''చీకటిరాజ్యం'' సినిమా విడుదల సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒక పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చాడు. భారతీయ సినిమా స్థాయి చాలా గొప్పగా ఉందని.. ఇది ఆస్కార్‌ను తలదన్నే స్థాయికి చేరిందని వ్యాఖ్యానించాడు. మరి ఎవరో అనామకులు ఇలాంటి స్టేట్‌మెంట్ ఇస్తే దాన్నిలైట్ తీసుకోవచ్చుకానీ… కమల్ అలా మాట్లాడాడం మాత్రం ఆలోచించదగినదే. ఎందుకంటే.. కమల్ మాట బేస్‌లెస్. కమల్ వంటి వ్యక్తి ఇవ్వాల్సిన స్టేట్‌మెంట్ కాదు ఇది. ఒక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా… ఎంతో అనుభవం ఉన్న కమల్ ఇలా మాట్లాడటం విడ్డూరం కూడా. ఏ విధంగా చూసుకున్న భారతీయ సినిమా హాలీవుడ్ స్థాయిలో, ఆస్కార్ రేంజ్‌లో లేదని కుండబద్దలు కొట్టవచ్చు. అసలు కమల్ నుంచి ఇటువంటి స్టేట్‌మెంట్ రాకూడదు.. కానీ వచ్చింది. కాబట్టి ఆయన స్టేట్‌మెంట్‌ను ఆయన సినిమాలను ఆధారంగా చేసుకుని పోస్టుమార్టం చేస్తేనే… దీంట్లో డొల్లతనం బయటపడుతుంది!
మన సృజన కారులు సీడీలను చూసి కథలు తయారు చేయడం దగ్గర నుంచి… ఇంటర్నెట్‌లో సినిమాలను డౌన్‌లోడ్ చేసుకుని చూడటం వరకూ ఎదిగితే ఎదిగి ఉండవచ్చు గాక. కానీ మన దగ్గర కాపీ పోకడలు అయితే పోలేదు. మన దర్శక, రచయితలు తామురాసుకుంటున్న కథ, కథనాల విషయంలో ఆఖరి చిత్రీకరణలో సీన్లను కూడా విదేశీ సినిమాల స్ఫూర్తినే కనబరుస్తున్నారు. ఒకరని కాదు.. కాపీ తంత్రమే మనదగ్గర విజయమంత్రం. ఎవరో వద్దు… మన సినిమా ఆస్కార్‌ను తలదన్నుతోందన్న కమల్ తన సినిమా కాన్సెప్టులను ఎక్కడ నుంచి అరువు తెచ్చుకుంటున్నాడు? సృజనశీలిగా.. భారతదేశం గర్వించదగ్గ నటుడిగా పేరు ప్రఖ్యాతులు కలిగి.. తన సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకగణాన్నిదేశ వ్యాప్తంగా కలిగిన కమల్ విదేశీ సినిమాల మీద ఆధారపడటం లేదా? ఇలా మూలకథలనే కాపీ కొట్టే దశలో ఉన్నారు మన సినీ మేధావులు. ఆర్భక దర్శకులూ విదేశీ సినిమాలను కాపీ కొట్టడమే. మేధోదర్శకులూ కాపీ కొట్టడమే! ఇక మన స్థాయి ఎక్కడ మెరుగయినట్టు?!
కమల్ సినిమాలను ప్రస్తావిస్తూ పోతే.. ఆయనను ఒక రేంజ్‌లో నిలబెట్టిన సినిమాలన్నింటి వెనుక ఉన్నది కూడా విదేశీ ముడి సరుకే కదా! అసలు సంఖ్యాపరంగా కూడా హాలీవుడ్ సినిమాలను అత్యధికంగా స్ఫూర్తిగా తీసుకుని సినిమాలను రూపొందించింది కమల్ హాసనే! ఆయాసినిమాల్లో కేవలం నటుడు మాత్రమే కాదు.. స్క్రిప్ట్ విషయంలో రచయితగా తనూ ఒక చెయ్యి వేశాడు. కమల్ నటించిన గొప్ప సినిమాల్లో ఒకటి ''మహానది'' వేశ్యావాటికల పాలైన కూతురిని వెదుక్కొంటూ వెళ్లే ఒక తండ్రి గాథ అయిన ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమా స్పూర్తితో రూపొందించినదే. కమల్ సన్నిహితుడు సంతాన భారతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మరో సీరియస్ సినిమా ''సత్యమే శివం'' మరో హాలీవుడ్ సినిమాకు కాపీ. మూల కథను తీసుకుని దాన్ని లోకలైజ్ చేశారు.
