బాహుబలి సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఏ సినిమా కూడా దరిచేరలేని రికార్డులు నెల కొల్పింది. అయితే అదే సమయంలో మరే సినిమాకు, లేదా మళ్లీ బాహుబలి 2 కు మాత్రమే సాధ్యమయ్యే కొన్ని విశేషాలు సాధించింది. బాహుబలి రూపకర్తలు అందరికీ తెలుగుదేశం ప్రభుత్వంతో గట్టి సంబంధాలు వుండడమే ఇందుకు కారణం అన్న టాక్ వుంది. రాఘవేంద్రరావు, రామోజీరావు లకు బాబుతో వున్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. రాజమౌళి అండ్ కో కూడా మంచి సంబంధాలే వున్నాయి. అయితే దీని ఫలితం ఏమిటి అంటే..
టికెట్ ల ధరలు అనధికారికంగా పెంచి, పది రోజుల పాటు అమ్మినా ఎవరూ పట్టించుకోలేదు. స్పెషల్ షోలకు నేరుగా ప్రభుత్వమే సహకరించింది. అంతెందుకు గతంలో కాస్త పెద్ద సినిమా విడుదల అంటే చాలు ముందు రోజు రాత్రి ఇన్ కమ్ టాక్స్ అధికారుల దాడులో, చెకింగ్ లో వుండేవి. లేదా సినిమా హిట్ అయి కలెక్షన్లు కోట్లలో వున్నాయంటే చాలు ఆదాయపన్ను అధికారుల దాడులు వుండేవి. గతంలో ఇవన్నీ టాలీవుడ్ జనాలకు అనుభవమే. ఇప్పుడు బాహుబలి కొన్న దిల్ రాజుతో సహా.
మరి ఇన్ని వందల కోట్ల కలెక్షన్లు వినిపిస్తన్నాయి. మూడు వందల కోట్ల వసూళ్లు అంటే తమాషా కాదు. సరే రాజమౌళి అండ్ కో లెక్కలు పక్కాగా నిర్వహించే వుంటారు. అందులో సందేహం లేదు. కానీ మరి ఆదాయపన్ను శాఖ ఎప్పటిలా ఎక్కడా విచారణకు అయినా వచ్చిన దాఖలాలు కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. పదేసి లక్షలు తీసుకుని స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చారని అనుకున్నారు. ఎవరు తీసుకున్నారు. ఎంతకు అమ్మారు..ఎంత లాభం వచ్చింది. దానిపై పన్నేమైనా కట్టారా? అసలు ఆ ఆచూకీనే వున్నట్లు లేదు.
బహుశా ఇదంతా ఈ సినిమా వెనుక పెద్ద తలకాయలు వుండడమే కారణం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు ఎంపీల పెట్టుబడులు కూడా ఈ సినిమాలో వున్నాయని టాక్ వుంది. బహుశా వారి ప్రభావం కూడా వున్నా ఆశ్చర్యపోనక్కరలేదు.