినిమాల్లో మినిమమ్‌ గ్యారెంటీ అయిన జోనర్‌ నెమ్మదిగా కళ కోల్పోతోంది. అగ్ర హీరోలు నటించిన సినిమాల్లోను కామెడీ తక్కువైతే జనం హర్షించని రోజుల్లో అచ్చంగా కామెడీ సినిమాలు తీసినప్పుడు ఇక అది ఏ స్థాయిలో పండాలి? నరేష్‌ ఇంతకుముందే భార్య చేతిలో ఇరుక్కున్న భర్త పాత్రలు కొన్ని చేసాడు. సిట్యువేషన్‌ మారి ఉండొచ్చు కానీ తన క్యారెక్టరైజేషన్‌ పరంగా మార్పులేం లేకపోవడంతో ఈ చిత్రాన్ని కాపాడ్డానికి తన వంతుగా ఏమీ చేయడానికి లేకుండా పోయింది.

కనీసం హీరోయిన్‌ పరంగా అయినా కాంప్రమైజ్‌ కాకుండా వుండాల్సింది. హీరోయిన్‌పై నడిచే కథలో సాక్షి చౌదరిలాంటి ఎక్స్‌ప్రెషన్‌ పలకని నటిని తీసుకోవడంతో జేమ్స్‌బాండ్‌ మరింత బ్యాడ్‌గా తయారైంది. ఈ పాత్రకి ప్రేక్షకులకి బాగా పరిచయం వున్న హీరోయిన్‌ అయితే కనీసం వేల్యూ యాడ్‌ అయి ఉండేది. హాయిగా నవ్వించే ఒక్క సన్నివేశం కానీ, డైలాగ్‌ కానీ లేని ఈ చిత్రంలో చాలా మంది కమెడియన్లు వేస్ట్‌ అయ్యారు. జనం విరగబడి నవ్వేస్తారనే భ్రమలో పడి కొన్ని సన్నివేశాలని అవసరానికి మించి సాగదీశారు కానీ ఫలితం లేదు. 

పాటలే దారుణంగా వున్నాయంటే నేపథ్య సంగీతం మరింత ఇబ్బంది పెడుతుంది. పేలవమైన కామెడీ చిరాకు పెడుతుంటే, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో బుర్ర వాచిపోతుంది. కనీసం ఎడిటర్‌ అయినా కనికరించి దీనిని వీలయినంత కుదించేసి వుండాల్సింది. దర్శకుడు సాయికిశోర్‌ పలు చిత్రాల్లో క్లిక్‌ అయిన సీన్లని రీసైకిల్‌ అయితే చేశాడు కానీ నవ్వించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కొరియన్‌ కామెడీని మన నేటివిటీకి తగ్గట్టు మార్చాలని చూడడం కంటే కనీసం దానిని యథాతథంగా కాపీ కొట్టినట్టయితే కొత్తగా అయినా అనిపించేదేమో. 

సినిమా అంతా విసిగించినా చివర్లో అయినా వినోదంతో ఉపశమనం ఉంటుందేమో అనుకుంటే అక్కడ టీవీ సీరియల్‌ తరహా డ్రామా సన్నివేశాలతో జేమ్స్‌బాండ్‌ని కోలుకోనివ్వని దెబ్బ కొట్టారు. ఒకవైపు క్వాలిటీ పరంగా తెలుగు సినిమా ఎల్లలు దాటేస్తూ ఉంటే, ఇంకా ఇలాంటి నాసి రకం కామెడీలు చెల్లిపోతాయనే కలలు కనడంలో అర్థం లేదు. 

బోటమ్‌ లైన్‌: జేమ్స్‌ 'బ్యాండ్‌'!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri