వీటిల్లో గోదావరి హారతి ఒకటి. ఒక ట్రస్టువారు ప్రతీ పౌర్ణమికి గోదావరి యిచ్చే ఆచారం మొదలుపెట్టారు. ఏదో అదో వేడుక. పౌర్ణమి నాడు గోదావరి తీరానికి వెళితే కన్నుల పండుగగా వుంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు బాబుగారి ప్రభుత్వం దాన్ని హైజాక్ చేసి నిత్యహారతి చేసేశారు. ట్రస్టు వారు ఎండోమెంట్స్ వాళ్లు ఖర్చులు కలిసి భరిస్తారట. రోజూ హారతి యివ్వాలా? ఎంత నూనె లేదా ఆవునెయ్యి వేస్టు? వేడుక వేడుకలా వుండాలి. రోజూ యిస్తూ వుంటే రాజమండ్రి లాటి వూళ్లో చూడడానికి ఎంతమంది వస్తారు? నది పక్కనే వుంటుంది కాబట్టి ఆ వూరివాళ్లకు దానిపై గ్లామర్ వుండదు. గత పుష్కరాల టైములోనే నిత్యహారతి అని ఎండోమెంట్స్ శాఖ ద్వారా మొదలుపెట్టి రెస్పాన్సు లేకపోవడం చేత కొన్నాళ్లు పోయాక మానేశారు. ఇప్పుడు మొదలుపెట్టినది ఎంతకాలం సాగుతుందో చూడాలి.
ప్రభుత్వం టీవీలో, పత్రికల్లో యాడ్స్ యిచ్చి ప్రోత్సహిస్తోంది కాబట్టి యిక వాళ్లు కూడా తమ వంతు తాము యాడ్ కాంపెయిన్ పెట్టేశారు. పుష్కర స్పెషల్ పేర ప్రత్యేకానుబంధం వేసి పావు పేజీల్లో గోదావరి ఆర్టికల్స్, ముప్పావు పేజీల్లో పుష్కరయాత్రికులు అభినందనల యాడ్స్ వేసి డబ్బు చేసుకున్నారు. టీవీలు పుష్కరజ్వరాన్ని మేన్‌టేన్ చేయడానికి స్వామీజీలచే, ప్రవాచకుల చేత కార్యక్రమాలు పెట్టించేశారు. దశాబ్దాలుగా, తరతరాలుగా అందరికీ తెలిసిన విషయాలే చెపితే గొప్పగా వుండదని వాళ్లు యింతకింత చేసి ఏవేవో చెప్పారు. ఇటీవలి కాలంలో కర్మకాండమీద జనాల్లో పిచ్చి పట్టింది. కష్టాలనేవి భూమి పుట్టిన నుంచి వస్తూనే వున్నాయి. ఇదివరకు యివి ప్రకృతి సహజం అనుకునేవారు, భారతీయులైతే కర్మ అని సరిపెట్టుకుని ముందుకు సాగేవారు. ఇటీవలి కాలంలో నీకు జనఘోష వుంది, యితరులంతా నీ ప్రగతి చూసి అసూయ పడుతున్నారు. దాని వలన జరిగే నష్టాన్ని నివారించడానికి యిది చేయండి, అది చేయండి అంటూ ప్రతీవాడికీ పొరుగువాడిపై ద్వేషం పెంచారు. గ్రహశాంతులు చేయిస్తే, రాహుకేతు పూజ చేయిస్తే, రాళ్లు, రుద్రాక్షలు, ధరిస్తే, కారు నెంబరు, ఫోన్ నెంబరు అదృష్ట సంఖ్య అయితే, పేరులో స్పెల్లింగు మారిస్తే కష్టాలు తొలగిపోతాయని జనాలు భావించేట్లు మార్కెటింగు జరుగుతోంది. మార్కెటింగు బాగా సాగాలంటే జనాల్లో పాపభీతి పెరగాలి. పాపభీతి పెరిగితే చెడు పనులు తగ్గిపోవాలి. కానీ తగ్గటం లేదు.
జరుగుతున్నదేమిటంటే పాపాలు ఎలా కడుక్కోవాలో చెప్పడానికి కర్మకాండ మీద పడ్డారు. ఇప్పటిదాకా వినని పద్ధతులన్నీ చెప్పడం మొదలుపెట్టారు. కొబ్బరికాయ తిరగేసి కొట్టాలని, పాదాలకు నమస్కరించేప్పుడు కుడిచేత్తో అవతలివాళ్ల కుడిపాదం పట్టుకోవాలని.. యిలా వింతవింత విషయాలు, యిప్పటిదాకా విననివి 'ధర్మసూక్ష్మం', 'దేవరహస్యం' పేర చెప్పనారంభించారు. వీటికి ఆధారాలేమిటో ఎవరికీ తెలియవు. 'ధర్మసందేహాలు' అని కార్యక్రమాలు పెట్టేసరికి ప్రతీవాళ్లూ చిన్న చిన్న విషయాల దగ్గర్నుంచి – గుడి లోపలికి వెళ్లినపుడు చెప్పులు కుడివైపు విడవాలా, ఎడం వైపు విడవాలా లాటి విషయాలు కూడా అడగసాగారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు. ఇక్కడ చెప్పేవాడు కూడా అడిగేవాణ్ని లోకువ చేసి తమకు తోచినది చెప్పసాగారు. నిజానికి యీ బాహ్య ఆచారాలు, ఆడంబరాలు ముఖ్యం కాదు, అంతశ్శుద్ధి ముఖ్యం అని పురాణాల్లోనే ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది. ఇప్పుడు అది పోయింది. జనాల్లో పెరిగిన ఆధ్యాత్మిక.. నిజానికి యిది ఆధ్యాత్మిక కాదు, ఆచారాల – స్పృహ పెరిగినకొద్దీ ప్రవాచకులు, వారిలో కొందరు ప్రవాచాలకులు – పెరిగారు. జనాల్లో చాదస్తాలు పెంచారు.
ఈసారి పుష్కరాల సమయంలో కర్మకాండ మరింత పెరిగింది. గతంలో ఎప్పుడూ వినని చాదస్తాలు, పూజావిధానాలు యీసారి విన్నాను. పుష్కర సమయంలో ప్రతీ రోజు దానాలు యివ్వాలట. వాటిల్లో మేక దానం కూడా వుంది! మట్టి వేయడమట. లేకపోతే స్నానం చేసిన పుణ్యం రాక్షసి తినేస్తుందట. మనం చేసే పుణ్యాలు అంత చవకగా వున్నాయన్నమాట. పాపాలు తినే రాక్షసి వుందని తెలిస్తే మరింత జోరుగా పాపాలు చేద్దుం. ఆవునెయ్యి అక్షతలట. స్తోత్రాలట. పసుపు, కుంకుమలట. ఆడవాళ్లు నదికి పసుపు, కుంకుమలు సమర్పించడం చూశాను తప్ప ఆడామగా అందరూ యివ్వడం నాకు తెలియదు. మట్టి, మశానం, యివన్నీ పట్టుకొచ్చిన ప్లాస్టిక్ సంచీలతో నది నిండిపోతే పర్యావరణానికి ఎంత నష్టమో ఎవరైనా ఆలోచించారా? పుష్కరాలకు ముహూర్తమేమిటి? ఆ ముహూర్తంలోనే పీఠాధిపతులు, ముఖ్యమంత్రుల నుంచి మునగడ మేమిటి? గతంలో యిది లేదు. 12 రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు స్నానం చేసేవారు. పది నిమిషాలో, పావుగంటో కార్యక్రమం ఏదో చేసేవారు. ఇప్పుడు చంద్రబాబుగారు ఏకంగా గంటసేపు పూజా కార్యక్రమం చేశారు. ఆయనలాగే నదిలో మునిగిన ప్రతీవాడూ గంటసేపు పూజ చేస్తే స్నానాలు ఎప్పటికి తెమిలేను? ఆయనకు ఓటు-నోటు కష్టాలున్నాయి కాబట్టి గంట సేపు చేశారనుకుంటే, మనకూ మరో రకం కష్టాలు వున్నాయి.
ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు స్క్రోలింగ్స్ ద్వారా ప్రచారం చేయసాగారు – గోదావరిలో ఎక్కడైనా స్నానం చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు అంటూ. రాజుగారు అది ఆచరించి చూపితే అప్పుడు జనాలు నమ్మేవారు. మొత్తం ఫోకస్ రాజమండ్రిపై పెట్టడం ఘోరతప్పిదం. ఒక్క వూరు యింత రష్‌ను తట్టుకోలేదన్న సంగతి గ్రహించాలి. తట్టుకునేట్లా అది సన్నిద్ధమైందో చెక్ చేసుకోవాలి. రాజమండ్రిలో కూడా ఫలానా చోట ఆయన ముహూర్తం టైముకే మునుగుతారట అనగానే జనాలందరూ అక్కడేదో ప్రాముఖ్యత వుందనుకుని సరిగ్గా ముహూర్తం టైముకే చేయాలనుకుని అక్కడికి రెండు గంటల ముందే చేరుకున్నారు. తర్వాత వచ్చినవాళ్లు కూడా అక్కడే పోగడ్డారు. ఇక్కడ వెయిట్ చేయడం కంటె వేరే చోటికి వెళదామనుకుని వాళ్లకు అనిపించలేదు. ఇక్కడే ఏదో పుణ్యాలగని వుంది అనుకున్నారు. ముఖ్యమంత్రిగారికి వేరే విఐపి ఘాట్ వున్నా యిక్కడికే వచ్చేరంటే ఏదో క్షేత్రమహిమ వుండి వుంటుంది అని సాధారణ ప్రజలు తలచడంలో వింతేముంది?
సిఎం ఒకరేనా, ఎండోమెంట్స్ మంత్రితో సహా ఐదుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పీఠాధిపతి.. యింతమంది యిక్కడే మునుగుతున్నారంటే మనమూ యిక్కడే మునుగుదామని ఆరాటపడ్డారు పాపం. ముఖ్యమంత్రి గారికి విఐపి ఘాట్ వుందని తెలియదా? ఆయన ఎక్కడకి వస్తే అక్కడ హంగూఆర్భాటం వుంటుందని తెలియదా? అంత అమాయకుడా? అధికారం యివాళ వచ్చిందా? సిఎం 6 గంటలకు వస్తున్నారని తెలియడంతో గంట ముందు నుంచి అక్కడున్న యాత్రికులను బయటకు పంపారు. చుట్టూ మీడియా, బయట రోడ్డు మీద కాన్వాయ్, అధికారుల వాహనాలు, 108 వాహనం పెట్టడానికి కానీ, ప్రమాదం జరిగిన అరగంట తర్వాత రావడానికి కానీ వీలు లేకపోయింది. శవాలను, క్షతగాత్రులను చాలా దూరంలో ఆగిపోయిన వాహనాల వద్దకు మోసుకెళ్లాల్సి వచ్చింది. పురాణపరంగా కోటిలింగాల రేవుకి వున్న ప్రాముఖ్యత పుష్కర ఘాట్‌కు లేదు. అయితే విగ్రహాలు అవీ పెట్టడం చేత, బ్రిజ్ పక్కన వుండడంతో ప్రచారచిత్రం తీసుకోవడానికి అనువుగా వుంటుంది. వెనక్కాల వేలాది జనాలు ఎలాగూ వున్నారు. ఇదో పెద్ద యీవెంట్ అని బిల్డప్ యివ్వడానికి అనువైన చోటు. విఐపి ఘాట్‌లో చడీచప్పుడు కాకుండా చేస్తే యింత హంగు వుండదు. ఆ ప్రచారప్రీతే కొంప ముంచడం కాదు, కొంతమంది ప్రాణాలు బలిగొంది.(సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)