ఏం జరుగుతోందో తెలియకపోవడంతో ప్రధాని కార్యాలయం మరింత గాబరా పడింది. మే 23న హియరింగ్స్ పూర్తయాక సిన్హా యింటి నుంచి బయటకు వెళ్లలేదు, ఫోన్లు ఎత్తడం లేదు. ఏం చేయాలో పాలుపోక యింటెలిజెన్సు వారిని ఆయన యింటిని చుట్టుముట్టమన్నారు. వీళ్లు అలా తచ్చాడడం గమనించిన జడ్జిగారికి మరీ చికాకేసింది. జూన్ 12 ఉదయం 10 గం||ల కల్లా ఠంచన్‌గా కోర్టుకి వచ్చేశారు. కోర్టు పేష్కర్ ముందే ప్రకటించాడు – ''తీర్పు వెలువడ్డాక చప్పట్లు కొట్టకూడదు'' అని. జడ్జి 235 పేజీల తీర్పు కాగితాలను ముందు పెట్టుకుని ''పిటిషన్ ఈజ్ ఎలౌడ్'' (అనుమతించబడింది) అని పలికారు. ఒక్క క్షణం అందరూ స్తంభించిపోయారు. అందరి మొహాల్లో చిరునవ్వులు విరిసాయి. పత్రికా విలేకరులు గబగబా టెలిఫోన్ల దగ్గరకు పరిగెత్తారు, తమ ఆఫీసులకు యీ కబురు చేరవేయడానికి! ఇంటెలిజెన్సు వారు అంతకంటె ముందే పరిగెత్తారు.
ఢిల్లీలో ప్రధాని ఆఫీసులో 10.02 ని||లకు యుఎన్‌ఐ టెలెక్స్ మిషన్ చప్పుడు వినబడడంతో శేషన్ అటు పరిగెట్టాడు. అది గబగబా అక్షరాలు టైపు కొడుతోంది – ''మిసెస్ గాంధీ అన్‌సీటెడ్'' అని. (శ్రీమతి గాంధీ తొలగించబడింది). వెంటనే ఆ కాగితం చింపి ఇందిర కూర్చున్న గదివైపుకి ఉరికాడు. అప్పటికి ఇండియన్ ఎయిర్‌లైన్సు పైలట్ మాత్రమే అయిన రాజీవ్ గాంధీ గది బయట కనబడితే అతని చేతికందించాడు. రాజీవ్ లోపలకి వెళ్లి తల్లితో ''వాళ్లు నిన్ను తీసేశారు'' అన్నాడు. ఆమె మొహం మీద ఎలాటి భావం వ్యక్తం కాలేదు. రోజులేమీ బాగా లేవని ఆమె అప్పటికే ఫీలవుతోంది. కితం రోజు రాత్రే ఆమెకు అత్యంత సన్నిహితుడు, సలహాదారుడు ఐన డి (దుర్గా) పి (ప్రసాద్) ధర్ చనిపోయాడు. అతను గతంలో ఆమెకు కాబినెట్ సహచరుడు, మాస్కోకు రాయబారి కూడా. కాస్సేపటికి టెలెక్స్‌పై యింకో వార్త వచ్చింది – 'ఇందిర ఆరేళ్లపాటు ఏ పదవీ చేపట్టరాదు' అని. ఇది మాత్రం ఆమెను కలవరపరిచింది. తన భావాలను బలవంతాన అణచుకుంటున్నట్లు చూసేవారికి అనిపించింది. ఆమె లేచి సిటింగ్ రూమ్ వైపు నడిచింది.
మొత్తం 14 ఆరోపణల్లో జస్టిస్ సిన్హా రెండు ఆరోపణలను ధృవీకరించారు. ఒకటి – తన ఎన్నికల ప్రచారంలో యశ్‌పాల్ కపూర్ అనే ప్రభుత్వాధికారి సేవలను ఆమె వినియోగించుకుంది. అతను ప్రభుత్వంలో పని చేస్తూండగానే 1971 జనవరి 7నుంచి ఆమె తరఫున ప్రచారంలో పాల్గొన్నాడు. దీనికి రుజువులున్నాయి. అతను తన డిపార్టుమెంటుకు జనవరి 13 న రాజీనామా పత్రం సమర్పించాడు. అది జనవరి 25 న ఆమోదించబడింది. జనవరి 25 వరకు ప్రభుత్వ సర్వీసులో వున్న వ్యక్తిని అభ్యర్థి తన రాజకీయ ప్రయోజనాలకై వాడుకున్నందుకు అది అక్రమమే. ఇక రెండవది – తన ఎన్నికల ఉపన్యాస వేదికలను కట్టడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు అధికారుల సేవలను ఇందిరా గాంధీ వాడుకున్నారు. ఆ అధికారులు స్టేజి కట్టడమే కాక, దానికి లౌడ్ స్పీకర్లు అమర్చారు, విద్యుత్ సప్లయి చేశారు. ప్రధానిగా కాక, ఎన్నికలలో అభ్యర్థిగా వుంటూ ప్రభుత్వ ధనాన్ని, మ్యాన్‌పవర్‌ను వాడుకున్నందుకు ఇందిర దోషియే. యశ్‌పాల్ కపూర్ ప్రచారంలో పాల్గొనకపోతే, వేదికలను ప్రభుత్వాధికారుల చేత కాకుండా కాంట్రాక్టర్ల చేత కట్టించి వుంటే రాజ్ నారాయణ్ గెలిచేవాడా అంటే కాదనే చెప్పాలి. కానీ చట్టప్రకారం ఒక పని నేరం అంటే నేరమే. అది వట్టి సాంకేతిక కారణమే కావచ్చు, అయినా ఆ కారణం చేత ఎన్నిక రద్దు చేసే అధికారం కోర్టుకి వుంది. జడ్జిగారు దాన్ని వినియోగించుకున్నారు.
కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలు ఇందిర నివాసం వుంటున్న 1, సఫ్దర్‌జంగ్ రోడ్డుకు తరలి వచ్చారు. అందరి కంటె ముందు వచ్చినది పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రి, ఇందిరకు వ్యక్తిగత స్నేహితుడు అయిన సిద్దార్థ శంకర్ రాయ్, కాంగ్రెసు అధ్యక్షుడు డి(దేవ్) కె(కాంత్) బరువా. ఏం మాట్లాడాలో తెలియక అందరూ బిక్కమొహాలు వేశారు. ఇందిర మొహం పాలిపోయి వుంది కానీ ప్రశాంతత కనబరుస్తోంది. కాంగ్రెసు పార్టీ జనరల్ సెక్రటరీలలో ఒకరైన పూర్వీ ముఖర్జీ బిగ్గరగా ఏడవసాగింది. ఇందిర మొహం చిట్లించి, ఆమెతో 'నీ బాధను అదుపులో పెట్టుకో' అని మందలించింది. ఆ తర్వాత అందరితో ''నేను రాజీనామా చేయవలసి వుంటుంది. దానికి సిద్ధపడితే మంచిది'' అంది. ''ఇది హై కోర్టు తీర్పే కదా, సుప్రీం కోర్టుకి వెళ్లవచ్చుగా'' అన్నారెవరో. ''దానికి టైము పడుతుంది కదా'' అన్నారు వేరెవరో. ఇలాటి పరిస్థితిలో ఏం చేయాలో బారిస్టరు, రాజ్యాంగ నిపుణుడు ఐన సిద్ధార్థ రాయ్, న్యాయశాఖ మంత్రి ఎచ్(హరి) ఆర్(రామచంద్ర) గోఖలేతో విడిగా కూర్చుని చర్చించసాగాడు.
ఇంతలో టెలెక్స్‌పై మరొక వార్త! తన తీర్పు అమలు కావడానికి సిన్హా 20 రోజుల గడువు యిచ్చాడు. అందరూ ఒక్కసారిగా రిలాక్సయ్యారు. వార్త నిజమో కాదో కనుక్కుందామని గోఖలే అలహాబాదుకు ఫోన్ చేశాడు. నిజమే అని తేలింది. తీర్పు వినగానే ఇందిర తరఫు న్యాయవాది ఖారే స్టే కోసం అడిగాడు. ''మామూలు పరిస్థితుల్లో అయితే యిద్దునేమో కానీ మీ ఇంటెలిజెన్సు వారు నన్ను, నా స్టాఫ్‌ను యిబ్బంది పెట్టారు'' అన్నాడు సిన్హా. ''అది ఆ డిపార్టుమెంటు వాళ్ల పొరబాటు, దానికి నా క్లయింటుకు శిక్ష పడడం అన్యాయం. ఆమె దేశప్రధాని. ఆ స్థానంలో ఎవరినంటే వారిని చటుక్కున కూర్చోబెట్టలేం. సమర్థుడికి అప్పగించకపోతే దేశం అస్తవ్యస్తమవుతుంది. సరైన వ్యక్తి కోసం పార్టీ సమావేశమవ్వాలి, చర్చించాలి, అందరి ఆమోదంతో కొత్త నాయకుడికి అధికారం అప్పగించాలి. టైము పడుతుంది. లేకపోతే అరాజకమే'' అని ఖారే వాదించాడు. సిన్హాకు అది సబబే అనిపించింది. తన తీర్పు అమలు కావడానికి 20 రోజుల గడువు ప్రసాదించాడు.