ఇక కామెడీ పీస్ ''ఇంద్రుడు చంద్రుడు'' ''మూన్ అండ్ ప్రిడేటర్'' అనే మరో హాలీవుడ్ సినిమా ఆధారంగా రూపొందింది. తెనాలి, పంచతంత్రం, బ్రహ్మచారి వంటి సినిమాలు కూడా హాలీవుడ్ నుంచి తెచ్చుకున్నవే. అయితే మూల కథలు మాత్రమే. వాటికి కమల్ చాలా సొబగులు అద్దాడు. వాటి రూపురేఖలు మార్చాడు. సీరియస్ మూవీలను కామెడీగా మార్చాడు. తన మార్కు ట్రీట్‌మెంట్‌ను జొప్పించాడు. ఈ కృషి అంతా కమల్ సొంతమే. కానీ మూలం మాత్రం కాపీనే కదా. కేవలం తను నటించిన సినిమాల విషయంలో కాదు… రచయితగా ''నలదమయంతి'' అని ఒక తమిళ సినిమాకు పనిచేశాడు కమల్. అది కూడా ఒక హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తయారుచేసుకున్న కథే.
ఇలా నిందిస్తూ పోతే ఆ జాబితా చాంతడంత అవుతుంది. విడుదలకు సిద్ధం అయిన కమల్ తాజా సినిమా ''చీకటి రాజ్యం'' కూడా '' స్టీప్‌లెస్ నైట్'' అనే ఫ్రెంచి సినిమా స్ఫూర్తితో తీస్తున్నదే కదా! కేవలం కమల్ మాత్రమే కాదు. భారతదేశంలో భాష తేడా లేకుండా ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ ఇలాంటి కాపీ రాయుళ్లు ఎంతో మంది ఉన్నారు. మన దేశంలో నుంచి ఆస్కార్ కోసం పోటీపడతాయన్న సినిమాలు కూడా విదేశీ సినిమాలకు కాపీలుగా పేరుపొంది నవ్వుల పాలయ్యాయి. హిందీ సినిమా బర్ఫీ, కొన్ని తమిళ సినిమాలు విదేశీ క్యాటగిరిలో ఆస్కార్‌కు ఇండియా తరపునుంచి ఎంట్రీ ఇస్తాయనుకంటే.. అవన్నీ కాపీలుగా తేలాయి. అసలు మనదేశం వాళ్లే వాటిని ఆస్కార్స్‌కు పంపించడానికి తటపటాయించారు.
ఇక్కడ చెప్పేదేమిటంటే మన దగ్గరి ఉత్తమ సినిమాలుగా పేరుపొందిన సినిమాల, ఉత్తమనటదర్శకులు రూపొందిస్తున్న సినిమాల.. బతుకే ఇంత అయితే… మన సినిమా ఎక్కడ ఆస్కార్‌ను తలదన్నుతున్నట్టు?! ఇక బడ్జెట్….భారీ బడ్జెట్‌ను పెట్టడం ద్వారా మనోళ్లు హాలీవుడ్ స్థాయికి చేరుకున్నారనుకోవాలా? అయితే ఈ పోలిక పెట్టడం వృథా. హాలీవుడ్ గణాంకాలతో పోలిస్తే మన సినిమాలు సంఖ్యామానంలో చాలా దిగువన ఉంటాయనేది సత్యం. కాబట్టి.. ఇలా భుజాలు తడుముకోవడం కూడా తక్కువతనమే. ''బాహుబలి'' సినిమాను టీవీలో ప్రసారం చేస్తున్నప్పుడు అనౌన్స్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ''ప్రపంచ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన సినిమా'' అని. అలా మనంలోమనం చెప్పుకోవడానికి.. కాసేపు మురిసిపోవడానికి ఇలాంటి మాటలు బాగుంటాయి. కానీ కమల్ లాంటి వాళ్లు మాత్రం మాట్లాడకుండా ఉండాల్సిందిలా.
