ఎమ్బీయస్‌ : బాలచందర్‌ ఫార్ములా – 3

తమిళులు మెలోడ్రామాను, ట్రాజెడీలను ఎక్కువగా యిష్టపడతారు. చివరిలో ఏదో ఒక బలవంతపు ట్విస్టు పెట్టి హీరోనో, హీరోయిన్‌నో అన్యాయంగా చంపకపోతే వాళ్లకు నచ్చదు. ఉదాహరణకు ''పచ్చయ్‌ విళక్కు'' అనే సినిమాలో శివాజీ గణేశన్‌ రైల్వే…

తమిళులు మెలోడ్రామాను, ట్రాజెడీలను ఎక్కువగా యిష్టపడతారు. చివరిలో ఏదో ఒక బలవంతపు ట్విస్టు పెట్టి హీరోనో, హీరోయిన్‌నో అన్యాయంగా చంపకపోతే వాళ్లకు నచ్చదు. ఉదాహరణకు ''పచ్చయ్‌ విళక్కు'' అనే సినిమాలో శివాజీ గణేశన్‌ రైల్వే యింజన్‌ డ్రైవర్‌. చెల్లి సౌఖ్యం కోసం సర్వం త్యాగం చేస్తాడు. చెల్లి పెళ్లి అయ్యేదాకా భార్యతో సంసారం కూడా చేయనంటాడు. చివరకు పెళ్లయి, పరిస్థితి బాగుపడేసరికి అనుకోకుండా ఉద్యోగవిధుల్లో ఎమర్జన్సీ వస్తుంది. యాక్సిడెంటు కాకుండా ఓ రైలును ఆపబోయి, యింజను కింద పడి నలిగి పచ్చడవుతాడు. సినిమా తమిళంలో సూపర్‌ హిట్‌. తెలుగు డబ్బింగు (''మా అన్నయ్య'') ఎవరూ చూడలేదు. ఇలాటి ప్రేక్షకుల కోసం కెబి కూడా బలవంతపు (కంట్రైవ్‌డ్‌) ముగింపులు తన సినిమాల్లో చాలా పెట్టారు. 1974 నాటి ''అవళ్‌ ఒరు తొడర్‌ కథై'' (తెలుగులో ''అంతులేని కథ'' (1976)కు స్ఫూర్తి నిచ్చిన ''మేఘే ఢాకా తారా'' సినిమాలో హీరోయిన్‌ అన్నగారు బాధ్యతారహితంగా తిరుగుతాడు. చివరిలో డబ్బు గడించి అప్పటిదాకా కుటుంబం కోసం సర్వం త్యాగం చేసిన చెల్లెల్ని ఆదుకోవడానికి వస్తే ఆమెకు టిబి వచ్చి మృత్యుముఖంలో వుంటుంది. ''నాకు బతకాలని వుంది అన్నయ్యా'' అని ఆమె విలపిస్తూ వుండడంతో సినిమా పూర్తవుతుంది. ''అవళ్‌..'' లో బాగుపడిన అన్నగార్ని అన్యాయంగా చంపేసి యీమెను మళ్లీ ఆఫీసుకి పంపారు కెబి. 1973 నాటి ''ఆరంగేట్రం'' (తెలుగులో ''జీవితరంగం'' (1974)లో ఒక బ్రాహ్మణ యువతి పెద్ద కుటుంబాన్ని పోషించడానికి వేశ్యావృత్తి చేపడుతుంది. చివర్లో ఆ విషయం తెలిసి కుటుంబసభ్యులే యీసడించడంతో పిచ్చెక్కుతుంది. దానికి లీడ్‌ చేసిన దృశ్యం ఏమిటంటే యీమె చెల్లెల్ని పెళ్లాడడానికి వచ్చినవాడు యీమె వద్దకు గతంలో విటుడిగా వస్తాడు. అతనికి యీమె తన ఫ్యామిలీ ఫోటో చూపిస్తుంది. ఆ గ్రూపు ఫోటోలో అందరి మొహాలూ తీసేసి వుంటాయి కానీ మెళ్లో జందాలు వుంటాయి. తను బ్రాహ్మణ యువతినని చెప్పుకుంటుంది. ఏ వేశ్య అయినా తన నిజమైన పేరు, వూరు చెప్పదు. అవన్నీ మీకెందుకు అంటుంది. కానీ యీ హీరోయిన్‌ తన మూలాలు చెప్పడమే కాదు, చెల్లెల్ని పెళ్లాడడానికి వచ్చినపుడు అతను తనను గుర్తుపట్టాడని తెలిసి కూడా టీజ్‌ చేస్తూ పాట పాడుతుంది.  ఇలాటి కృత్రిమ సన్నివేశాలను కూడా భరించి తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు.

