లైఫ్ బాయ్ ఎక్కడ వుందో..ఆరోగ్యం అక్కడవుందీ…అంటూ వినపించే ప్రకటనలా..పూరి జగన్నాధ్ ఎక్కడ వుండునో, చార్మీ అక్కడ కనిపించును అన్నట్లు వుంది గడచిన కొంత కాలంగా సీన్. ఆ ఫ్రెండ్షిప్ (ఫ్రెండ్షిప్ అన్న పదం చార్మీదే..ఓ ఇంటర్వూలో) జ్యోతిలక్షి సినిమాకు ప్రొడక్షన్ వరకు వెళ్లింది.
అంతే కాదు ఆమెలో మంచి ఆడ్మినిస్ట్రేటర్, నిర్మాత దాగి వున్నాడని పూరి గుర్తించాడు. నిర్మాత సి కళ్యాణ్ కూడా గుర్తించాడు. తన తరువాత వరుణ్ తేజ సినిమాకు కూడా ఇదే టీమ్ పని చేస్తుందని బాహాటంగా ప్రకటించాడు. నితిన్ సినిమా ఆగిపోవడానికి కారణం కూడా ఈ ప్రొడక్షన్ బంధమే అని వార్తలు వినిపించాయి.
కట్ చేస్తే..ఈ రోజు వరుణ్ తేజ సినిమాకు క్లాప్ కొట్టారు. చిత్రంగా ఈ సందర్భంలో చార్మి జాడ లేనే లేదు. పైగా ఎప్పుడూ లేనిది, పూరి ప్రియమైన శ్రీమతి వచ్చి క్లాప్ కొట్టారు. చార్మి ఎక్కడా కనిపించలేదు ఏమిటి చెప్మా..అని కార్యక్రమ వివరాలు తెలుసుకున్న జనం గుసగుసలు పోయారు. చార్మి హ్యాండ్ జ్యోతిలక్ష్మికి అంతగా పనిచేయలేదని, కళ్యాణ్ పక్కన పెట్టేసారా అంటూ సెటైర్లు వినిపించాయి. ఇదేదో ముందే చేసి వుంటే, నితిన్ సినిమా కూడా పట్టాలు ఎక్కేది కదా?