నాకు అధికారం కొత్త కాదు, సీఎం గా ఎక్కువ కాలం పనిచేశాను అంటున్నారు చంద్రబాబు. అయినా అధికారం కావాలని కోరుకుంటున్నారు. అయితే బాబుకు సరైన రిటార్ట్ ఇచ్చేశారు మంత్రి రోజా. అధికారం ఇస్తే ఏం చేస్తావు బాబూ అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు రోజా.
గత అయిదేళ్ళలో టీడీపీ చేసిన నిర్వాకం ఏంటో ప్రజలకు తెలియదా బాబూ అని నిలదీశారు. చిన్న పిల్లలకు పెట్టే కోడి గుడ్డు నుంచి స్టార్ హొటళ్ళలో బిల్లుల వరకూ అన్నీ దోచుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ రాష్ట్రాన్ని రాబంధుల్లా పీక్కుతిన్నారని ఆమె మండిపడ్డారు. డ్వాక్రా మహిళలను కూడా టీడీపీ మోసం చేయడాన్ని వారు మరచిపోతారు అనుకున్నారా అని రోజా నిగ్గదీశారు.
జగన్ మీద సొంతంగా యుద్ధం చేసే దమ్మూ ధైర్యం చంద్రబాబుకు, చినబాబుకు లేదని ఆమె దుయ్యబెట్టారు. టెన్త్ పరీక్షల లీకులు అన్నీ కూడా నారాయణ కళాశాలలోనే చేయించి మళ్ళీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తారా అని బాబు మీద ఆమె మండిపడ్డారు.
తనపైన అనుచిత విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని సైతం రోజా వదలలేదు, అయ్యన్నా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, వారి మీద మాట్లాడితే బాధపడరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఫైర్ బ్రాండ్ రోజా టీడీపీని అధినాయకుడినీ కలిపే గట్టిగా కౌంటర్లేశారు.