పోనీ సృజన, ఖర్చు, నాణ్యత, నవ్యత వంటి విషయాల్లో దగ్గరనుంచి పోల్చిచూస్తే మన సినిమాలు హాలీవుడ్ స్థాయిలో లేవు… కనీసం స్వేచ్ఛపరంగా అయినా… వైవిధ్యమైన సబ్జెక్టులను టచ్ చేయడంలో అయినా మనోళ్లు గొప్ప స్థాయిలో ఉన్నారా? అంటే అదీ లేదాయె! ఈ విషయంలోనూ కమల్‌నే ప్రస్తావించుకోవాలి. కమల్ ఏ సినిమా తీసినా దానితో ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి. ఎవరో ఒకరు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూనే ఉంటారు! ఒకటా రెండా.. ఈ మధ్యకాలంలోనే ''దశావతారం'' సినిమా దగ్గర నుంచి తీసుకుంటే హిందువులో, ముస్లింలో.. లేక ఏదైన కులం వాళ్లో ఏదో ఒక పిటిషన్ వేస్తున్నారు. ''విశ్వరూపం'' సినిమా విషయంలో పెద్ద వివాదమే నడించింది. కమల్ ఎంతోపోరాడితే.. ఎంతో మంది ఆయన కోసం గళం విప్పితే ఆ సినిమా చివరికెలాగో విడుదల అయ్యింది. అదీ మనదేశంలో ఉన్న భావస్వేచ్ఛ. హాలీవుడ్‌లో ''డావించీకోడ్'' లాంటి సినిమాలు ఎంచక్కా విడుదల అయ్యాయి. క్రైస్తవాన్ని అధికారమతంగా కలిగిన దేశాల్లో కూడా ఆ సినిమా విడుదలై వినోదాన్ని పంచింది. కానీ మనదేశంలో మాత్రం ఆ సినిమా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసింది. విడుదలకు అష్టకష్టాలు పడింది. పెద్ద వివాదం నడించింది కొన్ని నెలలపాటు! ఇవీ ఇక్కడి భావోద్వేగాలు. క్రైస్తవం పుట్టిన దేశాల్లోనూ.. కోట్లమంది క్రైస్తవులు ఉన్న దేశంలోనూ ఆ సినిమా విడుదల అయితే… మన దేశంలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కదా… అదేనా ఇక్కడ సృజనకు ఉన్న భావస్వేచ్ఛ. చివరకు ఆ సినిమాను ఒక వర్గం వారు చెప్పిన అభ్యంతరాల మేరకు సెన్సార్ చేస్తే కానీ విడుదల కానీయలేదు.
కాబట్టి.. ఈ విషయంలోనూ ఇండియన్ సినిమాకు మైనస్ మార్కులే! హాలీవుడ్‌తో పోలిస్తే ఇక్కడ భావస్వేచ్ఛ కూడా శూన్యం. ఇప్పుడు ప్రతి సినిమాకూ ప్రతిమతం, ప్రతి కులం, ప్రతి వర్గం, ప్రతి రాజకీయ పార్టీ గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వాల్సిందే. అప్పుడే ఆ సినిమా రిలీజవుతోంది. మరి రకంగా కూడా మన సినిమా వెనుకే ఉంది. ఇంకెక్కడ? మన సినిమా హాలీవుడ్ తలను తన్నుతుంది ఎక్కడ? ఏదో ప్రతి సంవత్సరం కొన్ని ఇండస్టీల్లో 150 సినిమాలు వస్తున్నాయి.. అందులో ఒక ఇరవై సినిమాల బడ్జెట్ ఇరవై కోట్లపై స్థాయిలో ఉంటోంది.. ఇక్కడి స్టార్లకు ట్విటర్లో లక్షల మంది పాలోయర్లు ఉంటున్నారు… ఇలాంటి గణాంకాలు చెప్పుకొంటూ హాలీవుడ్‌ను తలదన్నుతున్నామనుకుంటే పర్వాలేదు. కానీ కమల్ లాంటి వాళ్లు అలాంటి పనులు చేయకూడదు. తమ సృజనను ఏమైనా చాటి… దాన్ని అంతర్జాతీయ వేదికలపై పతాకశీర్షికలకు ఎక్కించి.. చూపితే, అప్పుడు మనకు మనం కాదు.. ప్రపంచ సినీ అభిమానులే చెబుతారు ఆస్కార్, హాలీవుడ్‌ల తలదన్నామని! అంత వరకూ కనీసం కమల్ లాంటి వాళ్లైనా ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వకుంటే నిజమైన సినిమా అభిమానులకు ప్రశాంతంగా ఉంటుంది!