కెబి ఎక్కువగా బ్రాహ్మణ మధ్యతరగతి కుటుంబాలపైనే విల్లు ఎక్కుపెట్టారు. వేరే ఏ కులం జోలికీ వెళ్లలేదు. తనకు బాగా తెలిసున్న వాతావరణం అదే అనుకున్నారో, పతనం చూపడానికి వేరే వాళ్ల కంటె బ్రాహ్మణులను చూపిస్తే యింపాక్ట్‌ ఎక్కువ వుంటుందనుకున్నారో తెలియదు. తమిళనాట ద్రవిడోద్యమం బ్రాహ్మణులను విలన్లుగా చూపిస్తూ అప్పటికే చాలా సినిమాలు తీసింది కాబట్టి అక్కడి వాళ్లు అవి అబ్‌సార్బ్‌ చేసుకున్నారు. తక్కినవాళ్లకు మింగుడు పడలేదు. ''ఆరంగేట్రం''ను ''ఐనా'' (1977)గా హిందీలో ముంతాజ్‌ హీరోయిన్‌గా తీసినా ఆడలేదు. కెబికి యింకో అబ్సెషన్‌ తండ్రి పట్ల వ్యతిరేకత. తండ్రిని ఛాందసుడిగానో, బాధ్యతారహితుడిగానో చూపించి కొడుకుని తిరుగుబాటుదారుడిగా చూపిస్తారు. ''అపూర్వ రాగంగళ్‌''లో కొడుకు యింట్లోంచి పారిపోయేటంత డిసిప్లిన్‌ తండ్రిది. ''ఆకలి రాజ్యం''లో హీరో తండ్రి నిరుద్యోగి అయిన కొడుకుని అస్తమానూ తిడుతూనే వుంటాడు. హీరోయిన్‌ తండ్రి తాగుబోతు, తల్లి శవాన్నుంచి గాజులు కొట్టేసేటంత నీచమైన దొంగ. ''అంతులేని కథ''లో తండ్రి గంపెడు పిల్లల భారం మోయలేక సన్యాసం తీసుకుని పారిపోతాడు. ''జీవితరంగం''లో పెద్ద కూతురు తమ్ముళ్ల, చెల్లెళ్ల బాధ్యత తలకెత్తుకుని పడుపు వృత్తి చేసి డబ్బు పంపుతుంటే ఆదాయం పెద్దగా లేని పురోహితుడైన తండ్రి నిస్సిగ్గుగా పెళ్లాన్ని మళ్లీ గర్భవతిని చేస్తాడు. ''పున్నగై మన్నన్‌''లో తండ్రి తన కొడుకు జీవితం నాశనమై పోయినా పట్టించుకోకుండా తిరిగి, చివరిలో మంచివాడిగా మారినా అనుకోకుండా కొడుకు జీవితంలో విషాదానికి కారకుడవుతాడు. ''తప్పు తాళంగళ్‌'' (1978) అని రజనీకాంత్‌, సరితలతో పరమ శాడిస్టిక్‌ సినిమా వుంది. దానిలో కూతుర్ని తార్చే తండ్రి కనబడతాడు. ఇలాటి వాళ్లు సమాజంలో లేరని అనలేం. కానీ వాళ్లను హైలైట్‌ చేయడంతోనే వస్తుంది చిక్కు. ఇక ''ఉన్నాల్‌ ముడియుం తంబీ''  – తెలుగులో ''రుద్రవీణ'' (1988) సినిమాలో తండ్రి కర్ణాటక విద్వాంసుడు. కొడుకు ప్రజాసంగీతం పట్ల అనురక్తి కలవాడు. ''జయభేరి''లో పుత్రసమానుడిగా చూసుకునే శిష్యుడితో గురువుగారికి యిలాటి తగాదాయే. కానీ ఎంతో హుందాగా వుంటుంది. ఇక్కడ తండ్రిని పరమ దుర్మార్గంగా పేదల పట్ల జాలి లేనివాడిగా, చివరకు ఉక్రోషంతో కొడుక్కి వ్యతిరేకంగా కుట్ర పన్నేవాడిగా చూపించారు. అంత అవసరం లేదనిపిస్తుంది.