విపత్తు ముంచుకుని వచ్చిన ఆ క్షణంలో రాజీవ్ ఇందిర పక్కనే వున్నాడు. రెండో కొడుకు సంజయ్ తన మారుతి కారు ఫ్యాక్టరీలో వున్నాడు. అప్పటికి అది మారుతి-సుజుకి కాదు. చిన్నకారు తయారు చేయాలనే స్వప్నంతో సంజయ్ సొంతంగా నడుపుకునే సంస్థ. దానిలో ఏ కారూ తయారు కావటం లేదు. కేవలం ప్రయత్నాలే. అతనికి యీ కబురు చేరవేయాలని ఎవరికీ తోచలేదు. మధ్యాహ్న భోజనాల వేళకి అతను కారులో యింటికి వచ్చేటప్పటికి బయట జనం మూగివున్నారు. అప్పటికే తక్కిన మంత్రులు, అధికారులు, భజనమేళం అందరూ చేరిపోయారు. చూడగానే ఏదో జరిగిందని గ్రహించిన సంజయ్ డైరక్టుగా తల్లి వద్దకు వెళ్లాడు. అతన్ని చూడగానే ఆమె మొహం వెలిగింది. అప్పటికి అతని వయసు 28 మాత్రమే అయినా, వయసుకు మించిన పరిణతి వచ్చిందని ఇందిర విశ్వాసం. కొడుకులిద్దరినీ వెంటపెట్టుకుని విడిగా కూర్చుని ఏమంటారు అని అడిగింది. ఇద్దరూ ముక్తకంఠంతో ''నువ్వు రాజీనామా చేయవద్దు'' అన్నారు. సంజయ్ మరీ దృఢంగా చెప్పాడు – ''నువ్వు భయపడవలసింది ప్రతిపక్షాలను చూసి కాదు, నీ పార్టీలోనే వున్న ఆశపోతులను చూసి! నువ్వు ఒక్కసారి దిగితే మళ్లీ ఎక్కనివ్వరు.'' అని చెప్పాడు.
మరి ఏం చేయాలి? ఇప్పుడు కొనసాగితే హై కోర్టు చెప్పినా గద్దె వదలలేదన్న అపఖ్యాతి వస్తుంది. సుప్రీం కోర్టుకి వెళ్లి హై కోర్టు తీర్పు కొట్టేయించుకుంటే ఆ మచ్చ చెరిగిపోతుంది. కానీ ఒకవేళ సుప్రీం కోర్టు, హై కోర్టు తీర్పును సమర్థిస్తే…? పదవీ పోతుంది, మచ్చ శాశ్వతంగా వుండిపోతుంది. గతంలో ఏం జరిగింది? ఇలాటి కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్టు అంతిమ తీర్పు వచ్చేవరకు పదవిలో కొనసాగవచ్చని, పార్లమెంటులో ఓటు వేయకూడదని, చర్చల్లో పాల్గొనకూడదని, ఎలవన్సు తీసుకోకూడదని యిలాటి షరతులు విధించింది. ఇలాటి షరతే పెట్టినా రాజ్యాంగంలోని సెక్షన్ 88 ప్రకారం మంత్రి ఓటు వేయలేకపోయినా చర్చల్లో పాల్గొనవచ్చును. తను సాక్షాత్తు ప్రధానమంత్రి. తను ఓటు వేయకపోయినా ఫర్వాలేదన్నంత మెజారిటీ వుంది తన పార్టీకి. కానీ.. కానీ.. ఈ కేసు విచారించే జడ్జి అలాటి షరతులతో సరిపెడతాడో, లేక హై కోర్టులాగే కఠినంగా వుంటాడో! ఏం తెలుసు? పదవిలోంచి తప్పుకుని ఎవరికైనా అప్పగించి, సుప్రీం కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చాక మళ్లీ తనకు అప్పగించమంటే అప్పగిస్తారా? ఆ పాటికి వాళ్ల చుట్టూ అనుచరులు తనను తరిమేస్తే తన పక్షాన ఎవరు నిలుస్తారు? ఈ రోజు ఏ అగస్త్యభ్రాతను కూర్చోపెట్టినా 'వేసేటప్పుడు వేపమొక్క, తీసేటప్పుడు అమ్మోరు' సామెతలా అయిపోతాడు. అంతకంటె ఎవరేమనుకున్నా ఫర్వాలేదు అనుకుని పదవిలో కొనసాగితే..? అమ్మో, అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠ ఏం కాను? ఇప్పటికే దేశంలో ప్రతిపక్షాలన్నీ తనకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాయి. ఇందిర యిలాటి సందేహాలతో కొట్టుమిట్టులాడుతూండగానే గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్షాలన్నీ జనమోర్చా పేరుతో ఏకమై, జయప్రకాశ్ నారాయణ్ నైతిక మద్దతుతో కాంగ్రెసును ఓడించాయి. ధర్ మరణం, కోర్టు తీర్పు, గుజరాత్‌లో ఓటమి ఒకే రోజు రావడంతో ఇందిర యింకా కృంగిపోయింది. సాహసంగా ఏమైనా చేయాలంటే ధైర్యం చాలటం లేదు. (సశేషం) (ఫోటో – జస్టిస్ సిన్హా)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)