శాస్త్రీయ సంగీతం కంటె లలిత లేదా జానపద సంగీతం గొప్పది అని చూపించడం కూడా బాలచందర్‌ ఫార్ములాల్లో ఒకటి.  తమిళ ''సింధుభైరవి''లో తెలుగులో వున్న త్యాగరాజ కీర్తన శ్రోతలెవరూ వినరని, అదే సుబ్రహ్మణ్య భారతి పాట వినిపిస్తే జనాలకు ఎక్కుతుందని చూపించడానికి చాలా తంటాలు పడ్డారు. ''ఆకలిరాజ్యం'' (1981)లో శ్రీశ్రీ కవిత్వం వినిపించిన కెబి దాని తమిళవెర్షన్‌ ''వరుమైయుం నీరం సివప్పు'' (రాబోయే నీరు ఎఱుపు) లో సమకాలీన విప్లవకవి పద్యాలకు బదులు భారతి పాటలే వినిపించారు. ఆయన తీసిన ''అచ్చమిల్లయ్‌ అచ్చమిల్లయ్‌'' (1984) సినిమా పేరు కూడా భారతి పాటలో పల్లవే. ఇదీ,  కోమల స్వామినాథన్‌ కథతో తీసిన ''తన్నీర్‌ తన్నీర్‌'' బాలచందర్‌ సినిమాల్లో భిన్నమైనవి, ఎన్నదగినవి. ''ఆకలిరాజ్యం'' నిరుద్యోగ సమస్యను కర్కశంగా చూపిస్తూనే ఒక పాజిటివ్‌ నోట్‌తో ముగుస్తుంది. హిందీ వాళ్లకు అది సరిపోకపోయినా తెలుగువాళ్లకు నచ్చింది. ''మరో చరిత్ర'' ట్రెండ్‌ సెట్టర్‌. విషాదాంతం అయిన ప్రేమకథలే చరిత్రలో మిగులుతాయని మొదట్లోనే చెప్పి సినిమాను విషాదాంతం చేశారు, ఆల్‌రైట్‌. కానీ చావుకి ముందు హీరోయిన్‌ను మానభంగానికి గురి చేయాలా? అదీ ఒక ఫోర్స్‌డ్‌ సిట్యువేషన్‌తో!? ఆయనను ఎంతో ఆదరించిన తెలుగువాళ్లకు కొన్నాళ్లకు ఆయన అవలంబించిన ఫార్ములాలోని నెగటివిజమ్‌ మింగుడుపడడం మానేసింది. బాలచందర్‌ తమిళ రంగాన్ని విపరీతంగా ప్రభావితం చేయడంతో ఆయన శిష్యులు అనేకమంది పుట్టుకుని వచ్చారు. వాళ్లు మరింత అతి చేశారు. భారతీరాజా ''నిళర్‌గళ్‌''లో సినిసిజం భరించలేని స్థాయికి చేరుకుంది. క్రమేపీ కెబి బ్రాండ్‌ సినిమాలకు అక్కడా ఆదరణ తగ్గింది. ఆయన సొంతంగా సినిమాలు డైరక్టు చేయడం తగ్గించేశారు. టీవీ సీరియల్స్‌పై దృష్టి పెట్టారు.

నాటకాలకు, సినిమాలకు టేకింగ్‌లో వున్న తేడా కెబికి బాగా తెలుసు. కెమెరాను అత్యంత ప్రతిభావంతంగా వాడుకున్నారు. టేకింగ్‌లో, పాటల పిక్చరైజేషన్‌లో కొత్త పోకడలు పోయారు. నటీనటుల చేత సహజమైన నటనను రాబట్టారు. ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ వంటి జీనియస్‌ నుండి అద్భుతమైన సంగీతాన్ని పిండుకున్నారు. తెలుగులో ఆత్రేయ చేత పాటలు, గణేష్‌ పాత్రో చేత మాటలు రాయించుకుని స్థాయి నిలబెట్టుకున్నారు. ఇలా ఎన్నో విధాలుగా తన ముద్ర చాటుకుని, ఎందరికో ఆదర్శప్రాయుడైన బాలచందర్‌ నాటకీయతను, నెగటివిజమ్‌ను మాత్రం వదుల్చుకోలేకపోయారు. అదే ఆయన బలమూ, బలహీనతా. ఆయనకు యిదే నా నివాళి. – (సమాప్తం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)